మేడారానికి పోటెత్తుతున్న భక్తులు

మేడారం మహాజాతర సందర్భాంగా భక్తులు అనేక రాష్ట్రాల నుండి తరలివస్తున్నారు. ఆదివారం కావడంతో మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. ఒక్కరోజే సుమారు ఐదు లక్షల మంది వరకు భక్తులు మొక్కులు సమర్పించి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలా ప్రతి ఆదివారం, ఇతర సెలవు దినాల్లో కలిపి ఇప్పటికే ఏంతక్కువ 20 లక్షల మందికిపైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు.

మేడారానికి వచ్చే మూడు మార్గాల్లోనూ ప్రత్యేక భద్రత కల్పించారు. తెలంగాణ రాష్ట్రంలోతోపాటు చుట్టూ ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్ ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. జాతర సమయంలో దర్శనానికి ఇబ్బందులు కలుగుతుందనే ఉద్దేశంతో చాలామంది భక్తులు ముందస్తు మొక్కులు పెట్టడానికి మేడారం తరలివస్తున్నారు. ఫలితంగా మేడారం పరిసరాలు నిత్యం కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి.

మేడారంలో ముందస్తు మొక్కులు పెట్టే భక్తుల సంఖ్య పెరిగిపోతుండటంతో టీఎస్ ఆర్టీసీ కూడా జాతరకు కొద్దిరోజుల ముందు నుంచే హనుమకొండ బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులు కూడా నడిపిస్తోంది. దీంతో వనదేవతల దర్శనానికి వచ్చే జనాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది. శనివారం మేడారంలో తాత్కాలిక బస్ స్టాండ్ ను మంత్రి సీతక్క ప్రారంభించారు.  ట్రాఫిక్ జామ్ కాకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను మంత్రి సురేఖ ఆదేశించారు.

అలాగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ఖమ్మం – వరంగల్ రూట్లో ప్రత్యేక రైలు నడపనున్నట్లు ఖమ్మం సీసీఐ జాఫర్ తెలిపారు. ఈ నెల 23న ప్రత్యేక రైలు ఉ. 10 గంటలకు ఖమ్మం స్టేషన్ నుంచి బయలుదేరి మ.12.20కి వరంగల్ చేరుకుంటుందని పేర్కొన్నారు. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 1.55 గంటలకు వరంగల్ నుంచి బయలుదేరి సాయంత్రం 4.30 గంటలకు ఖమ్మం చేరుకుంటుందని తెలిపారు.

ఈనెల 21 నుంచి జరిగే మేడారం జాతరకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ఈనెల 18 నుంచి 26 వరకు వివిధ ప్రాంతాల నుంచి 6,000 బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. 55 ఎకరాల్లో తాత్కాలిక బస్టాండ్, సుమారు 4,800 సీసీ కెమెరాలు, 5,600 మరుగుదొడ్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రత్యేక మీడియా సెంటర్, కమాండ్ కంట్రోల్ రూమ్, విద్యుత్ కోసం ప్రత్యేక సబ్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మేడారం మొత్తం గట్టి బందోబస్తు నడుమ ఉండనుందని అంటున్నారు.