బీబీసీ చైర్మన్‌గా భారత సంతతి వ్యక్తి

బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌(బీబీసీ) నూతన చైర్మన్‌గా తొలిసారిగా భారతీయ మూలాలున్న డాక్టర్‌ సమీర్‌ షా ఎంపికయ్యారు. ఈ మేరకు గురువారం బ్రిటన్‌ సాంస్కృతిక కార్యదర్శి లూసీ ఫ్రేజర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. 72 ఏళ్ల సమీర్‌ భారత్‌లోని ఔరంగాబాద్‌లో జన్మించారు. తర్వాత 1960లో బ్రిటన్‌కు వలస వెళ్లారు. 
 
టీవీ ప్రొడక్షన్‌, జర్నలిజంలో 40ఏండ్లకుపైగా అనుభవం కలిగిన సమీర్‌ షా గతంలో బీబీసీ కరెంట్‌ అఫైర్స్‌, పొలిటికల్‌ ప్రోగ్రామ్స్‌ హెడ్‌గా పనిచేశారు. గతంలో బీబీసీ నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా సేవలందించారు. హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ ఎంపీలతో కూడిన ఎంపిక కమిటీ ఆయన పేరును ఖరారుచేయగా, బ్రిటన్‌ రాజు చార్లెస్‌-3 ఈవారమే సంబంధిత ఎంపిక ప్రక్రియకు ఆమోద ముద్ర వేయడంతో గురువారం ఆయన నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. 
 
మార్చి నాలుగో తేదీ నుంచి నాలుగేళ్లపాటు ఈ పదవిలో కొనసాగే సమీర్‌ దాదాపు రూ.1.68 కోట్ల వార్షిక వేతనం అందుకోనున్నారు. బ్రిటన్‌ టెలివిజన్‌ రంగానికి చేసిన విశేష కృషికిగాను 2019లో దివంగత బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 సమీర్‌ను కమాండర్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌తో సత్కరించారు.  1998 నుంచి సొంతంగా జ్యూపిటర్‌ టీవీని ఈయన నడుపుతున్నారు. మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో తెరవెనుక వ్యవహారం బయటపడటంతో రిచర్డ్‌ షార్ప్‌ బీబీసీ చైర్మన్‌ పదవికి గత ఏడాది రాజీనామా చేయాల్సి వచ్చింది.