నాటో ఒప్పందంలోని ఆర్టికల్-5 ప్రకారం ఒక సభ్యదేశంపై దాడి జరిగితే, దాన్ని కూటమిలోని అన్ని దేశాలపై జరిగిన దాడిగా పరిగణించి సమష్టిగా రక్షణ కల్పించాల్సి ఉంటుంది. అయితే ఉక్రెయిన్‌కు ఇలాంటి హామీలు కల్పిస్తే వాటిని ఏ విధంగా అమలు చేస్తారు? సమష్టి రక్షణలో ఏయే దేశాలు భాగస్వాములవుతాయి? రష్యా మరోసారి దాడికి దిగితే ఆయా దేశాలు ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తాయా? అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు.
భద్రతా హామీలు కేవలం మాటలకే పరిమితం కాకూడదని, వాటిని స్పష్టంగా పత్రాల్లో పొందుపరచాలని కోరారు. ఉక్రెయిన్ ప్రజలతోపాటు యావత్ ఐరోపాకు భద్రత కల్పించేలా హామీలు ఉండాలని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీకాలం ఉన్న రెండేళ్లకే పరిమితమయ్యే భద్రతా ఒప్పందాలు తమకు అవసరం లేదని జెలెన్స్కీ స్పష్టం చేశారు. ఆ తర్వాత కూడా కొనసాగుతూ, దీర్ఘకాలికంగా దేశానికి రక్షణ కల్పించే హామీలు కావాలని కోరారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ట్రంప్ మధ్య స్నేహ సంబంధాలు ఉన్నప్పటికీ, మరో రెండేళ్ల పాటు రష్యా దాడి చేయకుండా ఉంటుందనే హామీ తమకు సరిపోదని వ్యాఖ్యానించారు. అలాంటి ఒప్పందం శాశ్వత శాంతిని ఇవ్వదని, కేవలం రెండేళ్ల విరామం మాత్రమే కల్పిస్తుందని చెప్పారు.
అంతర్జాతీయ సరిహద్దులను మార్చడం, ప్రపంచాన్ని వివిధ దేశాల ప్రభావ పరిధులుగా విభజించడం ద్వారా కొత్త యాల్టా ఒప్పందం తరహా వ్యవస్థను తీసుకురావాలన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రయత్నాలు ఫలించలేదని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. అమెరికా, రష్యా మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ఉక్రెయిన్ అంశం ప్రస్తావనకు రాలేదని తెలిపారు. సరిహద్దుల పునర్విభజనపై ఎలాంటి ఒప్పందం కుదిరినట్లు బహిరంగంగా వెల్లడికాలేదని చెప్పారు.
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీయిజం, ఫాసిజంపై సాధించిన విజయాలను గుర్తుచేసే ఉద్దేశం నిజంగా ఉంటే అమెరికా, ఐరోపా, ఉక్రెయిన్ దేశాలు ఆ సమావేశంలో భాగస్వాములై ఉండాల్సిందని పేర్కొన్నారు. రష్యా కాకుండా ఈ మూడు పక్షాల మధ్య త్రైపాక్షిక సమావేశం జరగాల్సిందని అభిప్రాయపడ్డారు.పుతిన్ వైఖరిని ప్రపంచానికి మరోసారి గుర్తుచేయాల్సిన అవసరం లేదని, ఆయన గత చర్యలను ప్రపంచం మర్చిపోలేదని వ్యాఖ్యానించారు.

More Stories
రష్యా నౌకపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి?
`పహాల్గమ్’ గోప్రో కెమెరాపై ఇంకా స్పందించని చైనా
పన్నూన్ హత్యకు కుట్ర.. నిఖిల్ గుప్తాకు అమెరికాలో 19 ఏళ్ల జైలు