బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి

పశ్చిమ బెంగాల్ లోని సందేశ్‌ఖలిలో మహిళలపై స్థానిక టిఎంసి నేతల సారధ్యంలో జరిగిన అత్యాచారాల ఘటనల పట్ల జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్లు) చైర్‌పర్సన్ రేఖా శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని టిఎంసి ప్రభుత్వం  అసంఖ్యాక మహిళల నోళ్లను నోక్కుతోందని ఆమె మండిపడ్డారు. బెంగాల్‌లో రాష్ట్రపతి విధించాలని రేఖా శర్మ డిమాండ్ చేశారు. పైగా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేయాలని ఆమె సూచించారు.

 రేఖా శర్మ నేతృత్వంలో కమిషన్ ప్రతినిధివర్గం సోమవారం కల్లోలిత సందేశ్‌ఖలిని సందర్శించింది. చాలా మంది మహిళలు ముందుకు వచ్చి, తమ మనోభావాలను తెలియజేయడానికి వారిలో దృఢవిశ్వాసాన్ని పాదుకొల్పడమే లక్ష్యంగా తాను ఆ ప్రాంతాన్ని సందర్శించానని ఆమె చెప్పారు. ‘నిజాలు బయటకు రాకుండా చూసేందుకే మహిళల వాణి అణచివేతకు’ మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎన్‌సిడబ్లు చైర్‌పర్సన్ ఆరోపించారు.

‘ఆ ప్రాంతంలో మహిళలతో మాట్లాడిన తరువాత సందేశ్‌ఖలిలో పరిస్థితి భయంకరంగా ఉందని గ్రహించాను. పలువురు మహిళలు తమ ఇక్కట్లు తెలియజేశారు. అక్కడి టిఎంసి పార్టీ కార్యాలయంలో తనపై అత్యాచారం జరిగిందని ఒక మహిళ వెల్లడించింది. బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని మేము కోరుతున్నాం. మా నివేదికలో కూడా అదే విషయం పొందుపరుస్తాం’ అని రేఖా శర్మ తెలిపారు.

చివరకు టిఎంసి కార్యాలయంలో కూడా అత్యాచారం జరిపినట్లు తెలుస్తుకొని ఆమె దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ కూడా రాష్త్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించిన నివేదికలో ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేసిన తర్వాత మహిళా కమిషన్ కూడా అటువంటి సిఫార్సు చేయడం గమనార్హం.

“ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని నేను భావిస్తున్నాను” అని శర్మ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. మమతా బెనర్జీ ప్రభుత్వం వాస్తవాలను కప్పిపుచ్చేందుకు మహిళల గొంతులను అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించింది. పరారీలో ఉన్న కీలక నిందితుడైన టిఎంసి నేత షాజహాన్ షేక్‌ ను వెంటనే అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

“మహిళలు చెప్పేది వినడానికి నేను రోజంతా సందేశ్‌ఖాలీలో ఉన్నాను. అయితే దోషిని అరెస్టు చేయాలి. ఒక్కసారి (షాజహాన్) షేక్‌ను అరెస్టు చేస్తే, ఎక్కువ మంది మహిళలు తమ ఫిర్యాదులతో బయటకు వస్తారని నేను నమ్ముతున్నాను” అని ఆమె స్పష్టం చేశారు.  కమిషన్‌లోని ఇద్దరు సభ్యుల బృందం గత వారం ఈ ప్రాంతంలో పరిస్థితిని పరిశీలించి నివేదిక సమర్పించిన తర్వాత శర్మరేఖా పర్యటన జరిపారు.  ఎన్‌సిడబ్లు చైర్‌పర్సన్ అయినా తనను కలవడానికి జిల్లా మేజిస్ట్రేట్ లేదా పోలీసు సూపరింటెండెంట్ రాకపోవడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

“పాలనా యంత్రంగం, పోలీసులు మహిళల ఫిర్యాదులను వినడం లేదు. వారు ఏమీ చేయడం లేదు. ఒక మహిళ మాత్రమే బయటకు వచ్చి మేజిస్ట్రేట్ ముందు తన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. మరింత మంది మహిళలు ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాము… ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిజాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నందున కేంద్ర అధికారుల బృందాలను కలవడానికి తన అధికారులను ఎప్పుడూ అనుమతించలేదు. అయితే నిజం బయటకు వస్తుంది’ అని శర్మ తెలిపారు. 

అయితే రాష్ట్రంలో రాష్త్రపతి పాలనా విధించాలన్న కమిషన్ డిమాండ్ పట్ల టిఎంసి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి ప్రభావంతో ఎన్‌సిడబ్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు కమిషన్ మౌనం వహిస్తుందని గుర్తు చేశారు.  గర్భిణిపై సామూహిక అత్యాచారం చేసి తగులబెట్టిన మధ్యప్రదేశ్‌లోని మొరెనాలో ఆమె ఎందుకు వెళ్లలేదు? బీజేపీ ఎంపీ లైంగిక దుష్ప్రవర్తనకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు నిరసన వ్యక్తం చేసినప్పుడు ఎన్‌సిడబ్లు ఎందుకు స్పందించలేదు? అని రాష్ట్ర సీనియర్ మంత్రి శశి పంజా ప్రశ్నించారు.

మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల ఫిర్యాదులను కమిషన్ పట్టించుకోలేదని ఆమె విమర్శించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అవసరమై

న అన్ని చర్యలు చేపట్టిందని, పలువురిని అరెస్టు చేశామని పంజా పేర్కొన్నారు. “గత కొన్ని నెలలుగా మణిపూర్ మండుతోంది. బిజెపి ముఖ్యమంత్రి రాజీనామా చేశారా? అక్కడ రాష్ట్రపతి పాలన విధించారా? కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. బిజెపికి విస్తరించిన కార్యాలయంగా వ్యవహరించకూడదు” అంటూ ఆమె హితవు చెప్పారు.