మేడారం జాతరలో హలాల్ నిషేధం

 
* భక్తులకు బైక్ అంబులెన్స్ సేవలు

ఆసియా ఖండంలోనే అత్యంత విశేషంగా జరిగే గిరిజన జాతర మేడారం జాతర . విగ్రహాలు లేనటువంటి విశిష్టమైన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. త్వరలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం వద్ద దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
 మేడారం మహా జాతరలో ఎవరు హలాల్ చేయకూడదని, మేడారం మహా జాతరలో హలాల్ చేయడం నిషేధం అని సమ్మక్క ప్రధాన పూజారి సిద్దబోయిన అరుణ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. మేడారం జాతరలో హలాల్ చేస్తే అమ్మవారికి చెల్లదు ఆయన పేర్కొన్నారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు హలాల్ చేయడం విరుద్ధమని సిద్దబోయిన అరుణ్ తెలిపారు.  మేడారం వచ్చే భక్తులంతా గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలను తప్పక గౌరవించాలని ఆయన కోరారు. ఎవరైనా హలాల్ చేస్తే అస్సలే రావద్దని చెప్పారు.
 
మేడారం వచ్చే భక్తులకు అవసరమైన వైద్య సేవలందించడంపై రాష్ట్ర సర్కారు దృష్టి పెట్టింది. ఇప్పటికే జాతరలో నిరంతర వైద్య సదుపాయం కల్పించాల్సిందిగా జిల్లా అధికారులకు ఆదేశాలు ఇవ్వగా తాజాగా బైక్ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దాదాపు కోటిన్నర మంది వరకు తరలివచ్చే అవకాశం ఉన్న ఈ మహాజాతరలో అత్యవసర సేవలందించేందుకు జాతరలో బైక్ అంబులెన్స్ సేవలకు శ్రీకారం చుట్టారు. 
 
శనివారం మంత్రి సీతక్క, అధికారులతో కలిసి మేడారంలోని గిరిజన మ్యూజియం ఆవరణలో బైక్ అంబులెన్స్ లను ప్రారంభించారు. మొత్తంగా 40 బైక్ అంబులెన్సులను ప్రారంభించగా, అందులో దాదాపు 21 రకాల మెడికల్ కిట్ అందుబాటులో ఉంటుందని మంత్రి సీతక్క తెలిపారు. మహాజాతరకు తరలివచ్చే భక్తులకు వైద్య సేవలు అందించేందుకు మేడారంలోనే 50 బెడ్లతో తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నారు. 
మేడారంలోని ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో స్పెషలిస్ట్ డాక్టర్లతో కూడిన మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. మేడారం వెళ్లే రూట్ లో 42 మెడికల్ క్యాంపులు, జాతర పరిసరాల్లో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి క్యాంపులో డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని, అవసరమైన అన్ని రకాల మెడిసిన్, ఎమర్జెన్సీ మెడికల్ కిట్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
జాతర వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, పేషెంట్లను వీలైనంత త్వరగా మెడికల్ క్యాంపులు, సమీపంలోని హాస్పిటళ్లకు తరలించే ఏర్పాట్లు చేయాలని తెలిపేరు. మెడికల్ క్యాంపుల్లో ట్రీట్‌మెంట్ చేశాక.. ఇంకా ఉన్నతస్థాయి వైద్యం అవసరమైతే ములుగు, ఏటూరునాగారం, పరకాల ఏరియా హాస్పిటల్స్‌కు, వరంగల్ ఎంజీఎంకు తరలించి చేసి వైద్యం అందించాలని మంత్రి సూచించారు.