ఓ యువ రైతు మృతితో రైతులు రెండు రోజుల విరామం

తమ డిమాండ్ల సాధన కోసం ఢిల్లీ వైపు సాగిన రైతుల ఢిల్లీ చలో ఆందోళన బుధవారం తీవ్రస్థాయి ఉద్రిక్తతల నడుమ ఓ యువ రైతు మృతికి దారితీసింది. హర్యానా సరిహద్దులలో కనౌరీ వద్ద హర్యానా భద్రతా బలగాలకు రైతులకు జరిగిన ఘర్షణలో ఓ 21ఏళ్ల రైతు శుభ్‌కరణ్ సింగ్ మృతి చెం దాడు.  
 
పంజాబ్‌లోని భటిండా జిల్లా బాలోక్‌ గ్రామానికి చెందిన శుభ్‌కరణ్‌ను చికిత్స కోసం పాటియాలలోని రాజింద్రా హాస్పిటల్‌కు తరలించగా తల మీద తీవ్రమైన గాయంతో అప్పటికే ఆయన మరణించారని, బుల్లెట్‌ తగలటం వల్లే ఇది జరిగినట్లు భావిస్తున్నామని, శవపరీక్షలో మిగిలిన వి వరాలు వెల్లడవుతాయని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ హెచ్‌ఎస్‌ రేఖి తెలిపారు. 
 
తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు రైతులు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో రైతు నేతలు ఛలో ఢిల్లీ ఉద్యమానికి రెండు రోజుల విరామం ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం తమ భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయిస్తామని, అప్పటి వరకూ పంజాబ్‌-హరియాణా సరిహద్దులోని శంభు, ఖానౌరీ ప్రాంతాల్లో మోహరించిన దాదాపు 14 వేల మందికిపైగా రైతులు అక్కడే ఉంటారని చెప్పారు. 
 
కాగా, బుధవారం రైతులతో జరిగిన ఘర్షణలో 13 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని హరియాణాకు చెందిన ఒక పోలీసు అధికారి తెలిపారు.
ఈ నెల 18న కేంద్రంతో జరిగిన నాలుగో దఫా చర్చలు విఫలమైన నేపథ్యంలో రైతు ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్‌ మోర్చా (రాజకీయేతర), కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా సంఘాల నేతలు పంజాబ్‌-హరియాణా సరిహద్దు నుంచి ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని బుధవారం తిరిగి మొదలు పెడతామని ప్రకటించారు. 

కాగా రైతులు శాంతియుతంగా ఉండాలని, సమస్యలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవల్సి ఉంటుందని కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా పిలుపు నిచ్చారు. రైతుల ప్రతినిధులతో చర్చలకు దిగిన త్రిసభ్య మంత్రుల బృందంలో ముండా కీలక పాత్ర వహించారు. అన్ని విషయాలను చర్చించుకోవచ్చునని, ఐదో దఫా చర్చలకు రావాలని పిలుపు నిచ్చారు. ఎంఎస్‌పి ఇతర ఏ విషయాలపై అయినా చర్చలతో పరిష్కారం కుదురుతుందని, దీనిని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.

కాగా, రైతుల ముసుగులో అసాంఘిక శక్తులు చొరబడుతున్నారని, రైతులు పెద్ద సంఖ్యలో గుమిగూడకుండా అడ్డుకోవటం లేదంటూ కేంద్ర హోంశాఖ రాసిన లేఖపై పంజాబ్‌ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. తమపై వేసిన ఆరోపణలు పూర్తిగా తప్పని చెప్పింది. హరియాణా పోలీసులు ప్రయోగిస్తున్న టియర్‌గ్యాస్‌, రబ్బరు బుల్లెట్లు, లాఠీఛార్జి వల్ల ఇప్పటికి 160 మందికిపైగా గాయపడ్డారని, ఇటువంటి పరిస్థితుల్లోనూ శాంతిభద్రతలు క్షీణించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని కేంద్ర హోంశాఖకు పంపిన లేఖలో పేర్కొంది.
 
ఉద్రిక్తతల నడుమనే రైతుల నేత జగ్జీత్‌సింగ్ దల్లేవాల్ రైతులను ఉద్ధేశించి మాట్లాడుతూ మనమంతా శాంతియుతంగా క్రమశిక్షణతో ఉండాలని కోరారు. గెలుపు కావాలంటే సంయమనం అవసరం అని, గెలుద్ధామా? వద్దా? అని ప్రశ్నించారు.