జెపి నడ్డా పదవి కాలం పొడిగింపు, ప్రధాని అభ్యర్థిగా మోదీ!

2024 ఎన్నికలకు ముందు ఢిల్లీలో బిజెపి జరిపిన కీలకమైన రెండు రోజుల జాతీయ సదస్సులో పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా పదవీకాలాన్ని వచ్చే జూన్ వరకు పొడిగించారు. మరోవంక, మూడేసారి పార్టీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీని తిరిగి లాంఛనంగా ప్రకటించారు.

బీజేపీ అధ్యక్షుడు జేపీ న‌డ్డా ప‌ద‌వీ కాలాన్ని ఈ ఏడాది జూన్ వ‌ర‌కూ పొడిగిస్తున్నట్లు ఈ ఏడాది జ‌న‌వ‌రిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్ర‌క‌టించ‌గా, తాజాగా పార్టీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశం ఆమోదించింది. జేపీ న‌డ్డా స్వ‌యంగా ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అధికారాన్ని పార్టీ ఆయ‌న‌కు క‌ట్ట‌బెట్టింది.

ఈ నిర్ణ‌యాల‌కు ఆ త‌ర్వాత పార్టీ పార్ల‌మెంటరీ బోర్డు ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో వ్య‌వ‌హ‌రించాల్సిన వ్యూహాలు, ప్ర‌చార ప‌ర్వం వంటి అంశాల‌పై వేలాది మంది పార్టీ స‌భ్యుల స‌మక్షంలో చర్చ చేప‌ట్టారు. 2019లో పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కేంద్ర మంత్రి ప‌ద‌విలో ఉండ‌గా జేపీ న‌డ్డా పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. 2020లో పార్టీ పూర్తికాల అధ్య‌క్ష బాద్య‌త‌ల‌ను జేపీ న‌డ్డా చేప‌ట్టారు.

ఇక పార్టీ జాతీయ అధ్య‌క్షుడిగా జేపీ న‌డ్డా ప‌ద‌వీ కాలాన్ని ఈ ఏడాది జూన్ వ‌ర‌కూ పొడింగించారు. జేపీ న‌డ్డా నాయ‌క‌త్వంలో బీజేపీ ప‌లు రాష్ట్రాల్లో ఘ‌న విజ‌యాలు సాధించింద‌ని, కొన్ని రాష్ట్రాల్లో గ‌ణ‌నీయ సంఖ్య‌లో త‌మ ఎమ్మెల్యేలు గెలుపొందార‌ని న‌డ్డా ప‌ద‌వీకాలం పొడిగింపును ప్ర‌క‌టిస్తూ అమిత్ షా ఇటీవ‌ల ప్ర‌స్తావించారు. ఇక రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ 370కి పైగా స్ధానాలు, ఎన్డీయే 400పైగా స్దానాల్లో గెలుపొందుతుంద‌ని జేపీ న‌డ్డా ధీమా వ్య‌క్తం చేశారు.

కాగా, రెండో రోజు సమావేశాల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సన్మానించారు బీజేపీ నేతలు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా.. ఆయనకు నిలువెత్తు పూలమాలను వేసి సత్కరించారు. మోదీజీకి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ మోదీని తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా మరోమారు లాంఛనంగా ప్రకటించారు.

అనంతరం అమిత్ షా ప్రసంగిస్తూ వచ్చే ఎన్నికల్లో 400 లోక్‌సభ స్థానాలను గెలవాలని టార్గెట్‌గా పెట్టుకున్నామని, దీన్ని అవలీలగా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మోదీని మరోసారి ప్రధానిగా ఎన్నుకోవడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ముచ్చటగా మూడోసారి ఆయన ఈ దేశానికి నాయకత్వాన్ని వహిస్తారని చెప్పారు. ఇందులో ఎలాంటి సందేహాలు లేవని స్పష్టం చేశారు.
 
ఈ 75 సంవత్సరాల్లో ఈ దేశం 17 లోక్‌సభ ఎన్నికలు, 22 ప్రభుత్వాలు, 15 మంది ప్రధానమంత్రులను చూసిందని, ఎప్పుడూ జరగని అభివృద్ధి మాత్రం మోదీ హయాంలోనే చోటు చేసుకుందని అమిత్ షా తెలిపారు. ప్రతి రంగం అభివృద్ధి చెందిందని, ప్రతి వ్యక్తి అవసరాలను మోదీ ప్రభుత్వం తీర్చిందని చెప్పారు. ఈ 10 సంవత్సరాలలో మాత్రమే అది సాధ్యపడిందని స్పష్టం చేశారు.
 
కాగా, అత్యవసర సమయాల్లో పార్టీ అధ్యక్ష పదవీ కాలం, పొడగింపుపై నిర్ణయం తీసుకొనే అధికారాన్ని బీజేపీ పార్లమెంటరీ బోర్డుకు అప్పగిస్తూ బీజేపీ జాతీయ సదస్సు పార్టీ రాజ్యాంగంలో మార్పులు చేసింది. ఈ మేరకు సంబంధిత ప్రతిపాదనను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ ప్రవేశపెట్టారు.