18 ఏండ్ల తర్వాత దుబాయిలో తెలంగాణ వాసులకు విముక్తి

చేయని నేరానికి సుదీర్ఘ కాలం దుబాయ్‌ జైలులో మగ్గిపోయిన సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురు కార్మికులు 18 ఏళ్ల తర్వాత సొంతూళ్లకు చేరుకుంటున్నారు. దుబాయ్ కోర్టు క్షమాభిక్ష పెట్టడంతో ఒక్కొక్కరుగా విడుదలై ఇంటి బాట పడుతున్నారు. దుబాయ్‌లో శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు తెలంగాణ వాసులు 18 ఏండ్ల తర్వాత ఎట్టకేలకు స్వదేశానికి తిరిగొచ్చారు.
 
గత 18 ఏళ్ల క్రితం అంటే 2005లో జిల్లాకు చెందిన మల్లేశం, రవి, హన్మంతు, లక్ష్మణ్, వెంకటేశ్ దుబాయ్ వెళ్లారు. అక్కడకు వెళ్లిన ఆరు నెలలకే నేపాల్‌కు చెందిన బహదూర్ సింగ్ అనే వాచ్‌మెన్ హత్యకు గురయ్యాడు. అక్కడే పని చేస్తున్న ఈ ఐదుగురు హత్య కేసులో ఇరుక్కున్నారు. భాష సరిగా రాకపోవడంతో పోలీసులకు ఏం చెప్పారో తెలియదు కానీ శిక్ష రుజువు కావటంతో దుబాయ్ కోర్టు మొదట పదేళ్లు జైలు శిక్ష విధించింది. అనంతరం అప్పీలుకు వెళ్లగా 25 ఏళ్ల శిక్ష విధించింది.
 
దుబాయ్ చట్టాల ప్రకారం హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పెడితే విడుదలకు అవకాశం ఉండడంతో  మాజీ మంత్రి కేటీఆర్ నేపాల్ వెళ్లి హతుని కుటుంబ సభ్యులకు రూ.15 లక్షలు పరిహారం స్వయంగా చెల్లించి క్షమాభిక్ష పత్రం రాయించినా మారిన నిబంధనలతో కోర్టు అంగీకరించలేదు. 
గతేడాది సెప్టెంబర్‌లో మంత్రి కేటీఆర్ దుబాయ్ కోర్టులో బాధిత కుటుంబ సభ్యులతో మళ్ళీ కేసు వేయించారు.
కేంద్ర విదేశాంగ శాఖ సహకారంతో దుబాయ్ రాజు అపాయింట్మెంట్ తీసుకొని ఈ కేసులో క్షమాభిక్ష కోరటం కోసం మంత్రి కేటీఆర్ అక్కడి అధికారులతో సమీక్షించారు. చివరకు కోర్డు క్షమాబిక్ష పెట్టటంతో నలుగురు స్వదేశానికి చేరుకున్నారు.  దీనికి అంగీకరించిన దుబాయి కోర్టు ఏడేళ్లు ముందే వారిని విడుదల చేసింది.
దీంతో దుబాయ్‌ నుంచి సిరిసిల్ల ,రుద్రంగి, కొనరావుపేట మండలానికి చెందిన ఐదుగురు హైదరాబాద్‌ వచ్చారు. 18 ఏండ్ల తర్వాత కుటుంబసభ్యులను కలుసుకోవడంతో వారంతా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.   రెండు నెలల క్రితం దుబాయ్ జైలు నుంచి సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలానికి చెందిన దండుగుల లక్ష్మణ్ విడుదల కాగా, రుద్రంగి మండలం మనాల గ్రామానికి చెందిన శివరాత్రి హన్మంతు రెండ్రోజుల క్రితం ఇంటికి చేరుకున్నారు.
తాజాగా, పెద్దూర్ గ్రామానికి చెందిన శివరాత్రి మల్లేశం, రవి అనే ఇద్దరు అన్నదమ్ములు జైలు నుంచి విడుదలై స్వదేశానికి చేరుకున్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కుటుంబ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు.  చందుర్తి మండలానికి చెందిన మరో వ్యక్తి వెంకటేశ్ వచ్చేనెలలో విడుదల కానున్నారు.