పాక్‌ జీడీపీనే మించి పోయిన టాటా గ్రూప్ మార్కెట్ విలువ

భారత దేశం పారిశ్రామికీకరణకు బలమైన పునాదులు వేయడమే కాకుండా, భారత దేశం గర్వించే విధంగా అత్యుత్తమ వ్యాపార విలువలను అనుసరిస్తున్న టాటా గ్రూప్ మార్కెట్ విలువ దేశంలోని అన్ని పరిశ్రమలకన్నా అత్యధికంగా ఉన్నాయి. అంతేకాకుండా, దేశంలో అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న పారిశ్రామిక దిగ్గజంగా పేరుంది.
 
భారత దేశం గర్వించే రీతిలో టాటా గ్రూప్ ఎదిగింది అనేేందుకు నిదర్శనంగా ఓ నివేదిక బయటకు వచ్చింది. మొత్తం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కన్నా భారత్ లో ఒక్క టాటా గ్రూప్ మార్కెట్ విలువ ఎక్కువగా ఉండటం విశేష టాటా గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ విలువ పాక్‌ జీడీపీని మించిపోయింది.  ఉప్పు నుంచి సాఫ్ట్‌వేర్‌ వరకు గ్రూప్‌లోని లిస్టెడ్‌ కంపెనీలు ఏడాదిలో స్టాక్‌ మార్కెట్‌లో భారీగా రాబడిని ఆర్జించాయి.
దాంతో టాటా గ్రూప్‌ ఉమ్మడి మార్కెట్‌ విలువ పాక్‌ ఆర్థిక వ్యవస్థను దాటింది. దాయాది దేశం ప్రస్తుతం రాజకీయ అస్థిరత, రుణ సంక్షోభం, ద్రవ్యోల్బరణంతో పోరాడుతున్న విషయం తెలిసిందే.  టాటా గ్రూప్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారుగా 365 బిలియన్‌ డాలర్లు. భారతీయ కరెన్సీలో రూ.30 లక్షల కోట్ల కంటే ఎక్కువ. ఇది పాక్‌ జీడీపీ కంటే ఎక్కువగా. ఐఎంఎఫ్‌ అంచనా ప్రకారం పాక్‌ జీడీపీ 341 బిలియన్‌ డాలర్లు. 
 
టాటా గ్రూప్‌నకు చెందిన అన్ని లిస్టెడ్‌ బిజినెస్‌లలో ఐటీ సెక్టార్‌ లీడర్‌ టీసీఎస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ దాదాపు 170 బిలియన్‌ డాలర్లు లేదంటే రూ.15లక్షల కోట్లు. నగదు కొరత, అప్పుల ఊబిలో కూరుకుపోయిన పొరుగు దేశం ఆర్థిక వ్యవస్థలో టీసీఎస్‌ సగం విలువైంది. టాటా గ్రూప్ కంపెనీలన్నీ మొత్తం గ్రూప్ మార్కెట్ విలువ వృద్ధికి దోహదపడ్డాయి.

అయితే, టాటామోటార్స్‌, ట్రెంట్‌ భారీ సహకారాన్ని అందించాయి. కేవలం ఏడాది సమయంలోనే టాటా మోటార్స్‌ షేర్లు 110శాతం పెరగ్గా, ట్రెంట్‌ షేర్లు 200శాతం వృద్ధిని నమోదు చేసింది. దీంతో పాటు టాటా టెక్నాలజీస్, టీఆర్‌ఎఫ్, బెనారస్ హోటల్స్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్, టాటా మోటార్స్, ఆటోమొబైల్ కార్పొరేషన్ ఆఫ్ గోవా, ఆర్ట్‌సన్ ఇంజినీరింగ్ తదితర షేర్లు సైతం మంచి వృద్ధిని నమోదు చేశాయి. 

మీడియా నివేదికల ప్రకారం టాటా గ్రూప్‌లోని కనీసం 25 కంపెనీలు స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లలో లిస్ట్‌ అయ్యాయి. వాటిలో ఒకటైన టాటా కెమికల్స్‌ మాత్రమే ఏడాదిలో 5శాతం మేర పతనమైంది. టాటా గ్రూప్‌లో టాటా సన్స్, టాటా క్యాపిటల్, టాటా ప్లే, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, ఎయిర్ ఇండియాతో సహా అనేక అన్‌లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. 

వీటన్నింటిని పరిగణలోకి తీసుకుంటే టాటా గ్రూప్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో గణనీయమైన పెరుగుదల ఉన్నది. వచ్చే ఏడాది ఐపీఓను ప్రారంభించాలని యోచిస్తున్న టాటా క్యాపిటల్ అన్ లిస్టెడ్ మార్కెట్‌లో సుమారు రూ.2.7 లక్షల కోట్ల మార్కెట్ విలువను కలిగి ఉంది. టాటా గ్రూప్ ఎక్కువగా ట్రస్టుల యాజమాన్యంలో నడుస్తుండగా వ్యక్తిగతంగా ప్రమోటర్స్‌ ఎవరూ లేరు. టాటా సన్స్‌లో రతన్ టాటాకు ఒకశాతం కంటే తక్కువ ఉండడం గమనార్హం.

పాకిస్థాన్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పొరుగు దేశం 125 బిలియన్ డాలర్ల రుణాలు చెల్లించేందుకు పోరాడుతున్నది. జులైలో ప్రారంభమయ్యే 25 డాలర్ల విదేశీ రుణాన్ని చెల్లించేందుకు ఆ దేశం నిధుల సమీకరణకు సిద్ధమవుతున్నది.  దాంతో పాటు పాక్‌ 3 బిలియన్‌ ఐఎంఎఫ్‌ కార్యక్రమం వచ్చే నెలలో ముగియబోతున్నది. దాంతో సవాళ్లు మరింత తీవ్రం కానున్నాయి.

పాక్‌ విదేశీ మారకద్రవ్యం నిలువలు 8 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. రెండు నెలలపాటు అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకునేందుకు మాత్రమే ఆ ద్రవ్యం సరిపోతున్నది.  మరో వైపు భారత ఆర్థిక వ్యవస్థ 3.7 ట్రిలియన్‌ డాలర్లకు పెరిగింది. పాక్‌ ఆర్థిక వ్యవస్థ కంటే 11 రెట్లు ఎక్కువ. 2028 ఆర్థిక సంవత్సరానికి భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రస్తుతం భారత్‌ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నది.