ఐదు రాష్ట్రాల్లో ఆప్‌ – కాంగ్రెస్‌ మధ్య కుదిరిన పొత్తు

* అవినీతి కూటమిగా బిజెపి అభివర్ణన

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీల మధ్య ఢిల్లీ సహా గుజరాత్‌, హర్యానా, చండీగఢ్‌, గోవాలో సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చింది.  ఐదు రాష్ట్రాల్లో కలిసి పోటీ చేస్తున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించాయి. దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం 7 లోక్‌సభ స్థానాలకు గానూ అధికార ఆప్‌ నాలుగు స్థానాల్లో పోటీ చేయనుంది. 

సీఎం కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, న్యూఢిల్లీలో పోటీ చేయనుంది. ఇక కాంగ్రెస్‌ నార్త్‌ ఈస్ట్‌ ఢిల్లీ, నార్త్‌ వెస్ట్‌ ఢిల్లీ, చాందినీ చౌక్‌ స్థానాల్లో బరిలో నిలవనుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ వెల్లడించారు.

గుజరాత్‌లో 26 లోక్‌సభ స్థానాలకు గానూ కాంగ్రెస్‌ 24 స్థానాల్లో పోటీ చేయనుంది. ఆప్‌కు రెండు స్థానాలు కేటాయించారు. భరూచ్‌, భావ్‌నగర్‌లో ఆప్‌ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. అదేవిధంగా హర్యానాలో మొత్తం 10 లోక్‌సభ స్థానాలకు గానూ కాంగ్రెస్‌కు 9 స్థానాల్లో పోటీకి దిగనుంది. ఆప్‌ ఒక్కస్థానం కురుక్షేత్రలో బరిలో నిలవనుంది. 

గోవా, చండీగఢ్‌ లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ మాత్రమే పోటీలో నిలిచేలా ఒప్పందం కుదిరినట్లు ముకుల్ వాస్నిక్ తెలిపారు. ఇక గోవా, చండీగఢ్‌ లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ ఒంటరిగానే బరిలో దిగనుంది. గోవాలో ఉన్న రెండు లోక్సభ నియోజకవర్గాలు, చండీగఢ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పోటీ చేయనుంది. మరోవైపు పంజాబ్‌లో ఇరు పార్టీల మ‌ధ్య ఎలాంటి పొత్తు ఉండ‌బోద‌ని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఇప్పటికే స్పష్టం చేశారు. పంజాబ్‌లో మొత్తం 13 స్థానాల్లో ఆప్‌, కాంగ్రెస్‌ విడివిడిగానే బ‌రిలోకి దిగుతాయని చెప్పారు.

అయితే, ఆప్, కాంగ్రెస్ మధ్య కుదిరిన పొత్తును అవినీతి కూటమిగా బిజెపి అభివర్ణించింది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని అధికార కూటమిని ఢీకొనే సత్తా ఈ రెండు పార్టీలకు ఏ రకంగాను లేవని కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి, ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ స్పష్టం చేశారు.  ఈ రెండు పార్టీలు పొత్తు కుదుర్చుకున్న ఢిల్లీ, గుజరాత్, హర్యానా, చండీగఢ్, గోవాలో బిజెపికి గత లోక్‌సభ ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓట్లు వచ్చాయని లేఖి తెలిపారు. ప్రజా సేవకే అంకితమైన వారికి ఈ అవినీతి కూటమి ఏ రకంగాను పోటీ కాదని ఆమె చెప్పారు.

గతంలో కాంగ్రెస్ నాయకులపై ఆప్ నాయకులు అవినీతి ఆరోపణలు గుప్పించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలతో తన అనుబంధాన్ని కోల్పోయారని సచ్‌దేవ వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్ సారథ్యంలోని యుపిఎ ప్రభుత్వంలో పనిచేసిన చాలా మంది మంత్రులను అవినీతిపరులుగా వర్ణించిన కేజ్రీవాల్ దివంగత రాజీవ్ గాంధీకి ప్రకటించిన భారతరత్నను కూడా ఉపసంహరించాలని డిమాండు చేశారని లేఖి గుర్తు చేశారు.

మరోవంక, గుజరాత్ లోని భరూచ్ స్థానం ఆప్‌కు కేటాయించడంపై కాంగ్రెస్ నేత, దివంగత అహ్మద్ పటేల్ కూతురు ముంతాజ్ పటేల్ అసహనం వ్యక్తం చేశారు. ‘ఆప్’తో కుదుర్చుకున్న పొత్తులో భరూచ్ స్థానాన్ని వదులుకున్నందుకు జిల్లా కార్యకర్తలను ఆమె క్షమాపణ కోరారు. `అహ్మద్ పటేల్ 45 ఏండ్ల వారసత్వాన్ని మేం వృథా కానివ్వం. ఐక్యంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తాం’ అని ముంతాజ్ పటేల్ తన ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.