ఎంపీ ప‌ద‌వికి న‌టి మిమి చ‌క్ర‌వ‌ర్తి రాజీనామా

తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ నేత మిమి చ‌క్ర‌వ‌ర్తి ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. త‌న రాజీనామా ప‌త్రాన్ని టీఎంసీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీకి అంద‌జేశారు. కానీ ఆ రాజీనామాను దీదీ ఆమోదించ‌లేద‌ని తెలుస్తోంది. టీఎంసీకి రాజీనామా చేయడానికి ప్రధాన కారణం స్థానిక నేతలతో తలెత్తిన విభేదాలేనని ఆమె పేర్కొన్నారు. 
 
జాదవ్‌పూర్ నియోజకవర్గంలోని స్థానిక నాయకత్వం పట్ల ఆమెకు  గత కొన్ని రోజులుగా ఆమెకు పొసగడం లేదు. ఈ క్రమంలోనే జాదవ్‌పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం తన కల అని, కానీ అందుకు తనకు చాలా అడ్డంకులు ఎదురయ్యాయని మిమీ చక్రవర్తి తెలిపారు. సినీ రంగం నుంచి వచ్చిన వారు రాజకీయాల్లో పని చేయలేరని దూషించడం చాలా తేలిక అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు
 
అయితే ఆ స‌మ‌స్య‌ల‌ను తాను ప‌రిష్క‌రించ‌నున్న‌ట్లు బెంగాల్ సీఎం వెల్ల‌డించిన‌ట్లు తెలుస్తోంది.  దీదీ ఆమోదించిన తర్వాత తన రాజీనామాను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆమె పంపించనున్నట్లు తెలుస్తోంది. అయితే మరికొన్ని రోజుల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేయడం మిమీ చక్రవర్తికి ఇష్టం లేదని ఆమె సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. 
 
మిమీ చక్రవర్తి రాజీనామా విషయంపై దీదీ ఇంకా స్పందించలేదు. ఈ క్రమంలోనే లోక్‌సభలో రెండు స్టాండింగ్ కమిటీలకు కూడా మిమీ చక్రవర్తి రాజీనామా చేశారు. బెంగాల్ చిత్రపరిశ్రమలో ప్రముఖ నటి అయిన మిమీ చక్రవర్తికి ప్రజలలో ఉన్న ఆదరణను గుర్తించిన టీఎంసీ 2019లో ఎంపీ టికెట్ ఇవ్వగా ఆమె జాద‌వ్‌పూర్ నుంచి గెలుపొందారు.
 
ఆ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన అనుపమ్ హజ్రాను 2.95 లక్షల భారీ మెజార్టీతో ఓడించారు. ఇక మూడోస్థానంలో సీపీఎంకు చెందిన బికాష్ రంజన్ భట్టాచార్య ఉన్నారు. అయితే ఇప్పుడు మిమీ ఏ పార్టీలోకి వెళతారనేది చర్చనీయాంశంగా మారింది.