చండీగఢ్‌ మేయర్ రాజీనామా … బిజెపిలోకి ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు 

ఇటీవల వివాదాస్పదమైన చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నది. జనవరి 30న భారీ హైడ్రామా మధ్య జరిగిన మేయర్‌ ఎన్నికలో ప్రిసైడింగ్‌ అధికారి విజేతగా ప్రకటించిన బీజేపీ నేత మనోజ్‌ సోన్కర్‌  తన పదవికి గత రాత్రి రాజీనామా చేశారు. చండీగఢ్‌ మేయర్‌ వివాదంపై సుప్రీంకోర్టు సోమవారం  విచారించనున్న నేపథ్యంలో ఆయన మేయర్‌ పదవి నుంచి తప్పుకున్నారు.
అయితే అదేసమయంలో ఆప్‌కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీలో చేరడం విశేషం. దీంతో ఆ పార్టీ బలం 17కు చేరింది.  మొత్తం 35 మంది సభ్యులు కలిగిన చండీగఢ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో బీజేపీకి 14 మంది కౌన్సిలర్లు ఉండగా, ఆమ్‌ ఆద్మీ పార్టీకి 10 మంది, దాని భాగస్వామ్యపక్షమైన కాంగ్రెస్‌కు ఏడుగురు సభ్యులు ఉన్నారు.
కాగా, తాజాగా ఆప్‌కు చెందిన ముగ్గురు బీజేపీలో చేరడంతో వారి సంఖ్య 17కు పెరిగింది.  మేయర్‌ పదవిని సొంతం చేసుకోవాలంటే మ్యాజిక్‌ నంబర్‌ 19 ఓట్లు రావాల్సి ఉంటుంది. అయితే బీజేపీకి శిరోమణి అకాలీదళ్‌కు చెందిన ఓ సభ్యుడు మద్దతు ప్రకటించగా, చండీగఢ్‌ ఎంపీ కిశోర్‌ ఖేర్‌కు‌ ఎక్స్‌ అఫీషియో మెంబర్‌గా ఓటు వేసే అవకాశం ఉంది.
 
దీంతో బీజేపీ బలం మ్యాజిక్‌ ఫిగరైన 19కి చేరనుంది. ఈ నేపథ్యంలో మరోసారి చండీగఢ్‌ మున్సిపాలిటీని బీజేపీయే \ చేజిక్కించుకోనున్నది. కాగా, ఈ నెల 30న జరిగిన మేయర్‌ ఎన్నికల్లో బ్యాలెట్‌ పత్రాల ట్యాంపరింగ్‌ జరిగిందని ఆరోపిస్తూ ఆప్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. న్యాయస్థానం ఆదేశాలతో మేయర్‌ మనోజ్‌ సోన్కర్‌ నేడు తన పదవికి రాజీనామా చేశారు.