వ‌న దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకున్న గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై

మేడారం మహాజాతరలో రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందర్ రాజన్, కేంద్ర మంత్రి అర్జున్ ముందా పాల్గొన్నారు. శుక్రవారం మేడార జాతరకు వెళ్లిన గవర్నర్, కేంద్ర మంత్రి  సమ్మక్క-సారలమ్మను దర్శించుకొని, వనదేవతలకు స్వర్ణం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా గవర్నర్, కేంద్ర మంత్రి నిలువెత్తు బంగారం సమర్పించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తమిళిసై, అర్జున్ ముండా వనదేవతలను దర్శించుకున్నారు. భారతదేశంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా గిరిజనులు ఐక్యంగా ఉండి సంతోషంగా ఉండాలని వన దేవతలను మొక్కుకున్నట్లు గవర్నర్ తన మనసులో మాటను బయటపెట్టారు. 

లక్షల కొద్దీ ప్రజలు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారని తెలిపారు. ‘‘నేను గవర్నర్‌గా మూడోసారి మేడారం జాతరకు రావడం నా అదృష్టం’’ అని గవర్నర్ తమిళిసై హర్షం వ్యక్తం చేశారు. గిరిజనులను అభివృద్ది చేయాలనే తనకున్న బలమైన కోరికతో ఇక్కడి 6 గిరిజన గ్రామాలను దత్తత తీసుకున్నట్లు తెలిపారు.

దేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర మేడారమని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా తెలిపారు. మేడారంలో వన దేవతలను దర్శించుకుని మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనులు తెలంగాణతో పాటు చత్తీస్ గఢ్ రాష్ట్రంలో గిరిజనులు ఎక్కువగా ఉంటారని, రెండు రాష్ట్రాల ఆదివాసులకు మేడారం వరమని ఆయన పేర్కొన్నారు. మేడారాన్ని గిరిజన ఉత్సవం జాతరగా జరిపేందుకు ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అంత‌కు ముందు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా, గవర్నర్ తమిళిసై శుక్రవారం ఉదయం హెలికాప్టర్‌లో మేడారం చేరుకున్నారు. వీరికి మంత్రి సీతక్క, ఈటెల రాజేందర్, జిల్లా కలెక్టర్, త్రిపాఠి ఘనస్వాగతం పలికారు. అనంతరం వనదేవతల దర్శనానికి ఏర్పాట్లు చేశారు.

కాగా.. సమ్మక్క-సారలమ్మల నామస్మరణతో మేడారం మహా జాతర ప్రాంగణం మార్మోగుతోంది. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, ఎత్తు బంగారాలను భక్తులు సమర్పిస్తున్నారు. ఇప్పటికే గద్దెలపైకి సమక్క సారలమ్మలు చేరుకోవడంతో అమ్మవార్లను దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈనెల 21 నుంచి జాతర ప్రారంభమవగా.. నాలుగు రోజుల పాటు వనదేవతల జాతర జరుగనుంది. తిరిగి అమ్మవార్ల వనప్రవేశంతో జాతర ముగియనుంది.