2024లో మళ్లీ ప్రధాని మోదీ నాయకత్వంలో అధికారం

* 2029 నాటికి తెలంగాణలో అధికారం చేపడతాం

2024లో మళ్లీ ప్రధాని మోదీ నాయకత్వంలో మూడోసారి అధికారంలోకి రాబోతున్నట్లు బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ధీమా వ్యక్తం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల అజెండాను నిర్దేశించేందుకు భారతీయ జనతా పార్టీ రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభ సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ పార్టీ దేశ వ్యాప్తంగా దూసుకెళ్తోందని చెప్పుకొచ్చారు. 12 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు.
 
ప్రపంచంలోనే బీజేపీ అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందని నడ్డా తెలిపారు.  ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక దేశంలో సుస్థిర ప్రభుత్వం వచ్చిందని తెలిపారు. 2014కు ముందు కేవలం 5 రాష్ట్రాల్లోనే బీజేపీకి ప్రభుత్వాలు ఉండేవని, ఇప్పుడు పన్నెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయని చెప్పుకొచ్చారు.
 
తెలంగాణలో బీజేపీకి గతంలో ఒకే శాసనసభ్యుడు ఉండేవారని, ఓటు బ్యాంకు గతంలో 7 శాతం ఉండగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 14 శాతానికి పెరిగిందని నడ్డా గుర్తు చేశారు. ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారని చెబుతూ రానున్న ఐదేళ్లలో తెలంగాణలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్ లో కూడా అధికారంలోకి వస్తామని చెబుతూ అక్కడ 3 సీట్లు, 10 శాతం ఓట్ల స్థాయి నుండి 38.5 శాతం ఓట్లతో 77 సీట్లు పొందామని తెలిపారు.
ఏడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో భారతీయ జనసంఘ్, భారతీయ జనతా పార్టీ అనేక పార్శాలను చూశామని చెబుతూ పోరాటాలను, ఎవ్వరూ గుర్తించని పరిస్థితిని, ఎమర్జెన్సీని, ఎన్నికలలో పరాజయాలను, విజయాలను ఎన్నింటినో చూశామని నడ్డా వివరించారు. ఎందరో కార్యకర్తల థయాగాలతో నేడు  బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందని కొనియాడారు. గత పదేళ్లుగా మోదీ నాయకత్వంలో అన్ని విజయాలనే పార్టీ చూస్తున్నదని సంతోషం ప్రకటించారు.
 
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి ప్రజలు మద్దతివ్వడం వల్లనే అన్ని రాష్ట్రాల్లో ఇంతటి గొప్ప ఫలితాలు రావడానికి కారణమని జేపీ నడ్డా తెలిపారు. ఇక, క్షేత్రస్థాయిలో కార్యకర్తలంతా ఎంతో శ్రమించి బీజేపీకి ఓట్లు వచ్చేలా కృషి చేశారని పేర్కొంటూ శ్రమించి పనిచేసిన కార్యకర్తలందరికీ అభినందనలు తెలిపారు.

ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారేదని, ఆ సంప్రదాయాన్ని కాదని.. ఉత్తరాఖండ్ ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.
 
 గరీబ్, యువ, రైతు, మహిళా శక్తిని దృష్టిలో ఉంచుకుని మోదీ నాయకత్వంలో బీజేపీ ముందుకు సాగుతోందని చెబుతూ గత పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారని చెప్పారు. 2014 తర్వాత 17 రాష్ట్రాల్లో స్వచ్ఛమైన ఎన్డీయే ప్రభుత్వాలు ఉన్నాయని, 12 రాష్ట్రాల్లో అయితే సొంతంగా బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయని నడ్డా చెప్పారు. 
 
గుజరాత్ లో రెండు దశాబ్దాలకు పైగా బిజెపి పాలనా సాగుతుందని చెబుతూ కేంద్రంలో ముప్పై ఏళ్ల తర్వాత 2014లో దేశంలో సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేశారు. నేడు 80 కోట్ల మంది ప్రజలు ప్రధాన మంత్రి గరీబ్ అన్నయోజన పధకం క్రింద ఉచితంగా ఆహార ధాన్యాలను పొందుతున్నారని తెలిపారు.
 
ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, విద్య, ఉపాధిలతో సహా ప్రతి రంగంలో మోదీ నాయకత్వంలో ప్రతి భారతీయుడి కళలను సాకారం చేసుకోగలుగుతున్నామని  నడ్డా వివరించారు. ప్రధాని మోదీ మన దేశ రాజకీయాల స్వరూపాన్నే సవాల్ చేసి, వినూత్న మార్పులు తీసుకు వచ్చారని కొనియాడారు.
 
రామమందిర ప్రారంభోత్సవానికి ప్రతిపక్షాలు రాకపోవడాన్ని నడ్డా తప్పుపట్టారు. ఈ సందర్భంగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పదేళ్లలో చేపట్టిన కార్యక్రమాలను ప్రతినిధులకు నడ్డా వివరించారు. ఈ సమావేశాల్లో ప్రధాని మోదీ, అమిత్ షా, కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.