ఐపీఎల్‌- 17 షెడ్యూల్‌ విడుదల

* చెన్నై – బెంగళూరు మధ్య మొదటి మ్యాచ్‌
 
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ -17వ సీజన్‌ హంగామా మొదలైంది. క్రికెట్‌ అభిమానుల ఎదురుచూపులతో పాటు ఉత్కంఠకూ తెరదించుతూ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ సీజన్‌ షెడ్యూల్‌ను విడుదల చేసింది. దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 17వ సీజన్‌లో 15 రోజుల షెడ్యూల్‌ (21 మ్యాచ్‌లు) ను మాత్రమే బీసీసీఐ ప్రకటించింది. 
 
మార్చి 22 నుంచి చెన్నై వేదికగా మొదలుకాబోయే ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో తొలి మ్యాచ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌.. ఇంతవరకూ ట్రోఫీ గెలవని జట్టు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు  మధ్య జరుగనుంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ అనంతరం ఐపీఎల్‌ – 17 సీజన్‌ ఫుల్‌ షెడ్యూల్‌ వచ్చే అవకాశముంది.
 
మార్చి 22న సీఎస్కే – ఆర్సీబీ మధ్య జరుగబోయే తొలి మ్యాచ్‌ తర్వాత శనివారం డబుల్‌ హెడర్‌ మొదలవనుంది. పంజాబ్‌ సూపర్‌ కింగ్స్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ – సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ లు తలపడతాయి. మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 7 దాకా 15 రోజుల పాటు 21 మ్యాచ్‌లకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ కింది విధంగా ఉంది. ఐపీఎల్ 2024 తొలి దశలో సన్‍రైజర్స్ హైదరాబాద్ నాలుగు మ్యాచ్‍లు ఆడనుంది. ఇందులో రెండు మ్యాచ్‍లు హోం గ్రౌండ్‍ ఉప్పల్‍ స్టేడియంలో ఆడనుంది.
 
ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలి రెండు మ్యాచ్‌లను తమ సొంత గ్రౌండ్‌ (అరుణ్‌ జైట్లీ స్టేడియం) లో కాకుండా వైజాగ్‌లో ఆడనున్నారు. మార్చి 23 నుంచి ఆ జట్టు.. ఐపీఎల్‌ – 17 ట్రోఫీ వేటను మొదలుపెట్టనుంది. తొలి మ్యాచ్‌లో క్యాపిటల్స్‌.. పంజాబ్‌తో మొహాలీ వేదికగా మ్యాచ్‌ ఆడనుంది. కానీ ఆ జట్టుకు హోంగ్రౌండ్‌ మాత్రం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న విశాఖపట్నమే కావడం గమనార్హం. ఢిల్లీ జట్టు వైజాగ్‌లో.. చెన్నై, కోల్‌కతాతో మ్యాచ్‌లు ఆడనుంది.