మేడారం జాతరకు కేంద్రం రూ 3 కోట్లు

* ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించనున్న పోలీస్ 
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఆదివాసీ జాతర అయిన సమ్మక్క సారక్క జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటయించింది. మేడారం జాతర నిర్వహణకు గానూ కేంద్రం రూ.3 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు.  కాగా ఇప్పటికే, మేడారంలో వనదేవతలు సమ్మక్క సారక్క జాతర నిర్వహణకు గానూ తెలంగాణ ప్రభుత్వం రూ. 75 కోట్లు కేటాయించింది. జాతర నిర్వహణను చూసే వివిధ శాఖలకు ఈ ప్రత్యేక నిధులు కేటాయిస్తూ ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
 
ఈసారి మేడారం మహా జాతరకు కోటిన్నర మంది భక్తజనం వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో మేడారం మహా జాతరకు వచ్చే భక్తుల కోసం సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు.  హన్మకొండ నుంచి మేడారం హెలికాప్టర్‌లో వెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ప్రయాణించిన వారికి ప్రత్యేక దర్శన సదుపాయం కూడా ఉంటుంది. 
 
మొక్కులు చెల్లించిన తర్వాత తిరుగుపయనం కూడా ఉంటుంది. జాతర పరిసరాలను విహంగ వీక్షణంతో ఆస్వాదించవచ్చు. గతంలో సేవలందించిన ప్రైవేటు సంస్థతోనే ఈసారి కూడా అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా తెలిసింది. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సేవలు అందుబాటులో ఉండే అవకాశం ఉందని ధరల వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.

మరోవైపు మేడారం జాతర కోసం జాతర మొదలయ్యే 21 నుంచి 25 వరకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ప్రత్యేక రైలు సికింద్రాబాద్‌లో ప్రతి రోజు ఉదయం 9:52 గంటలకు బయలుదేరి కాజిపేటకు మధ్యాహ్నం 12:12 గంటలకు, వరంగల్‌కు ఒంటిగంటకు చేరుకుంటుంది. తిరిగి అదే మధ్యాహ్నం 1:55 గంటలకు వరంగల్‌లో బయలుదేరి సాయంత్రం 6:20 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

నిజామాబాద్‌ నుంచి మేడారం ప్రత్యేక రైలు ఈ నెల 21 నుంచి 24 వరకు సికింద్రాబాద్‌ మీదుగా కాజీపేట, వరంగల్‌ వరకు నడుస్తుంది. ఈ రైలు ప్రతీ రోజు ఉదయం 7:05 గంటలకు నిజామాబాద్‌లో బయలుదేరి సికింద్రాబాద్‌కు 11 గంటలకు, కాజీపేటకు మధ్యాహ్నం 1:15 గంటలకు, వరంగల్‌కు 1:45 గంటలకు చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వరంగల్‌లో బయలుదేరి సాయంత్రం 5:30 గంటకు సికింద్రాబాద్‌కు, రాత్రి 10:30 గంటలకు నిజామాబాద్‌కు చేరుకుంటుంది.

ఈసారి మేడారంలో మెరుగైన సేవలకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైతం పోలీసులు ఉపయోగించనున్నారు.  మేడారం మహా జాతరలో కృత్రిమ మేధ సహాయంతో మేడారం జాతర రద్దీ నియంత్రణ చేయాలని భావిస్తున్నారు. ఎంపిక చేసిన ప్రాంతాలలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ను కెమెరాలలో ఇన్స్టాల్ చేసి కంట్రోల్ రూమ్ నుండి మానిటర్ చేస్తారు. సిబ్బందిని అప్రమత్తం చేయడానికి, రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకోవడానికి కృత్రిమ మేధను ఉపయోగించనున్నారు.
 
అంతేకాదు ఎక్కడికక్కడ క్రౌడ్ కౌంటింగ్ కెమెరాలను ఏర్పాటు చేసి ఎంతమంది భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు లెక్కించనున్నారు. గద్దెల చుట్టూ క్రౌడ్ కౌంటింగ్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. డ్రోన్లతో నిరంతరం నిఘా నిర్వహించడంతోపాటు, మేడారం జాతర జరిగే ప్రదేశమంతా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టనున్నారు.

జాతర ఏర్పాట్లను మంత్రులు సీతక్క, కొండా సురేఖ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేసింది. వివిధ కారణాల వల్ల జాతరకు వెళ్లలేని భక్తుల కోసం కూడా ప్రభుత్వం ఆన్‌లైన్ ద్వారా సమ్మక్క సారక్కకు మొక్కులు చెల్లించుకునే వెసులుబాటు దేవాదాయ శాఖ కల్పించింది
 
ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు మేడారం జాతర జరగనున్న విషయం తెలిసిందే. మేడారం జాతరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం పూర్తి చేసింది.  జాతర ప్రారంభం కాకముందు నుంచే వనదేవతలకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు.