చండీఘర్ రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్‌పై చీఫ్ జ‌స్టిస్ సీరియ‌స్‌

చండీఘ‌డ్ మేయ‌ర్ ఎన్నిక స‌మ‌యంలో బ్యాలెట్ పేప‌ర్ల‌పై రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ అనిల్ మాషి టిక్కు మార్కులు పెట్టిన కేసును సోమవారం విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బ్యాలెట్ పేపర్లను మంగళవారం కోర్టులో ప్రవేశ పెట్టాలని ఆదేశించారు. ఒక జుడిసియల్ అధికారి ద్వారా బ్యాలెట్ పేపర్లను, సంబంధిత వీడియోలను పంపాలని చండీగఢ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ను కోర్టు ఆదేశించింది. వాటిని తీసుకొచ్చే జ్యుడిషియల్ అధికారికి తగు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
 
బ్యాలెట్ పేప‌ర్ల‌ను లెక్కించాల్సిన స‌మ‌యంలో వాటికిపై x మార్క్ టిక్కులు ఎందుకు పెట్టిన‌ట్లు రిటర్నింగ్ ఆఫీస‌ర్‌ను ప్రధాన న్యాయమూర్హ్టి ప్రశ్నించారు. 
ఒక‌వేళ కోర్టుకు ఏదైనా అబ‌ద్దం చెప్పాల‌ని రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ ప్ర‌య‌త్నిస్తే ఆయ‌న్ను కూడా విచారించ‌నున్న‌ట్లు హెచ్చరించారు.  కెమెరా వైపు చూస్తూ ఎందుకు టిక్కు మార్కులు పెట్టావ‌ని సీజే ప్ర‌శ్నించారు. 
కోర్టు విచార‌ణ‌కు హాజ‌రైన అనిల్ మాషి సీజే ప్ర‌శ్న‌ల‌కు బ‌దులిస్తూ దెబ్బ‌తిన్న బ్యాలెట్ పేప‌ర్ల‌కు మార్కింగ్ చేస్తున్న‌ట్లు చెప్పారు.  ఆ స‌మ‌యంలోనే కౌంటింగ్ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాను చూసిన‌ట్లు తెలిపారు.  మొత్తం 8 బ్యాలెట్ పేప‌ర్ల‌పై మార్కింగ్ చేసిన‌ట్లు చెప్పారు. అయితే వాటిని వేరు చేయాల‌న్న ఉద్దేశంతో అలా చేసినట్లు తెలిపారు. కానీ రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ ఇచ్చిన స‌మాధానంతో సీజే సంతృప్తి చెంద‌లేదు.  బ్యాలెట్ పేప‌ర్ల‌ను లెక్కించాలి, కానీ టిక్కులు పెట్ట‌డం దేనికి, ఏ రూల్ ప్ర‌కారం అలా చేశార‌ని ప్రశ్నించారు. 
 
ఆర్ఓను ప్రాసిక్యూట్ చేయాల‌ని చెబుతూ ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటిని చోటు లేద‌ని స్పష్టం చేశారు. చండీఘ‌డ్ మేయ‌ర్ ఎన్నికపై స్టే ఇవ్వాల‌ని కోరుతూ ఆప్ కౌన్సిల‌ర్ కుల్దీప్ కుమార్ దాఖ‌లు చేసిన పిటీష‌న్‌పై సుప్రీంకోర్టు విచార‌ణ చేప‌ట్టింది.  సీజేఐ డీవై చంద్ర‌చూడ్‌, జ‌స్టిస్ జేబీ ప‌ర్దివాలా, మ‌నోజ్ మిశ్రాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఆ కేసును విచారించింది. 
 
ఆ ఎన్నిక‌లో బీజేపీ అభ్య‌ర్థి మేయ‌ర్‌గా ఎన్నికైన విష‌యం తెలిసిందే. అయితే మేయ‌ర్‌గా ఎన్నికైన వ్య‌క్తి ఆదివారం రాత్రి  త‌న ప‌దవికి రాజీనామా చేశారు. మ‌రో వైపు ముగ్గురు ఆప్ కౌన్సిల‌ర్లు బీజేపీలో చేరారు. ఫిరాయింపులు  జ‌రుగుతున్న అంశంపై సీజేఐ డీవై చంద్ర‌చూడ్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అభ్య‌ర్థులు పార్టీలు మార‌డం క‌లిచివేస్తోంద‌ని తెలిపారు.