యుపిలో కాంగ్రెస్ కు 17 సీట్లు మాత్రమే … ఎస్పీ స్పష్టం

`ఇండియా’ కూటమిలో భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుకు ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ కు 17 సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) తెలిపింది. ఆ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేకు లేఖ రాసినట్లు ఆ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి వెల్లడించారు.

పొత్తు కుదిరితే ఇతరస్థానాల్లో కాంగ్రెస్‌ పోటీ చేయలేమని తేల్చి చెప్పాల్సి వుంది. ఇప్పుడు బంతి కాంగ్రెస్‌ చేతిలో ఉంది. ఈ విషయంపై స్పందించాల్సి వుంది. కాగా, రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ్  యాత్ర ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతోంది. ఈనెల 16న వారణాసిలోకి ప్రవేశించిన యాత్ 21 వరకు కొనసాగనుంది. 

 ఈ యాత్రలో అఖిలేష్‌ యాదవ్‌ పాల్గొనడం  కూడా కాంగ్రెస్‌ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.  ప్రస్తుతం సీట్ల పంపకాలపై కాంగ్రెస్‌తో తమ పార్టీ చర్చలు జరుపుతోందని, సీట్ల పంపకాలు పూర్తయ్యాక భారత్‌ జోడో యాత్రలో పాల్గొంటానని  అఖిలేష్‌యాదవ్‌ తేల్చిచెప్పారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేవలం 52 స్థానాలు మాత్రమే దక్కాయి. వాటిలో ఈశాన్య రాష్ట్రాల స్థానాలు తక్కువగానే ఉన్నాయి. యుపిలోని అమేథీ నియోజకవర్గంలో స్మృతి ఇరానీ చేతిలో రాహుల్‌ గాంధీ ఓటమిపాలవగా, రారుబరేలి సీటు మాత్రమే కాంగ్రెస్‌ గెలుచుకుంది. 2019లో కాంగ్రెస్‌పై గౌరవంతో ఆ రెండు స్థానాల్లోనూ ఎస్‌పి పోటీ చేయలేదు.

తొలుత కాంగ్రెస్ కు 11 సీట్లను మాత్రమే కేటాయిస్తామని ఎస్పీ ప్రకటించింది. తాజాగా ఆ సీట్ల సంఖ్యను 17కు పెంచింది. ఈ విషయమై కాంగ్రెస్ స్పందించాల్సి ఉంది. ఇప్పటికే `ఇండియా’ కూటమి నుండి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ వైదొలిగింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని టిఎంసి, ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ `ఇండియా’ కూటమిలో కొనసాగుతున్నప్పటికీ తమ తమ రాస్త్రాలలో కాంగ్రెస్ తో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఎస్పీ ఇవ్వజూపిన సీట్ల పట్ల కాంగ్రెస్ సంతృప్తి చెందని పక్షంలో ఉత్తర ప్రదేశ్ లో సమాజ్‌వాది పార్టీ సహితం ఒంటరిగా పోటీచేసే అవకాశం ఉంది. మేథీలో సోమవారంనాడు ప్రవేశించిన రాహుల్ గాంధీ “భారత్ జోడో న్యాయ్ యాత్ర”లో మంగళవారం ఉదయం స్వల్ప విరామం చోటుచేసుకోనుంది. తనపై దాఖలైన పరువునష్టం కేసులో సుల్తాన్‌పూర్‌లోని జిల్లా సివిల్ కోర్టు ముందు రాహుల్ గాంధీ ఈనెల 20న హాజరుకానుండటంతో ఈ విరామం తలెత్తింది.