విదేశీ విద్యార్థులకు కెనడా వారానికి 24 గంటలే వర్క్ పర్మిట్

కెనడాలోని విద్యా సంస్థల్లో సెప్టెంబర్ లో ప్రారంభమయ్యే ఫాల్ సెమిస్టర్ నుంచి  అంతర్జాతీయ విద్యార్థులు పని చేసే గంటల పరిమితిని వారానికి 24 గంటలకు నిర్ధారిస్తూ కెనడా నిర్ణయం తీసుకోనుంది. అంతర్జాతీయ విద్యార్థులు ప్రతి వారం 20 గంటలకు పైగా పనిచేయడానికి అనుమతించే తాత్కాలిక విధానం మంగళవారంతో ముగియనుండటంతో కెనడా ఇమ్మిగ్రేషన్, శరణార్థులు, పౌరసత్వ మంత్రి మార్క్ మిల్లర్ఒట్టావాలో ఈ ప్రకటన చేశారు.

‘‘కెనడాకు వచ్చే విద్యార్థులు ఇక్కడే చదువుకోవడానికి ఉండాలి. అందువల్ల, వారు వారానికి 24 గంటలు మాత్రమే పనిచేయడానికి అనుమతించడం వల్ల వారు ప్రధానంగా తమ చదువుపై దృష్టి పెడతారు. అవసరమైనంత మేరకే పని చేసే అవకాశం ఉంటుంది’’ అని ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్షిప్ కెనడా (ఐఆర్సిసి) ఒక ప్రకటనలో తెలిపింది. 

కరోనా మహమ్మారి సమయంలో ప్రవేశపెట్టిన విధానంలో విదేశీ విద్యార్థులు ప్రతి వారం 40 గంటలు పనిచేయడానికి అనుమతి ఉంది. అంటే విదేశీ విద్యార్థులు వారానికి పని చేసే సమయం దాదాపు 16 గంటలు తగ్గుతుంది. అయితే, అలాంటి విద్యార్థులు వేసవి సెలవుల వంటి నిర్ణీత సెలవు రోజుల్లో అపరిమిత గంటలు పని చేయవచ్చు. 

మరోవంక, ప్రభుత్వ విద్యా సంస్థ లైసెన్స్ తో నడుస్తున్న ప్రైవేటు కాలేజీలో చేరిన విదేశీ విద్యార్థులకు, తమ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత, పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్ పొందడానికి అర్హులు కాదని ఐఆర్ సీ సీ స్పష్టం చేసింది. అయితే, ఈ నిబంధన ఈ సంవత్సరం మే 15వ తేదీ తరువాత జాయిన్ అయిన విదేశీ విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది.

అకడమిక్ ఫలితాల్లో రాజీ పడకుండా విద్యార్థులకు పని చేసే అవకాశాన్ని కల్పించడం మధ్య “తగిన సమతుల్యతను” సాధించడానికి ఈ విధానం ప్రయత్నిస్తుందని ఐఆర్సీసీ పేర్కొంది. కెనడాకు వచ్చే విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికే ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది. 2023 లో మొత్తం 6,84,385 స్టడీ పర్మిట్లను కెనడా జారీ చేసింది. వాటిలో 278,860 వర్క్ పర్మిట్లను భారతీయ విద్యార్థులే సాధించారు.