మళ్లీ డబుల్‌ సెంచరీ కొట్టిన జైస్వాల్

యశస్వి జైస్వాల్ మరోసారి డబుల్‌ సెంచరీతో చెలరేగడంతో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్‌ భారీ స్కోరు చేసింది. మూడో రోజు రిటైర్ట్‌ హర్ట్‌గా వెనుదిరిగిన యశస్వి జైస్వాల్ నాలుగో రోజు మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. దూకుడుగా ఆడి ఈ సిరీస్‌లో రెండో డబుల్‌ సెంచరీని నమోదు చేశాడు.  రాజ్‍కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు భారత రెండో ఇన్నింగ్స్‌లో 236 బంతుల్లోనే ఏకంగా 12 సిక్సర్లు, 14 ఫోర్లతో అజేయంగా 214 పరుగులు చేశాడు.
దీంతో వినోద్ కాంబ్లీ, విరాట్ కోహ్లీ తర్వాత టెస్టుల్లో వరస మ్యాచ్‍ల్లో డబుల్ సెంచరీ చేసిన మూడో భారత ప్లేయర్‌గానూ రికార్డులకెక్కాడు.  యశస్వి జైస్వాల్ ద్విశతకంతో విజృభించడంతో పాటు శుభ్‍మన్ గిల్ (91 పరుగులు), సర్ఫరాజ్ ఖాన్ (72 బంతుల్లో 68 పరుగులు; నాటౌట్) అర్ధశకతకాలతో రాణించారు. దీంతో భారత్‌ 430/4 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.
ఫలితంగా ఇంగ్లాండ్‌ ముందు 557 పరుగుల భారీ లక్ష్యం నిలిపింది. యశస్వి జైస్వాల్ 214*, శుభ్‌మన్‌ గిల్‌ 91, సర్ఫరాజ్‌ ఖాన్ 68* రాణించారు.  దాదాపు ఈ లక్ష్యాన్ని ఛేదించడం దాదాపు అసాధ్యమే. నేడు ఇంకా 43 ఓవర్ల ఆట జరగాల్సి ఉండగా ఐదో రోజు కూడా ఆడాల్సి ఉండటంతో ఇంగ్లండ్ డ్రా చేసుకోవడం కూడా చాలా కష్టం. దీంతో టీమిండియా ఈ మూడో టెస్టుపై పూర్తిగా పట్టు సాధించింది.
ఓవర్‌ నైట్‌ స్కోరు 196/2తో మూడో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్‌.. దూకుడుగా ఆడింది. శుభ్‌మన్‌ గిల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌లు వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించడంతో టీమిండియా వేగంగా పరుగులు రాబట్టింది. రెండో టెస్టులో సెంచరీతో రాణించిన గిల్‌.. మరోసారి సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే కుల్‌దీప్‌ యాదవ్‌తో సమన్వయ లోపంతో గిల్‌ రనౌట్‌ అయ్యాడు.
దీంతో సెంచరీకి మరో 9 పరుగుల దూరంలో నిరాశగా వెనుదిరిగాడు. ఉన్నంత సేపు ఆకట్టుకున్న కుల్‌దీప్‌ యాదవ్‌ చివరకు 27 పరుగులు చేసి ఔట్‌ అయ్యాడు. ఇందులో ఓ సిక్స్‌, 3 ఫోర్లు ఉన్నాయి. అరంగేట్రం చేసిన టెస్టులోనే భారత బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ రెండో ఇన్నింగ్స్‌ల్లో అర్ధ శతకాలతో అదరగొట్టాడు. తనపై పెట్టుకున్న అంచనాలను పూర్తిస్థాయిలో నిలబెట్టుకున్నాడు. టెస్టు అరంగేట్రంలో రెండు ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీలు చేసిన నాలుగో భారత ఆటగాడిగా సర్ఫరాజ్ నిలిచాడు.