
* 28 మంది అభ్యర్థులలో 24 మంది రాజ్యసభకు కొత్తవారే
ఫిబ్రవరి 27న జరిగే రాజ్యసభ ఎన్నికలు ఎగువ సభలో బీజేపీ సంఖ్యను మార్చకపోవచ్చు. కానీ ఆ పార్టీ సభ్యుల రూపురేఖలు పూర్తిగా, భిన్నంగా ఉండబోతున్నాయి. పార్టీ ప్రకటించిన 28 అభ్యర్థులలో 24 మంది కొత్తవారే. ప్రస్తుత అభ్యర్థులు కేవలం నలుగురు మాత్రమే సీటు పొందారు. తొమ్మిది మంది కేంద్ర మంత్రుల రాజ్యసభ పదవీకాలం పూర్తవుతూ ఉండగా వారిలో ఇద్దరు మాత్రమే – అశ్వని వైష్ణవ, ఎల్ మురుగన్ తిరిగి సీటు పొందారు.
ఈ ద్వైవార్షిక ఎన్నికల్లో మొత్తం 56 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. బీజేపీ తన సంఖ్య ప్రకారం 27 సీట్లు గెలుపొందగలడు. ఒడిశాలో బిజెడి సహాయంతో మరో సీటు గెల్చుకోనున్నది. రాజ్యసభకు తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్న నలుగురు బిజెపి నాయకులలో పార్టీ అధ్యక్షుడు జె పి నడ్డా, సీనియర్ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి ఎల్ మురుగన్, సీనియర్ బిజెపి అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది మాత్రమే.
జెపి నడ్డా గత పర్యాయం హిమాచల్ ప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎన్నిక కాగా, ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో ఈ పర్యాయం గుజరాత్ నుండి పోటీ చేస్తున్నారు. అశ్వని వైష్ణవి గత పర్యాయం మాదిరిగా తిరిగి ఒడిశా నుండి బిజెడి మద్దతుతో రాజ్యసభకు పోటీ చేస్తున్నారు. మురుగన్ మధ్య ప్రదేశ్ నుండి, సుధాన్షు త్రివేది ఉత్తర ప్రదేశ్ నుండి తిరిగి ఎన్నికయ్యేందుకు సిద్దపడుతున్నారు.
రాజ్యసభకు వరుసగా ఎన్నకవుతూ వస్తున్న సీనియర్ నాయకులను లోక్‌సభ ఎన్నికల్లో పోట చేయాలని బీజేపీ అగ్ర నాయకత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. దానితో తమ పదవీకాలం పూర్తవుతున్నా తిరిగి రాజ్యసభ సీట్లు పొందలేని కేంద్ర మంత్రులు భూపేందర్ యాదవ్, ధర్మేంద్ర ప్రధాన్, మన్సుఖ్ మాండవ్య, నారాయణ్ రాణే, పురుషోత్తం రూపాలా, వి మురళీధరన్, రాజీవ్ చంద్రశేఖర్ త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయాల్సి ఉంటుంది.
లేని పక్షంలో వారి సేవలను పార్టీ సంస్థాగత వ్యవహారాలలో ఉపయోగించుకొనే అవకాశం ఉంటుంది. రాజ్యసభ సీట్లు తిరిగి పొందలేని ప్రముఖులలో బీజేపీ జాతీయ మీడియా హెడ్ అనిల్ బలూనీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు సరోజ్ పాండే, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీలు ఉన్నారు.
ఆగస్టులో ఎన్డీయే ఎంపీలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ప్రతి రాజ్యసభ ఎంపీ కనీసం ఒక సారయినా ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయాలని స్పష్టం చేశారు. తద్వారా క్షేత్రస్థాయి ఎన్నికల “అనుభూతి” పొందాలని సూచించారు. అందుకనే ఒడిశాలో ప్రధాన్‌గానీ, కేరళలో మురళీధరన్‌గానీ లోక్‌సభ పోరులో పాల్గొనడం ద్వారా తమ రాష్ట్రాల్లో కొత్త రాజకీయ నేతలుగా ఎదగాలని ప్రధాని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అదే విధంగా కేరళ లేదా కర్ణాటకలో రాజీవ్ చంద్రశేఖర్, గుజరాత్‌లో మాండవియా, రూపాలా, రాజస్థాన్ లేదా హర్యానాలో భూపేందర్ యాదవ్ పోటీచేసే అవకాశాలున్నాయి. బిజెడి అధినేత నవీన్ పట్నాయక్ తర్వాత ఒడిశాలో బిజెపి కీలక రాజకీయ శక్తిగా మారేందుకు అపారమైన అవకాశాలున్నట్లు భావిస్తున్నాయి. కేరళలో సహితం బలం పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
ఎలక్ట్రానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీల మంత్రిగా ఆ రంగాలలో కీలక నేతగా ఎదిగిన రాజీవ్ చంద్రశేఖర్ బెంగుళూరు నివాసి అయినప్పటికీ ఆయన మూలాలు మలయాళీ కావడంతో ఆ రెండు రాష్ట్రాలలో ఎక్కడినుండైనా ఆయన లోక్‌సభకు పోటీ చేసే అవకాశం ఉంది. గుజరాత్‌లో, మోదీ, అమిత్ షా కేంద్రంలోకి వెళ్లిన తర్వాత బలమైన ద్వితీయశ్రేణి నాయకులను అభివృద్ధి చేయాలని బిజెపి ప్రయత్నిస్తున్నారు.
రాజస్థాన్‌లో వసుంధర రాజే నీడ నుండి పార్టీ ఎదిగేవిధంగా ప్రయత్నిస్తున్నారు. హర్యానాలో ప్రతిపక్షంలో అనేకమంది బలమైన నాయకులు ఉన్నారు. అయితే, ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఇప్పటికీ ఓ పార్టీ నేతగానే ఉన్నారు గాని ప్రజానాయకుడిగా ఎదగలేదు. అందుకనే నూతన నాయకులను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే రాజ్యసభ ఎంపీలను సురక్షిత స్థానాల నుంచి బరిలోకి దింపుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. గుజరాత్ లో రూపాలా పేరు అమ్రేలీ లేదా రాజ్‌కోట్‌లో ప్రచారంలో ఉంది. భావ్‌నగర్ లేదా పోర్‌బందర్ లేదా సూరత్ కోసం మాండవియా పేరు వినిపిస్తున్నది. రాజస్థాన్‌లోని అల్వార్ లేదా హర్యానాలోని భివానీ-మహేంద్రగఢ్ కోసం భూపేంద్ర యాదవ్ పోటీచేసే అవకాశం ఉంది.
ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా నుండి సరోజ్ పాండే, పౌరీ గర్వాల్ నుండి బాలుని, కేరళలోని అట్టింగల్‌కు చెందిన మురళీధరన్ పోటీచేయగలరని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వంలో కీలక శాఖలను నిర్వహిస్తున్న రాజ్యసభ సభ్యులుగా ఉన్న సీనియర్ మంత్రులను లోక్‌సభకు పోటీ చేయించక పోవచ్చని భావిస్తున్నారు. అందుకనే ఇప్పటికే అశ్వని వైష్ణవ్ తిరిగి రాజ్యసభకు పోటీ చేస్తున్నారు.
అదేవిధంగా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌లను కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయమని కోరకపోవచ్చు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం కనిపిస్తుంది. 28 మంది అభ్యర్థుల్లో ఐదుగురు మహిళలు ఉండగా, కుల సమతౌల్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకున్నారు.
రాజ్యసభలో మాదిరిగా బిజెపి తన లోక్‌సభ సభ్యులలో అనేకమంది కొత్తవారిని పోటీకి దింపే అవకాశాలు ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే, బీజేపీకి 370 సీట్లు సాధించాలనే మోదీ టార్గెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఇది జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. “మోదీజీ కొత్త ప్రభుత్వం కూడా కొత్త ముఖాలతో నిండి ఉంటుంది” అని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు జోస్యం చెప్పారు.
బిజెపి రాజ్యసభ టిక్కెట్లు ఇచ్చిన “బయటి వ్యక్తులలో” 2022 జనవరిలో బిజెపిలో చేరిన మాజీ కాంగ్రెస్ నాయకుడు ఆర్‌పిఎన్ సింగ్ ఉత్తర ప్రదేశ్ నుండి పోటీచేస్తున్నారు. రెండు రోజుల ముందే కాంగ్రెస్ నుండి వచ్చి బీజేపీలో చేరిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కూడా పోటీ చేస్తున్నారు. మహారాష్ట్రాలో కీలకమైన సామజిక వర్గాలలో ఒకటైన మరాఠాలను దూరం చేసుకోబోమని సంకేతం ఇవ్వడం కోసమే ఆయనను పోటీకి దింపుతున్నట్లు తెలుస్తున్నది.
More Stories
రూ. 1 లక్ష కోట్లతో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తొలి బడ్జెట్
నాపై సెటైర్లు వేయడానికి కమ్రా సుపారి తీసుకున్నట్లుంది
కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకునే అవకాశం!