అర్వింద్‌ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ అర్వింద్‌ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టై జైలులో ఉన్న కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. జూన్ 1న కేజ్రీవాల్‌ బెయిల్‌ గడువు ముగియనుంది. బెయిల్‌ గడువు ముగియగానే జూన్‌ 2న జైల్లో సరెండర్‌ కావాలని కేజ్రీవాల్‌ను కోర్టు ఆదేశించింది. 
 
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వీలుగా మధ్యంతర బెయిల్‌ కోసం అభ్యర్థిస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు.  ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం శుక్రవారం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.
 
ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల దృష్ట్యా, ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతగా ఉన్న కేజ్రీవాల్ కు ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశం కల్పించడానికి ఈ మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. ఎన్నికల ప్రచారం రాజ్యాంగ హక్కు కాదని పేర్కొంది. ఢిల్లీలో మే 25వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అప్పటివరకు కేజ్రీవాల్ బెయిల్ పై బయటే ఉంటారు.
 
కాగా, ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మంగళవారం మే 20 వరకు పొడిగించింది. అదేవిధంగా కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ను గురువారం సుప్రీంకోర్టులో ఈడీ వ్యతిరేకించింది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన తన అఫిడవిట్‌లో ఎన్నికల ప్రచారం చేసే హక్కు ప్రాథమికమైనది కాదని దర్యాప్తు సంస్థ పేర్కొంది.ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ ఇచ్చినట్లయితే ఇక ముందు ఏ రాజకీయ నాయకుడిని కూడా అరెస్టు చేయడం, జ్యుడీషియల్ కస్టడీలో ఉంచడం సాధ్యం కాదని ఈడీ వాదించింది. అయితే కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో ఈడీ దాఖలు అఫిడవిట్‌పై కేజ్రీవాల్ లీగల్‌ టీమ్‌ అభ్యంతరాలు లేవనెత్తింది. దీనిపై సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి అధికారికంగా ఫిర్యాదు చేసింది.

కాగా, ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను మార్చి 21న ఆయన అధికారిక నివాసం నుంచి ఈడి అరెస్టు చేసింది. ఈ కుంభకోణం వెనుక కీలక నిందితుడు ఆయనేనని, మద్యం వ్యాపారుల నుంచి కిక్‌బ్యాక్‌లు డిమాండ్ చేయడంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని ఈడీ ఆరోపించింది.