‘హనుమాన్‌’ పేరుతో భారత్‌ చాట్‌జీపీటీ

ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న నూతన సాంకేతికతల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఒకటి. ఈ టెక్నాలజీలో భారత్‌ కీలక పాత్ర పోషించేందుకు దోహదపడేలా ‘హనుమాన్‌’ పేరుతో సీతా మహలక్ష్మి హెల్త్‌కేర్‌ (ఎస్‌ఎంఎల్‌) సంస్థ ఓ లార్జ్‌ లాంగ్వేజ్‌ మాడల్‌ (ఎల్‌ఎల్‌ఎం)ను ఆవిష్కరించింది.  భారత్‌కు చెందిన పలు అగ్రశ్రేణి ఇంజినీరింగ్‌ కళాశాలతో కూడిన కన్సార్టియం భారత్‌ జీపీటీ త్వరలో చాట్‌జీపీటీ తరహాలో ఏఐ మోడల్‌ను లాంచ్‌ చేసేందుకు సన్నద్ధమవుతున్నది.
 
ఈ క్రమంలో భారత్‌ జీపీటీ గ్రూప్‌నకు చెందిన ఏఐ మోడల్‌ను ఆవిష్కరించనున్నది. దీనికి ‘హనుమాన్‌’ అని నామకరణం చేసింది. ముంబయిలో జరిగిన టెక్నాలజీ కాన్ఫరెన్స్‌లో ‘హనుమాన్’ పేరిట ‘లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌’ను భారత్‌ జీపీటీ గ్రూప్‌ ప్రదర్శించింది.  ఏకంగా 22 భారతీయ భాషల్లో ఆరోగ్య సంరక్షణ, పరిపాలన, విద్య, ఆర్థిక సేవలు తదితర రంగాలకు సంబంధించిన సేవలను అందించగలిగే ఈ ఎల్‌ఎల్‌ఎంను బాంబే ఐఐటీ నేతృత్వంలోని భారత్‌ జీపీటీ ఎకోసిస్టం భాగస్వామ్యంతో ఆవిష్కరించారు.
బాంబే ఐఐటీతోపాటు మరో 7 ఇతర ఐఐటీల ఆధ్వర్యంలో పనిచేస్తున్న భారత్‌ జీపీటీ ఎకోసిస్టం వాస్తవానికి ఓ రిసెర్చ్‌ కన్సార్షియం. ఈ సందర్భంగా ఏఐ మోడల్‌ పనితీరును తెలియజెప్పే వీడియోను సైతం ప్రదర్శించింది. తమిళంలో ఓ వ్యక్తి ఏఐ బాట్‌తో, ఓ బ్యాంకర్‌ హిందీలో చాట్‌ చేసి సమాధానాలు రాబట్టారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన ఓ టెకీ కంప్యూటర్‌ కోడ్‌ను రాసేందుకు ఈ ‘హనుమాన్‌’ ఏఐ బాట్‌ను సైతం వినియోగించారు.
 
ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తోపాటు కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం, ఎస్‌ఎంఎల్‌ తోడ్పాటుతో ముందుకు సాగుతున్న ఈ కన్సార్షియం.. చాట్‌ జీపీటీ తరహాలో సేవలందించే భారత్‌ జీపీటీని వచ్చే నెలలో ప్రారంభించనున్నది.  స్పీచ్‌-టు-టెక్స్‌, టెక్స్‌-టు-స్పీచ్‌, టెక్స్‌-టు-వీడియో, వీడియో-టు-టెక్స్‌ జనరేటింగ్‌ లాంటి బహుళ సామర్థ్యాలను కలిగి ఉన్న ‘హనుమాన్‌’ ఎల్‌ఎల్‌ఎం ప్రస్తుతానికి హిందీ, తమిళ్‌, తెలుగు, మళయాళం, మరాఠీ తదితర 11 భారతీయ భాషల్లో ప్రతిస్పందిస్తున్నది. మున్ముందు 22 భారతీయ భాషల్లో ప్రతిస్పందించగలిగేలా సామర్థ్యాన్ని పెంచాలని భావిస్తున్నారు.
 
ఏఐ మోడల్‌ ద్వారా స్పీచ్‌ టూ టెక్ట్స్‌ సైతం జనరేట్‌ చేయనున్నట్లు తెలుస్తుండగా దీన్ని బేస్‌ చేసుకొని ప్రత్యేక అవసరాలు అవసరమైన మోడల్స్‌ను రిలయన్స్‌ జియో అభివృద్ధి చేయనున్నది. అయితే, ఇప్పటికే రిలయన్స్‌ సబ్‌ స్క్రైబర్లకు ఏఐ సేవలను అందించేందుకు ‘జియో బ్రెయిన్‌’ పేరిట మోడల్‌ను తయారు చేస్తున్నది. 
 
రిలయన్స్‌ ఇందులో విజయవంతమైతే ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేసిన దేశాల్లో భారత్‌ సైతం నిలువనున్నది. గతేడాది నిర్వహించిన ఓ కార్యక్రమంలో రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ 2014 నుంచి ఐఐటీ బాంబేతో కలిసి ఓ ప్రాజెక్టులో కలిసి పని చేస్తున్నట్లు తెలిపారు. జీయో 2.0తో భారత్‌ జీపీటీ సైతం ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు.