ఎన్నికల సమర శంఖం పూరించనున్న తెలంగాణ బీజేపీ

 
* 20 నుంచి విజయ సంకల్ప యాత్రలు
 
భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎన్నికల సమర శంఖం పూరించేందుకు సిద్ధమైంది. తెలంగాణలోని 17 స్థానాల్లో మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఆ పార్టీ ప్రజల వద్దకు వెళ్లనుంది. ఈ మేరకు మంగళవారం నుంచి చేపట్టే విజయ సంకల్ప యాత్రలకు ఆ పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రచార రథాలను ప్రారంభించి ప్రత్యేక పూజలు చేయనున్నారు.

ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటాలనే ఉద్దేశంతో తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలు, 119 అసెంబ్లీ స్థానాలు చుట్టేయాలని కమలం పార్టీ ప్రణాళిక రచించింది. ఈ మేరకు 17 పార్లమెంట్ స్థానాలను 5 క్లస్టర్లుగా విభజించింది. ఐదు క్లస్టర్లలో భాగంగా మొత్తం 4,238 కిలోమీటర్ల మేర ఈ రథయాత్రలు సాగనున్నాయి. యాత్రల ముగింపు సభకు ప్రధాని మోదీ రాబోతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
విజయ సంకల్ప యాత్రలకు రాష్ట్ర ప్రముఖులు నేతృత్వం వహించనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్, ఎంపీ డా.కె. లక్ష్మణ్, పార్టీ సీనియర్ నేతలు, డీకే అరుణ, ఈటల రాజేందర్ ఇతర నాయకులు ఆయా క్లస్టర్ల పరిధిలో పాల్గొననున్నారు.
 
పదేళ్లలో ప్రధాని మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రతిపక్షాల వైఫల్యాలను విజయ సంకల్ప యాత్రలతో ప్రజలకు వివరించనున్నారు. కాగా బస్సు యాత్రల సందర్భంగా ఆయా చోట్ల నిర్వహించే కార్నర్ మీటింగ్ లకు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీ నేతలు హాజరు కానున్నారు.
 
మరోవంక, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి కోడ్ అమలులోకి రావడానికి ముందే ప్రధాని నరేంద్ర మోదీ మార్చ్ మొదటి వారంలో తెలంగాణాలో పర్యటించి, సికింద్రాబాద్ లో ఓ భారీ బహిరంగసభలో ప్రసంగించేందుకు బిజెపి నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ములుగులో గిరిజన యూనివర్సిటీ, ట్రిపుల్‌ ఆర్‌ పనుల శంకుస్థాపన, ఎస్సీ రిజర్వేషన్‌పైనా మోడీతో కీలక ప్రకటనను చేపించే అవకాశమున్నట్లు చెబుతున్నారు.


యాత్రల ప్రారంభం.. ముగింపు

1. కొమురం భీం క్లస్టర్ ఆదిలాబాద్ జిల్లా ముథోల్ లో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ బస్సు యాత్రను ప్రారంభిస్తారు. ఈ యాత్ర 21 అసెంబ్లీ నియోజకవర్గాలను, 3 పార్లమెంట్ నియోజకవర్గాలను కవర్ చేస్తూ నిజామాబాద్ జిల్లా బోధన్ లో ముగుస్తుంది.

2. రాజేశ్వరి క్లస్టర్ వికారాబాద్ జిల్లా తాండూర్ లో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ బస్సు యాత్రను ప్రారంభిస్తారు. ఈ యాత్ర 28 అసెంబ్లీ నియోజకవర్గాలు, 4 పార్లమెంట్ నియోజకవర్గాలను కవర్ చేస్తూ కరీంనగర్ లో ముగుస్తుంది.

3. భాగ్యలక్ష్మి క్లస్టర్ భువనగిరిలో ప్రారంభమయ్యే బస్సు యాత్ర 3 పార్లమెంట్ నియోజకవర్గాలు 21 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ హైదరాబాద్ లో ముగుస్తుంది.

4. కాకతీయ– భద్రకాళీ క్లస్టర్  భద్రాచలంలో మొదలయ్యే బస్సు యాత్ర. 3 పార్లమెంట్ నియోజకవర్గాలు, 21 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ ములుగు జిల్లాలో ముగుస్తుంది.

5. కృష్ణమ్మ క్లస్టర్  కృష్ణా నది మక్తల్ వద్ద బస్సు యాత్రను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రారంభించనున్నారు. ఈ బస్సు యాత్ర 3 పార్లమెంట్ నియోజకవర్గాలు, 21 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ నల్గొండలో ముగుస్తుంది.