జార్ఖండ్‌లోని సంకీర్ణ కూటమిలో లుకలుకలు

* కాంగ్రెస్ లో మంత్రి పదవులపై 12 మంది ఎమ్యెల్యేల నిరసనలు

 జార్ఖండ్‌లోని సంకీర్ణ కూటమిలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. నూతన ముఖ్యమంత్రి  చంపాయ్‌ సోరెన్‌కు కాంగ్రెస్ ఎమ్యెల్యేల నుంచి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. మంత్రి పదవులపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో ముసలం పుట్టడంతో ప్రభుత్వాన్ని అస్థిరత వెంటాడుతున్నది. 

ప్రస్తుతం క్యాబినెట్‌ బెర్తులు దక్కించుకున్న నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తొలగించి వారి స్థానంలో తమకు అవకాశం ఇవ్వాలని మరో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు తమ సమస్యను పార్టీ హైకమాండ్‌కు వినిపించేందుకు ఆ 12 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నారు. జార్ఖండ్‌ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

జార్ఖండ్‌లో గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం జేఎంఎం, కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కారు ఏర్పాటయ్యింది. జేఎంఎం అధినేత హేమంత్‌ సోరెన్‌ నేతృత్వంలో ఏర్పాటైన సర్కారులో నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆలంగీర్ ఆలం, రామేశ్వర్ ఓరాన్, బన్నా గుప్తా, బాదల్ పత్రలేఖ్‌లకు మంత్రి పదవులు దక్కాయి. 

అయితే ఇటీవల భూకుంభకోణం కేసులో జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ను ఈడీ అరెస్ట్‌ చేయడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. దాంతో జేఎంఎం సీనియర్‌ నేత చంపాయ్ సోరెన్‌ నూతన సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే నూతన ప్రభుత్వంలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున నలుగురు పాత మంత్రులకే మళ్లీ మంత్రి పదవులు ఇవ్వాలని పార్టీ హైకమాండ్‌ నిర్ణయించింది. 

దీనిపై మిగతా 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తమ సమస్యను హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నారు. తాము తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేను కలిసి సమస్యను చెప్పుకుంటామని తెలిపారు. 

ఢిల్లీకి బయలుదేరే ముందు మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ సోదరుడు, రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా చేరిన బసంత్‌ సోరెన్‌ను కలిసి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని తెలియజేశారు. మరోవైపు అసంతృప్త కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల కంటే ముందే జార్ఖండ్‌ సీఎం చంపాయ్‌ సోరెన్‌, ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజేశ్‌ ఠాకూర్‌ కూడా ఢిల్లీకి వెళ్లారు.

కొత్త క్యాబినెట్‌పై విభేదాల నేపథ్యంలో జార్ఖండ్‌ సీఎం చంపయీ సొరేన్‌ ఢిల్లీలో కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. మంత్రివర్గ కూర్పుపై జేఎంఎం, కాంగ్రెస్‌ మధ్య విభేదాలు అంశంపైనే సొరేన్‌తోపాటు జార్ఖండ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజేశ్‌ ఠాకూర్‌ కూడా ఖర్గేతో సమావేశమయ్యారు.  ఫిబ్రవరి 23 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలను సైతం బహిష్కరిస్తామని అసంతృప్త ఎమ్మెల్యేలు ప్రకటించారు.  ఆ నలుగురిని తొలగించకుంటే జైపూర్‌కు వెళతామని బెదిరించారు.

ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకుని కాంగ్రెస్‌ హైకమాండ్‌కు విన్నవించినట్లు సమాచారం.  81 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీలో జెఎంఎం నేతృత్వంలోని కూటమికి 47 మంది ఎమ్మెల్యేలు (జెఎంఎం 29, కాంగ్రెస్‌ 17, ఆర్‌జెడికి ఒకరు) ఉన్నారు. గత శుక్రవారం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించేందుకు కూడా అసంతృప్తి ఎమ్యెల్యేలు సిద్ధమయ్యారు. 

అయితే జార్ఖండ్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి గులాం అహ్మద్‌ మీర్‌, పిపిసి అధ్యక్షుడు రాజేష్‌ ఠాకూర్‌ల బుజ్జగింపులతో వెనక్కి తగ్గారు. అయితే వారిని తొలగించాల్సిందేనని పట్టుబడుతున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు దీపికా పాండే సింగ్‌ స్పందిస్తూ క్యాబినెట్‌లో మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పించాలని కోరారు. కేవలం ఒక్కరికే అవకాశం కల్పించటాన్ని ఎవరూ సమర్థించరని వాదించారు.

కాంగ్రెస్‌ హైకమాండ్‌ దృష్టికి అసమ్మతి స్వరాలు వినిపించారు. ఈ విషయంలో కల్పించుకోవాలని కేసీ వేణుగోపాల్‌ను కోరినట్టు మందార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శిల్పి నేహా టిర్కీ చెప్పారు.  తమ పార్టీ ఎమ్మెల్యేలు లేవనెత్తిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని జార్ఖండ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ రాజేశ్‌ ఠాకూర్‌ తెలిపారు. జార్ఖండ్‌లో జరుగుతున్న సంఘటనలను ప్రతిపక్షాలు నిశితంగా గమనిస్తున్నాయి. బీజేపీ, ఏజేఎస్‌యూ పార్టీలు పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాయి.

 “రాష్ట్రంలోని ఐదు డివిజన్లకు ఒక్కో డివిజన్‌ నుండి ఒక మంత్రిని తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే ‘ఒకే వ్యక్తి, ఒకే పదవి’ అన్న రాహుల్‌ గాంధీ నిబంధనను కూడా అమలు చేయాలని కోరుతున్నాం” అని  అనూప్‌ సింగ్‌ అనే ఎమ్మెల్యే తెలిపారు.  గడిచిన నాలుగేళ్లుగా తమకు ఇచ్చిన కోటాపై అసంతృప్తితో ఉన్నామని, అయితే చంపాయి సోరేన్‌ నేతృత్వంలో కొత్త మంత్రి వర్గం ఏర్పాటు కానుండటంతో కొత్తవారిని తీసుకుంటారని ఆశించామని చెప్పారు.