తొలిసారి అసియా విజేతగా భారత మహిళా జట్టు

* ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్ విజేతగా భారత మహిళల జట్టు
 
బ్యాడ్మింట‌న్ ఆసియా టీమ్ చాంపియ‌న్‌షిప్స్‌లో భార‌త మ‌హిళా ష‌ట్ల‌ర్లు చ‌రిత్ర సృష్టించారు. మలేషియాలో జ‌రుగుతున్నఈ టోర్నీలో దేశానికి తొలి ప‌సిడి ప‌త‌కం అందించారు. ఈ టోర్నీ చ‌రిత్రలో ఫైన‌ల్ చేరిన మొద‌టిసారే భార‌త బృందం స్వ‌ర్ణ ప‌త‌కం కొల్ల‌గొట్టడం విశేషం.  క్రీడా చరిత్రలో ప్రతిష్టాత్మకమైన కాంటినెంటల్ టీమ్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను భారత్ గెలుచుకోవడం ఇదే తొలిసారి.
 
భారత బ్యాడ్మింటన్ స్టార్‌లు పీవీ సింధు, గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీ, టీనేజ్ సంచలనం అన్మోల్ ఖర్బ్ లు తమ తమ మ్యాచుల్లో గెలుపొందారు. థామస్ కప్‌ను గెలుచుకున్న రెండేళ్ల తరువాత ఖండాంతర టోర్నమెంట్‌లో భారత్ అద్భుతంగా రాణించి చైనా, హాంకాంగ్, జపాన్, చివరికి థాయ్‌లాండ్‌లను ఓడించి కప్పును గెలుచుకుంది. 
 
ఆదివారం థాయ్‌లాండ్‌తో జ‌రిగిన ఫైన‌ల్లో 3-2తో గెలుపొందింది. 17 ఏండ్ల అన్మోల్ ఖార్బ్ సంచ‌ల‌న ఆట‌తో పొర్న్‌పిచా చోయ‌కీవాంగ్‌ను చిత్తు చేసి భార‌త్‌కు చారిత్రాత్మ‌క ప‌త‌కాన్ని అందించింది.లీగ్ ద‌శ‌లోనే చైనా గోడ‌ను బ‌ద్ధ‌లు కొట్టిన భార‌త ష‌ట్ల‌ర్లు క్వార్ట‌ర్ ఫైన‌ల్లో హాంకాంగ్‌ను చిత్తు చేశారు.  ఇక కీల‌క‌మైన సెమీఫైనల్లోనూ త‌మ ప్ర‌తాపం చూపిస్తూ జ‌పాన్ క్రీడాకారుణుల‌ను ఓడించారు. దాంతో, బ్యాడ్మింట‌న్ ఆసియా టీమ్ చాంపియ‌న్‌షిప్స్ టోర్నీలో తొలిసారి టీమిండియా ఫైన‌ల్లో అడ‌గు పెట్టి చ‌రిత్ర సృష్టించింది. 
 
ఆదివారం జ‌రిగిన ఫైనల్లో ఒలింపిక్ మెడ‌లిస్ట్ పీవీ సింధుతో పాటు గాయ‌త్రి గోపిచంద్, ట్రెసా జాలీలు సింగిల్స్‌లో విజ‌య ఢంకా మోగించారు. సెమీస్‌లో కంగుతిన్న‌ సింధు టైటిల్ పోరులో స‌త్తా చాటింది. సుప‌నింద క‌టెథాంగ్‌ను 39 నిమిషాల్లోనే 21-12, 21-12 తో చిత్తు చేసి భార‌త్‌ను 1-0 ఆధిక్యంలో నిలిపింది.
ఆ త‌ర్వాత గాయ‌త్రి, ట్రెసాలు అద్భుత విజ‌యంతో టీమిండియా 2-0తో థాయ్‌లాండ్‌పై పై చేయి సాధించింది.
ఇక విజేత‌ను నిర్ణ‌యించే డిసైడ‌ర్ మ్యాచ్‌లో యువ‌కెర‌టం అన్మోల్ అసాధార‌ణ‌మైన ఆట‌తో ప్ర‌త్య‌ర్థికి చెక్ పెట్టింది. హోరాహోరీగా సాగిన పోరులో పోర్న్‌పిచాను 21-14, 21-19తో మ‌ట్టిక‌రిపించింది. దాంతో, ఈ టోర్నీ చ‌రిత్ర‌లో తొలి స్వ‌ర్ణంతో మువ్వ‌న్నెల జెండాను రెప‌రెప‌లాడించింది.

సాత్విక్- చిరాగ్ శెట్టి జోడీకి గోల్డ్!

మరోవంక, దుబాయ్‌లో జరుగుతున్న బ్యాడ్మింటన్ ఏషియా చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి -చిరాగ్ శెట్టి జోడి సరికొత్త చరిత్ర సృష్టించింది. అల్ నసర్ క్లబ్‌లో షేక్ రషీద్ బిన్ హమ్దాన్ ఇండోర్ హాల్‌లో జరిగిన ఫైనల్‌లో ప్రపంచ నంబర్ 8 ర్యాంకర్లయిన మలేసియాకు చెందిన యెన్ సిన్-టెయో ఈ యి జంటపై ప్రపంచ నంబర్ 6 జోడీ అయిన సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడి చారిత్రక విజయం సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.

బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు ఇది రెండో స్వర్ణం పతకం. అంతకుముందు 1965లో దినేశ్ ఖన్నా పురుషుల సింగిల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. మళ్లీ ఇన్ని దశాబ్దాల తర్వాత భారత్ స్వర్ణం కైవసం చేసుకుంది. చారిత్రక విజయం సాధించిన ఈ జోడీపై భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ ప్రశంసల జల్లు కురిపించింది. ఈ జోడీకి రూ. 20 లక్షల ప్రైజ్‌మనీని ప్రకటించారు.