
మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్‌తో ఏపీ కాంగ్రెస్ పిలుపునిచ్చిన ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. చలో సెక్రటేరియట్‌కి బయలుదేరిన ఎపిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫలితంగా విజయవాడ- ఉండవల్లి ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
షర్మిల గురువారం పార్టీ కార్యకర్తలతో కలిసి సెక్రటేరియట్ ముట్టడికి బయలుదేరింది. ఈ క్రమంలో ఆమెను కొండవీటి ఎత్తి పోతల దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకుని, మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అలాగే పలువురు కాంగ్రెస్ నేతలను కూడా అరెస్ట్ చేశారు.
ఆంధ్రరత్న భవన్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలు గిడుగు రుద్రరాజు, తులసి రెడ్డి, మస్తాన్ వలీ, ఇతర నేతలను అరెస్టు చేశారు. పోలీసుల తీరుకు నిరసగా వైఎస్ షర్మిల, కాంగ్రెస్ నేతలు ఆంధ్రరత్న భవన్ ముందు బైఠాయించారు. పోలీసులు, కాంగ్రెస్ శ్రేణుల మధ్య కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ నుంచి వైఎస్ షర్మిలతో పాటు ఆ పార్టీ నేతలు ర్యాలీగా బయల్దేరారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సచివాలయానికి వెళ్లకుండా… పలువురిని కాంగ్రెస్ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వైఎస్ షర్మిలా రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు వచ్చారు.
ఈ సమయంలో షర్మిల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కానీ మహిళా పోలీసుల సాయంతో ఆమెను అదుపులోకి తీసుకుని వాహనంలోకి ఎక్కించారు. ఈ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆమె ప్రయాణిస్తున్న కారు నుంచి ఆమెను కిందకు దించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
రోడ్డుపై బైఠాయించిన షర్మిల, ఇతర నేతలను పోలీసులు బలవంతంగా ఎత్తుకుని పోలీసు వాహనాల్లోకి ఎక్కించారు. అక్కడి నుంచి వారిని తరలించారు.పోలీసు వాహనంలోకి ఎక్కిస్తున్న సమయంలో ఆమె అదుపు తప్పి వాహనం మెట్లపై పడిపోయారు. అయినా పోలీసులు తగ్గలేదు. రెండు పోలీసు వాహనాలలో వీరిని తరలించారు. ఇతర నేతలతో పాటే ఆమెను కూడా సాధారణ వాహనంలోనే తరలించడం గమనార్హం.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు సీఎం డౌన్ డౌన్, పోలీసుల జులుం నశించాలి అంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద సమస్య నిరుద్యోగం అని వైఎస్ షర్మిల తెలిపారు. 2.3 లక్షల ఉద్యోగాలిస్తామని జగన్ అధికారంలోకి వచ్చారని, ఎక్కడ ఇచ్చారని సిఎం జగన్ ను ప్రశ్నించారు.
మెగా డిఎస్‌సి కాకుండా దగా డిఎస్‌సి ఇచ్చారని, గ్రామ సచివాలయ ఉద్యోగాలు వారి కార్యకర్తలకు ఇచ్చారని, ఎపిపిఎస్‌సి ద్వారా భర్తీ చేస్తామన్న ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. పోలీసులను వైఎస్‌ఆర్‌సిపి నేతలకు బంటుల్లా వాడుకుంటున్నారని, ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారని, జర్నలిస్టులను చితకబాదుతున్నారని, ఇదేమైనా తాలిబన్ల రాజ్యమా లేక ప్రజాస్వామ్యమా అని ధ్వజమెత్తారు. ఐదేళ్లలో ఒక్క జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
More Stories
రూ. 1 లక్ష కోట్లతో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తొలి బడ్జెట్
నాపై సెటైర్లు వేయడానికి కమ్రా సుపారి తీసుకున్నట్లుంది
కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకునే అవకాశం!