* సుప్రీంకోర్టులో ఆయుష్ హోలిస్టిక్ వెల్‌నెస్ సెంటర్
కరోనా సమయంలో ఆయుష్ వైద్యం తీసుకున్నానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆయుష్ హోలిస్టిక్ వెల్‌నెస్ సెంటర్‌ను ప్రారంభిస్తూ తాను ఆయుర్వేదం, సంపూర్ణ జీవనశైలిని సమర్థిస్తానని తెలిపారు. తనకు కరోనా ఆవహించిన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌కాల్ చేసిన సంఘటనను సీజేఐ ఈ సందర్భంగా వెల్లడించారు.
కరోనా సమయంలో తన పరిస్థితి ఘోరంగా ఉందని, ఆ సమయంలో ప్రధాని మోదీ ఫోన్ చేసి అంతా సర్దుకుంటుందని తెలిపారని పేర్కొన్నారు. ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకొని ఆయుష్ వైద్యుడు, ఆయుష్ కార్యదర్శితో మాట్లాడేలా ఏర్పాట్లు చేస్తానని, మందులు ఇస్తారని ప్రధాని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
అప్పుడే కాదు, ఆ తర్వాత కరోనా వచ్చిన్నప్పుడు కూడా అల్లోపతి మందులు అసలు తీసుకోలేదని, ఆయుర్వేద మందులే తీసుకున్నానని ఆయన స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆవరణలో ఆయుష్ హోలిస్టిక్ వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఈ క్షణం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు. తాను సీజెఐగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు కోసం కృషి చేస్తున్నానని తెలిపారు.
సుప్రీంకోర్టులో 2వేల మందికిపైగా ఉద్యోగులు ఉన్నారని చెబుతూ న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులే కాకుండా సిబ్బంది జీవన విధానాన్ని సైతం పరిశీలించాలని సూచించారు. ఉద్యోగులు, కుటుంబాల గురించి తాను ఆందోళన చెందుతున్నానని పేర్కొంటూ వారికి న్యాయమూర్తులతో సమానంగా సౌకర్యాలు లేవని విచారం వ్యక్తం చేశారు. న్యాయమూర్తులు, కుటుంబ సభ్యులు, ఉద్యోగులంతా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. తాను యోగా చేస్తానని, ఐదునెలలుగా వీగన్ డైట్‌ను ఫాలో అవుతున్నానని, ఇకపై అదే కొనసాగిస్తానని చెప్పారు.
ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్, సహాయ మంత్రి డాక్టర్ ముంజ్‌పరా మహేంద్రభాయ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ఆయుష్ హోలిస్టిక్ వెల్‌నెస్ సెంటర్‌లో నిపుణుల సేవలను ఏర్పాటు చేయడం, నిర్వహించడం, అందించడం గురించి సుప్రీంకోర్టు, ఆల్-ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద మధ్య ఒక అవగాహన ఒప్పందం కూడా కుదిరింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద క్రియాశీల భాగస్వామ్యంతో ఈ సెంటర్ ను ఏర్పాటుచేశారు.
More Stories
కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత
విశ్వాస పరీక్షలో ఫడ్నవీస్ మంత్రివర్గం విజయం
రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మానం