అయిదేళ్లపాటు ఐదు పంటలకు మద్దతు ధర

నిరసన తెలుపుతున్న రైతులతో ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు నాల్గవ విడత జరిగిన చర్చలలో కేంద్రం నిర్దుష్టమైన ప్రతిపాదనలను రైతు నాయకుల ముందుంచింది. రైతుల నుండి ఐదు పంటలను ఐదేళ్లపాటు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడంపై కేంద్రం గత రాత్రి హామీ ఇచ్చింది.  పత్తి, మొక్కజొన్నలతో పాటు మూడు పప్పుధాన్యాలు (కందిపప్పు, మినపప్పు, యెర్ర కందిపప్పు)లకు మద్దతు ధర ఇచ్చేందుకు కేంద్రం ముందుకు వచ్చింది.

ఈ పంటల ఉత్పత్తులను జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య, నాఫెడ్,  కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి కేంద్ర ఏజెన్సీలు రైతుల నుండి  కొనుగోలు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు.  పైగా, ఈ కొనుగోలుకు ఎటువంటి పరిమితి లేదని, ఏ మేరకైనా కొనుగోలు చేస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. 
 
ఇందుకోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. తమ ప్రతిపాదనల వల్ల పంజాబ్‌లో వ్యవసాయానికి భద్రత లభిస్తుందని, భూగర్భ జలాలు మెరుగవుతాయని అన్నారు. సాగు భూములు నిస్సారంగా మారకుండా ఉంటాయని వ్యాఖ్యానించారు. ఈ ప్రతిపాదనలను తమ వేడుకలలో చర్చించి, రెండు రోజులలో సమాధానం చెబుతామని రైతు నాయకులు తెలిపారు. 
 
ఆదివారం రాత్రి 8:15 గంటలకు ప్రారంభమైన ఈ చర్చలు సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట వరకు కొనసాగాయి. కేంద్రం తరఫున వ్యవసాయశాఖ మంత్రి అర్జున్‌ ముండా, వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్‌, అన్నదాతల తరఫున రైతు సంఘాల నేతలతో పాటు పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ సింగ్ పాల్గొన్నారు. సెక్టార్ 26లోని మహాత్మా గాంధీ స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ఐదు గంటలకుపైగా సాగిన ఈ చర్చల్లో పలు అంశాలపై చర్చించారు.
 
కేంద్రం ప్రతిపాదనలపై వచ్చే రెండు రోజుల్లో తమ సంఘాలతో చర్చించి, తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని చర్చల్లో పాల్గొన్న రైతు నాయకులు వెల్లడించారు. రైతు సంఘం నేత శర్వాన్‌ సింగ్‌ పంథేర్‌ స్పందిస్తూ ఈ అంశంపై సోమ, మంగళవారాల్లో తమ రైతు సంఘాలతో చర్చిస్తామన్నారు. నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకొని ఒక నిర్ణయానికి వస్తామని స్పష్టం చేశారు. 
 
రుణమాఫీ వంటి డిమాండ్లు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయని, దీనిపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి ‘ఢిల్లీ ఛలో’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా విరమించామని, ఒకవేళ తమ డిమాండ్లన్నింటికీ పరిష్కారం లభించకపోతే ఫిబ్రవరి 21న పునః ప్రారంభిస్తామని వెల్లడించారు.
 
రైతు నేతలతో సమావేశం సానుకూల వాతావరణంలో జరిగిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. “మా ప్రభుత్వం రూ. 18 లక్షల కోట్లతో పంటలను సేకరించింది, పిఎం కిసాన్‌ను ప్రవేశపెట్టింది. ఎరువులపై సబ్సిడీని మూడు రెట్లు పెంచింది. ఈరోజు నేతలకు ఇచ్చిన ప్రతిపాదన పంజాబ్, హర్యానా రైతులందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది” అని తెలిపారు.
 
వరి పంటలకు బదులు ఈ పంటలను సాగు చేసేందుకు వ్యవసాయంలో వైవిధ్యం కోసం వెళ్లే రైతులు లాభపడతారని చెబుతూ సోమవారం ఉదయానికి తమ ప్రతిపాదనకు సంబంధించి రైతు నేతలు తమ నిర్ణయాన్ని తెలియజేస్తారని గోయల్ తెలిపారు. ఇప్పటికైనా రైతులు తమ నిరసనను విరమిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
 
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గుర్మీత్‌సింగ్ ఖుదియాన్‌తో కలిసి సమావేశానికి హాజరైన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా రైతుల పక్షాన నిలిచారని చెప్పారు. “మొజాంబిక్ నుండి పప్పులను దిగుమతి చేసుకోవడానికి మేము కోట్లు ఖర్చు చేసాము. మన రైతులకు మంచి ధర లభించి, బైబ్యాక్‌కు హామీ ఇస్తే, అది విన్-విన్ సిట్యుయేషన్ అవుతుంది, ”అని ఆయన తెలిపారు. శాంతి నెలకొంటుందని తాను ఆశిస్తున్నాను అంటూ ఇప్పటికే ఈ నిరసనలో ఇద్దరు రైతులు మృతి చెందారని ఆయన విచారం వ్యక్తం చేశారు. 
 
రైతు సంఘాలు ఢిల్లీ ఛలోకు పిలుపునివ్వడంతో కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 8, 12, 15న మూడు దఫాలుగా చర్చలు జరిపింది. కానీ, ఎటువంటి పురోగతి లేకుండా ముగిశాయి. దీంతో కర్షకులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా సరిహద్దులను సీల్ చేశారు. పంజాబ్, హరియాణ సరిహద్దుల్లోని శంభు, ఖనౌరి వద్ద ఏకంగా సిమెంట్ కాంక్రీట్‌ వేసి, బారికేడ్లను ఉంచారు. భారీగా భద్రతా బలగాలను మోహరించారు. 
 
ఇక, రైతులు కనీస మద్దతు ధరకు చట్టబద్దత, స్వామినాథన్ కమిషన్‌ సిఫార్సులు, రైతులు, రైతు కూలీలకు పింఛన్లు, రుణమాఫీ, విద్యుత్ ఛార్జీల తగ్గింపు, 2020 ఆందోళనల సందర్భంగా తమపై పెట్టిన కేసులను ఉపసంహరణ వంటి 20 డిమాండ్లను పరిష్కరించాలని అన్నదాతులు కోరుతున్నారు. ఇందుకోసమే వారు ఆందోళనకు సిద్ధమయ్యారు.