ఇంగ్లాండ్ మ్యాచ్‌లో రికార్డులు సృష్టిస్తున్న జైస్వాల్

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో యశస్వి జైస్వాల్ రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లను దాటిగా ఎదుర్కొంటూ పరుగుల వరద కురిపిస్తున్నాడు. ఇవ్వాల రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో 73 పరుగులు చేసి జైస్వాల్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 
 
టెస్టు సిరీస్‌లో 600కి పైగా పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.  నిరుడు టెస్టుల్లో అరంగేట్రం చేసిన య‌శ‌స్వీ ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో, అతను ఏడు ఇన్నింగ్స్‌లలో 103 సగటుతో 78.32 స్ట్రైక్ రేట్‌తో 618 పరుగులు చేశాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు, రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. 

ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన భారత ఆటగాళ్లలో సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ, దిలీప్ సర్దేశాయ్, రాహుల్ ద్రవిడ్ ఉన్నారు. వారి తర్వాత, ఒక టెస్ట్ సిరీస్‌లో 600 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన 5వ భారత ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు. టెస్టు సిరీస్‌లో 700కి పైగా పరుగులు చేసిన ఏకైక భారత ఆటగాడు సునీల్ గవాస్కర్. 1971లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో గవాస్కర్ 4 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలతో 774 పరుగులు చేశాడు.

1978-79లో వెస్టిండీస్‌పై 732 పరుగులు చేశాడు. అయితే ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో జైస్వాల్‌కు మరో మూడు ఇన్నింగ్స్‌లు ఆడే అవకాశం ఉంది. ఈ మూడు ఇన్నింగ్స్‌ల్లో రాణిస్తే గవాస్కర్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. కెరీర్ మొద‌లెట్టిన కొన్ని రోజుల్లోనే ఈ యంగ్‌స్ట‌ర్ 2 సెంచ‌రీలు, రెండు ఫిఫ్టీలు సాధించి భార‌త భావితార‌గా ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు.

బ‌ల‌మైన ఫుట్‌వ‌ర్క్, షాట్ సెలెక్ష‌న్‌లో క‌చ్చిత‌త్వం, అల‌వోక‌గా బౌండ‌రీలు, సిక్స‌ర్లు బాద‌గ‌ల నైపుణ్యంతో య‌శ‌స్వీ భార‌త క్రికెట్‌కు త‌ర‌గ‌ని ఆస్తిలా మారుతున్నాడు. ఇలా ఉండగా, రాంచీ వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్ జట్టు బ్యాటింగ్ లో య‌శ‌స్వీ జైశ్వాల్ మిన‌హా మిగిలిన బ్యాట‌ర్స్ స్వ‌ల్ప స్కోర్ల‌కే వెనుతిరిగారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 353 పరుగులకు ఆలౌట్ అయింది. 

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు 7వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. జైస్వాల్ 73 పరుగులు, శుభమాన్ గిల్ 38 పరుగులకు ఔట్ కాగా, జురెల్ 30 పరుగులు, కుల్దీప్ యాదవ్ 17 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు. దీంతో 134 పరుగుల లీడ్ లో ఇంగ్లండ్ జట్టు ఉంది.