రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం

కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. పటాన్‌చెరు సమీపంలో ఓఆర్ఆర్‌పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో లాస్య నందిత ఘటనాస్థలిలోనే అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.
 
డ్రైవర్ నిద్రమత్తు, ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. వెనుక సీట్లో కూర్చున్న లాస్య నందిత సీటు బెల్ట్ పెట్టుకొని ఉండుంటే.. ప్రాణాపాయం తప్పేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
నందిత మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులు కన్నీరుమున్నీరవుతున్నారు.  లాస్య నందిత దివంగత నేత, ఎమ్యెల్యే  సాయన్న కుమారై. గతేడాది ఫిబ్రవరరి 19న నందిత తండ్రి సాయన్న మృతి చెందాడు. సీనియర్‌ నేత, ఎమ్మెల్యే సాయన్న మరణంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన కూతురు లాస్య నందితకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కంటోన్మెంట్‌ సీటు ఇచ్చారు. కాంగ్రెస్‌ అభ్యర్థిపై ఆమె భారీ విజయం సాధించి  ఆమె గెలుపొందారు.
ఏడాది వ్యవధిలోనే తండ్రి సాయన్న, కుమారై నందిత మృతి చెందడంతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది.  ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నందిత బిఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచింది. గతంలోనూ నార్కట్ పల్లి వద్ద నందిత ప్రమాదానికి గురైంది. ఈ ఘటనపై  కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 
 
ఈ నెల 13న నల్గొండ సభకు వెళ్లిన సమయంలోనూ నార్కట్ పల్లి వద్ద నందిత కారుకు ప్రమాదం జరిగింది.  ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డుపక్కకు దూసుకెళ్లటంతో ఓ హోంగార్డు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో లాస్య నందిత స్వల్పగాయాలతో బయటపడింది. ఈ ప్రమాదం జరిగి పది రోజులు గడవకముందే ఆమె మరో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది.
లాస్య నందిత మృతిపట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంతాపం తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఆమె అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు. అతిపిన్న వయస్సులో ఎమ్మెల్యేగా నందిత ప్రజల మన్ననలు పొందారని చెప్పారు. లాస్య నందిత అకాలమరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితెలిపారు.
తండ్రి సాయన్న కోరిక మేరకు లాస్య నందిత రాజకీయాల్లోకి వచ్చారు. 2015లో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో పికెట్ నాలుగో వార్డు నుంచి సభ్యురాలిగా పోటీ చేసిన ఆమె పరాజయం చెందారు. బీటెక్ చదివిన ఆమె 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 2021 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆమె మరోసారి కవాడిగూడ కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.