
రానున్న లోక్ సభ ఎన్నికల కోసం ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తేవాలనే లక్ష్యంతో ఏర్పాటైన ‘ఇండియా’ కూటమి కథ ఏనాడో ముగిసిందని బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ చెప్పారు. ఆయన శనివారం విలేకర్లతో మాట్లాడుతూ ఈ కూటమికి ‘ఇండియా’ అనే పేరు పెట్టడం తనకు మొదటి నుంచి ఇష్టం లేదని, వేరొక పేరు పెట్టాలని శాయశక్తులా ప్రయత్నించానని వెల్లడించారు.
ఈ కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకం, పొత్తుల వ్యవహారం ముగిసి చాలా కాలం అయిందని పేర్కొంటూ అందుకే తాను ఎన్డీయేతో పొత్తు పెట్టుకున్నానని, ఇది కొనసాగుతుందని స్పష్టం చేశారు. నితీశ్ కుమార్‌కు తమ తలుపులు ఎల్లవేళలా తెరిచే ఉంచామని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను విలేకర్లు ప్రస్తావించినపుడు నితీశ్ స్పందిస్తూ, తాను కూటమిలోని పార్టీలతోనూ, ప్రతిపక్ష నేతలతోనూ ఎల్లప్పుడూ సత్సంబంధాలను కొనసాగిస్తుంటానని చెప్పారు.
ఎవరు ఏం చెప్పారనే విషయాన్ని తాను ఆలోచించనని, వారితో (ఆర్జేడీతో) కలిసి ఉన్నపుడు పరిస్థితులు బాగులేవని, అందుకే వారిని వదిలిపెట్టామని తెలిపారు. జేడీయూ- ఆర్జేడీ- కాంగ్రెస్ మహాకూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, మంత్రులు లలిత్ యాదవ్, రామానంద్ యాదవ్ నిర్వహించిన శాఖల్లో అక్రమాలు జరిగాయని నితీశ్ ఆరోపించారు.
వీటిని సహించేది లేదని, దర్యాప్తు జరుగుతున్నదని తెలిపారు. ఇక ‘ఇండియా’ కూటమి విషయానికి వస్తే, లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ సీట్ల పంపకాల గురించి సరైన చర్చలు జరగకపోవడంతో కూటమిలోని పార్టీలు ఒక్కొక్కటిగా తాము ఒంటరిగానే పోటీ చేస్తామని, లేదా, కాంగ్రెస్‌కు తక్కువ స్థానాలు ఇస్తామని ప్రకటించడం ప్రారంభించాయి.
పశ్చిమ బెంగాల్‌లో ఒంటరిగా పోటీ చేస్తామని టీఎంసీ ప్రకటించగా, ఢిల్లీలో కాంగ్రెస్‌కు ఒక స్థానం మాత్రమే ఇస్తామని ఆప్ ప్రకటించింది. జమ్మూ- కశ్మీరులో ఒంటరిగా పోటీ చేస్తామని ఫరూక్ అబ్దుల్లా చెప్పారు. బీజేపీతో జట్టు కడతామనే సంకేతాలను ఆర్‌ఎల్‌డీ పంపిస్తున్నది.
More Stories
భారతదేశ వారసులు హిందువులే
భారత్ లో ఓటింగ్‌ను పెంచేందుకు అమెరికా నిధులు?
ఛత్తీస్‌గఢ్ మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి క్లీన్ స్వీప్