సజీవంగా సమాధిలోకి జైనముని విద్యాసాగర్‌ మహారాజ్‌

ప్రముఖ జైనమత 108వ గురువు, నగ్న ముని అచార్య విద్యాసాగర్‌ జీ మహరాజ్‌ ఇకలేరు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం డొంగార్‌గఢ్‌లోని చంద్రగిరి తీర్థంలో మూడు రోజుల క్రితం సజీవ సమాధి అయిన ఆయన శనివారం మధ్యాహ్నం 2.35 గంటలకు తన దేహాన్ని విడిచి వెళ్లారు. సజీవ సమాధిలోకి వెళ్లినప్పటి నుంచి దేహాన్ని విడిచే వరకు ఆయన నిరంతరాయ నిశ్శబ్దాన్ని పాటించారు. 
 
ఆచార్య విద్యాసాగర్‌ మహరాజ్‌ మరణవార్త ఆదివారం ఉదయం వెలుగులోకి రావడంతో జైనమతానికి చెందిన ప్రజలు తండోపతండాలు ఆయన సమాధిని దర్శించుకునేందుకు తరలివెళ్తున్నారు.  విద్యాసాగర్‌ మహరాజ్‌ గురువు జ్ఞాన్‌ సాగర్‌ మహరాజ్‌ కూడా తన 77వ ఏట చంద్రగిరి తీర్థంలోనే సజీవంగా సమాధిలోకి వెళ్లి మూడు రోజులకు దేహాన్ని విడిచారు. 
 
సజీవ సమాధికి మూడు రోజుల ముందే విద్యాసాగర్‌ మహరాజ్‌కు జ్ఞాన్‌ సాగర్‌ మహరాజ్‌ జైనమత గురువు స్థానాన్ని కట్టబెట్టారు. అప్పటికి విద్యాసాగర్‌ మహరాజ్‌ వయసు 26 ఏండ్లు. ఇప్పుడు విద్యాసాగర్‌ మహారాజ్‌ కూడా సజీవ సమాధికి ముందు తన శిష్యుల్లోంచి ఒకరిని తదుపరి ఆచార్యగా ప్రకటించారు. నిర్యాపక శ్రామన్‌ ముని సమయ్‌సాగర్‌కు ఆచార్య హోదాను కట్టబెట్టారు.
 
విద్యాసాగర్‌ మహరాజ్‌ 1946 అక్టోబర్‌ 10న కర్ణాటక రాష్ట్రం బెల్గాం జిల్లాలోని సదల్గా గ్రామంలో జన్మించారు. ఆయన తోడ ముగ్గురు అన్నలు, ఇద్దరు అక్కలు ఉన్నారు. అందరూ ఆధ్యాత్మిక కార్యక్రమాలతోనే గడిపారు. దాదాపు 500 మందికి పైగా ఆయన దగ్గర శిష్యరికం చేశారు.  కాగా, విద్యాసాగర్‌ మహరాజ్‌ మరణవార్త తెలియగానే ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయ్‌ సోషల్ మీడియా ద్వారా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతికి చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం ఆదివారం ఒకపూటను సంతాప దినంగా ప్రకటించింది.
 
దేశ రాజధాని ఢిల్లీలో ‘జరుగుతున్న బీజేపీ జాతీయ సమ్మేళనం-2024’ రెండో రోజు సమావేశంలో ముందుగా ప్రసంగించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జైన మత 108వ ఆచార్య విద్యాసాగర్‌ జీ మహరాజ్‌ మరణం గురించి  ప్రస్తావించారు. అభీష్ఠానుసారం దేహాన్ని విడిచివెళ్లిన విద్యాసాగర్‌ మహారాజ్‌ జీ మరణంపట్ల తీవ్ర విచారం వ్యక్తంచేశారు. విద్యాసాగర్‌ మహరాజ్‌ మరణానికి సంతాపంగా ఒక నిమిషం మౌనం పాట్టిద్దామని పార్టీ కార్యవర్గానికి సూచించారు. దాంతో పార్టీ సభ్యులంతా లేచి నిలబడి ఒక నిమిషం పాటు మౌనం పాటించారు.
 
కాగా, గత ఏడాది నవంబర్‌ 5న భారత ప్రధాని నరేంద్రమోదీ విద్యాసాగర్‌ మహరాజ్‌ను దర్శించుకుని ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన మృతి పట్ల ‍ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. “నా ఆలోచనలు, ప్రార్థనలు ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్ జీ మహారాజ్ జీ అసంఖ్యాక భక్తులతో ఉన్నాయి. సమాజానికి ఆయన చేసిన అమూల్యమైన కృషికి, ముఖ్యంగా ప్రజలలో ఆధ్యాత్మిక జాగృతికి ఆయన చేసిన కృషి, పేదరిక నిర్మూలన, వైద్యం, విద్య,  మరిన్నింటి కోసం ఆయన చేసిన కృషికి రాబోయే తరాలు గుర్తుండిపోతాయి” అంటూ ప్రధాని నివాళులు అర్పించారు. 
 
“ఇన్నాళ్లకు ఆయన ఆశీస్సులు అందుకున్న ఘనత నాకు దక్కింది. గత ఏడాది చివర్లో ఛత్తీస్‌గఢ్‌లోని డోంగర్‌ఘర్‌లోని చంద్రగిరి జైన మందిరాన్ని సందర్శించడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సమయంలో, నేను ఆచార్య 108 విద్యాసాగర్ జీ మహారాజ్ జీతో గడిపాను. వారి ఆశీస్సులు కూడా పొందాను” అంటూ ప్ర‌ధాని ఎక్స్​ద్వారా ట్వీట్ చేశారు.