రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమై సరిగ్గా రెండేండ్లు

రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమై సరిగ్గా రెండేండ్లు గడిచాయి. యుద్ధం ఉక్రెయిన్‌ ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసింది. 2022, ఫిబ్రవరి 24న రష్యా సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై దాడులు ప్రారంభించింది.  రష్యా సైన్యం దాడులు ఉక్రెయిన్‌ బలగాల ప్రతి దాడులతో ఇది భీకర యుద్ధంగా మారింది. ఇరువైపులా వేలాదిగా సైనికులు, సాధారణ పౌరులు మరణించగా, అంత కంటే ఎక్కువ సంఖ్యలో గాయపడ్డారు.
మరణాల సంఖ్యపై రెండు దేశాలు అధికారిక ప్రకటనలు చేయకపోవడంతో, మృతి చెందిన వారి సంఖ్యపై స్పష్టత లేదు. యుద్ధంలో రష్యా వైపు 1,20,00 మంది సైనికులు మరణించగా, దాదాపు 1,80,000 మంది గాయపడ్డారని అమెరికా రక్షణశాఖ అధికారులు ఇటీవల పేర్కొన్నారు. అదేవిధంగా 70 వేల మంది ఉక్రెయిన్‌ జవాన్లు మరణించగా, లక్ష మందికి పైగా గాయపడ్డారని తెలిపారు.

రష్యా సైన్యం మెరుపు దాడులతో ఉక్రెయిన్‌ భూభాగంలోకి చొచ్చుకుపోయింది. ఖార్కీవ్‌, డొనెట్స్‌, ఖేర్సన్‌, లూహాన్స్‌, జపోరిజ్జియా రీజియన్లను స్వాధీనం చేసుకొన్నట్టు అనతి కాలంలోనే ప్రకటించుకొన్నది. అయితే సమర్థవంతమైన ప్రతిఘటనతో ఉక్రెయిన్‌ బలగాలు ఆయా రీజియన్లలోని పలు ప్రాంతాలను తిరిగి తమ చేతిలోకి తీసుకొన్నాయి.

 ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను రష్యా బలగాలు మూడు రోజుల్లోనే స్వాధీనం చేసుకొంటాయని కొంత మంది అంచనా వేశారు. అయితే ఉక్రెయిన్‌ సైనికుల ప్రతిఘటనతో ఆ మూడు రోజులు పోయి నేటితో రెండు దేశాల మధ్య పోరు మూడో సంవత్సరంలోకి ప్రవేశించింది. యుద్ధంలో మొదట పైచేయి సాధించిన రష్యా తర్వాత క్రమంగా పట్టు కోల్పోతూ వచ్చినట్టు కనిపిస్తున్నది. 

ఈ క్రమంలో రష్యాకు చెందిన వేలాది మంది సైనికులు మరణించారు. దీంతో రష్యా ప్రత్యేక సైనిక నియామకాలు కూడా చేపట్టాల్సి వచ్చింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపైనా పడింది. ప్రపంచ వాణిజ్యం ప్రభావితమైంది. ప్రధానంగా ఆహార, ఇంధన మార్కెట్లు దెబ్బతిన్నాయి. రెండు దేశాల నుంచి సరఫరా నిలిచిపోవడంతో ధరలు ఆకాశాన్నంటాయి. 

ఇంధన ధరలు విపరీతంగా పెరుగడంతో పాటు ఆహార కొరత ఏర్పడింది. మరోవైపు యుద్ధం నేపథ్యంలో అమెరికా సహా పలు పశ్చిమ దేశాలు రష్యాపై పలు రకాల ఆంక్షలు విధించాయి. దీనికి ప్రతిగా రష్యా కూడా పలు చర్యలు తీసుకొన్నది. దీంతో ప్రధానంగా రష్యా నుంచి ఇంధన దిగుమతులపై ఆధారపడే ఐరోపా దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. 

తాజాగా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి రెండేండ్లు ముగియడం, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ జైల్లో మృతికి స్పందనగా అమెరికా శుక్రవారం 500కు పైగా రష్యా సంబంధిత వ్యక్తులు, సంస్థలపై ఆంక్షలు విధించింది.