బిజెపి ఎంపీగా మాజీ ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్!

మైదానంలోకి దిగాడంటే సిక్స‌ర్ల సునామి సృష్టిస్తూ భార‌త జ‌ట్టుకు ఎన్నో  గొప్ప విజ‌యాలు అందించిన భార‌త మాజీ ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్ రానున్న లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.  బాలీవుడ్ ప్ర‌ముఖులు స‌న్నీ డియోల్, వినోద్ ఖ‌న్నాలు వంటి వారి ఇంతకు ముందు ఎంపీలుగా గెలుపొందిన పంజాబ్ లోని గురుదాస్‌పూర నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు చెబుతున్నారు.
 
తాజాగా  యువ‌రాజ్ సింగ్ త‌ల్లి ష‌బ్నమ్ సింగ్‌తో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్క‌రీని  కలవడంతో అతడు రాజ‌కీయాల్లో అరంగేట్రం చేయ‌నున్నాడనే వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. అయితే యువ‌రాజ్ మాత్రం ఇంకా స్పందించ‌లేదు. క్రికెట‌ర్లు రాజ‌కీయాల్లోకి రావ‌డం మ‌న‌దేశంలో కొత్తేమీ కాదు. మాజీ ఆట‌గాళ్లు గౌతం గంభీర్ ప్రస్తుతం బిజెపి ఎంపీగా కొనసాగుతున్నారు.

భార‌త జ‌ట్టు గొప్ప ఆల్‌రౌండ‌ర్ల‌లో యువ‌రాజ్ సింగ్ ఒక‌డు. ఈ లెఫ్ట్ హ్యాండ‌ర్ రెండు వ‌ర‌ల్డ్ క‌ప్‌లు గెలిచిన భార‌త జ‌ట్టులో స‌భ్యుడు. ద‌క్షిణాఫ్రికా గ‌డ్డ‌పై 2007లో జ‌రిగిన టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లోయూవీ ఓ రేంజ్‌లో చెల‌రేగాడు. ఇంగ్లండ్ పేస‌ర్ స్టువార్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతుల్ని స్టాండ్స్‌లోకి పంపి చ‌రిత్ర సృష్టించాడు. 

అనంతరం 2011లో సొంత‌గ‌డ్డ‌పై జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లోనూ యూవీ ఆక‌ట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో జ‌రిగిన సెమీఫైన‌ల్లో సంచ‌ల‌న ఇన్నింగ్స్‌తో జ‌ట్టును గెలిపించాడు. అంతేకాదు బ్యాటుతో, బంతితో రాణించి ప్లేయ‌ర్ ఆఫ్ టోర్న‌మెంట్ అవార్డు అందుకున్నాడు.

అయితే, మెడియ‌స్టిన‌ల్ సెమినోమా అనే అరుదైన‌ క్యాన్స‌ర్ బారిన ప‌డిన యూవీ అమెరికాలోని బోస్ట‌న్‌లో కీమోథెర‌పీ చికిత్స తీసుకున్నాడు. ఆ మ‌హ‌మ్మారి నుంచి 2012లో బ‌య‌ట‌ప‌డిన అత‌డు మ‌ళ్లీ మైదానంలో ఫ్యాన్స్‌ను అల‌రించాడు. ప్ర‌స్తుతం లెజెండ్స్ లీగ్స్‌లో ఆడుతున్న అత‌డు న్యూయార్క్ సూప‌ర్ స్టార్ స్ట్రైక‌ర్స్ జ‌ట్టు కెప్టెన్‌గా ఎంపిక‌య్యాడు.

అదేవిధంగా గతంలో బిజెపి ఎంపీగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ, తర్వాత కాంగ్రెస్ లో చేరి, కొంత కాలంగా ఆ పార్టీలో మౌనంగా ఉంటున్న మరో మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దు సహితం తిరిగి బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తున్నది. తనకు తిరిగి అమృతసర్ సీట్ ఇస్తే బిజెపి అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని చెబుతున్నారు.