434 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

*ఇంగ్లండ్‍‍ను కూల్చేసిన భారత స్పిన్నర్లు

ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా భారీ తేడాతో ఇంగ్లండ్‍పై ఏకపక్ష విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టుపై 434 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. రెండో ఇన్నింగ్స్‌లో 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌  122కే ఆలౌటైంది.   క్రాలే(11), బెన్‌స్ట్రోక్‌(15),  బెన్‌ ఫోక్స్‌(16), హార్ట్‌లీ(16), మార్క్‌ వుడ్‌(33) జేమ్స్‌ అండర్సన్‌(1), పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు.  
భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5 , కుల్దీప్‌ 2, బుమ్రా , అశ్విన్ ఒక్కో వికెట్ తీశారు.  557 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ నిర్దేశించగా.. దిక్కుతోచని స్థితిలో పడిన ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో పట్టుమని 40 ఓవర్లు కూడా నిలువలేకపోయింది. భారత స్పిన్నర్ల విజృంభణతో నాలుగో రోజైన నేడు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 122 పరుగులకు కుప్పకూలింది. 

భారత స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా 12.4 ఓవర్లలో 41 పరుగులే ఇచ్చి 5 వికెట్లను పడగొట్టాడు. ఇంగ్లిష్ బ్యాటింగ్ లైనప్‍ను వణికించాడు. మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రెండు, రవిచంద్రన్ అశ్విన్, స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా చెరో వికెట్ దక్కించుకున్నారు.

ఇంగ్లండ్ బ్యాటర్లలో పదో స్థానంలో వచ్చిన మార్క్ వుడ్ (33) మినహా మరెవరూ కూడా కనీసం 20 పరుగుల మార్క్ చేరలేకపోయారు. భారత స్పిన్ ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయి కుప్పకూలింది స్టోక్స్ సేన. 39.4 ఓవర్లలోనే రెండో ఇన్నింగ్స్ ముగించి.. భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మూడో టెస్టులో గెలుపుతో ఐదు టెస్టుల సిరీస్‍లో భారత్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.

ఇంగ్లండ్‍తో ఈ మూడో టెస్టులో 434 పరుగుల తేడాతో గెలిచి రికార్డు సృష్టించింది టీమిండియా. టెస్టు క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా భారత జట్టుకు ఇదే అత్యంత పెద్ద విజయంగా ఉంది. అద్భుతమైన ఆట తీరుతో రోహిత్ శర్మ సేన ఈ గ్రాండ్ విక్టరీని అందుకుంది.