ఎన్డీయే వైపు ఫ‌రూక్ అబ్దుల్లా మొగ్గు!

విప‌క్ష ఇండియా కూట‌మి నుంచి ఒక్కొక్క పార్టీ, కీల‌క నేత‌లు దూర‌మవుతున్న క్ర‌మంలో మ‌రో ప‌రిణామం చోటుచేసుకుంది. నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ చీఫ్‌, జ‌మ్ము క‌శ్మీర్ మాజీ సీఎం ఫ‌రూక్ అబ్దుల్లా ఎన్డీయేలో చేరిక‌పై విస్ప‌ష్ట సంకేతాలు పంపారు. ఎన్డీయేలో మ‌ళ్లీ నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ చేరిక అవ‌కాశాల‌ను ఆయ‌న తోసిపుచ్చ‌లేదు. 

దీంతో విప‌క్ష ఇండియా కూటమికి మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. ఇప్పటికే నితీష్ కుమార్, జయంత్ చౌదరి వంటి నేతలతో పాటు అశోక్ చవాన్ వంటి కీలక కాంగ్రెస్ నేతలు ఎన్డీయే వైపు వెళ్లారు. రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ ఒంట‌రి పోరుకు సిద్ధ‌మ‌ని  ఫ‌రూక్ అబ్దుల్లా గురువారం స్ప‌ష్టం చేశారు. భ‌విష్య‌త్‌లో తమ పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మిలో చేరుతుంద‌నే సంకేతాలు పంపారు.

‘సీట్ల భాగస్వామ్యానికి సంబంధించినంతవరకు, నేషనల్ కాన్ఫరెన్స్ తన సొంత బలంతో ఎన్నికల్లో పోటీ చేస్తుందని నేను స్పష్టం చేస్తున్నా. దాని గురించి రెండు అభిప్రాయాలు లేవు. ఇకపై దీని గురించి ఎలాంటి ప్రశ్నలు లేవు’ అని వెల్లడించారు.

నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒంట‌రిగా పోటీ చేస్తుంద‌ని, ఏ రాజ‌కీయ పార్టీల‌తోనూ జ‌ట్టు క‌ట్ట‌ద‌ని ప్రకటించారు. ఎన్డీయే కూట‌మిలో చేరే అవ‌కాశాల‌ను ఫ‌రూక్ అబ్దుల్లా తోసిపుచ్చ‌లేదు. అట‌ల్ బిహారి వాజ్‌పేయి హ‌యాంలో నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ ఎన్డీయే భాగ‌స్వామ్య ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించింది. ఆయన ప్రభుత్వంలో ఫరూక్ అబ్దుల్లా మంత్రిగా పనిచేశారు.

విప‌క్ష ఇండియా కూట‌మి భాగ‌స్వామ్య పార్టీల‌తో సీట్ల స‌ర్దుబాటు చ‌ర్చ‌లు విఫ‌ల‌మ‌య్యాయ‌ని తెలిపారు. ఇండియా కూట‌మి, నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ మ‌ధ్య గ‌త నెల రోజులుగా విభేదాలు త‌లెత్తుతున్నాయి. సీట్ల స‌ర్దుబాటును స‌త్వ‌ర‌మే కొలిక్కి తీసుకురాకుంటే కొన్ని విప‌క్ష పార్టీలు వేరు కుంపటి పెట్టుకునే అవ‌కాశ‌లున్నాయ‌ని గ‌తంలోనే ఫ‌రూక్ అబ్ధుల్లా హెచ్చరించారు. 

ఇక ఇటీవ‌ల జ‌మ్ము ప్రాంతంలో ప‌లువురు నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ నేతలు బీజేపీలో చేరారు. తాజాగా, జమ్మూ కాశ్మీర్‌లోని మొత్తం 5 లోక్‌సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా నిర్ణయించారు. ఇండియా కూటమి ఏర్పాటు సమయం నుంచే ఫరూక్ అబ్దుల్లా కూటమిలో చాలా కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. 

అన్ని సమావేశాల్లో పాల్గొన్నారు. ఇంతలోనే ఆయన ఈ నిర్ణయం ప్రకటించడం కూటమిలో కలకం రేపుతోంది. ఇప్పటికే వెస్ట్ బెంగాల్, పంజాబ్, ఢిల్లీలో ఇండియా కూటమికి ఆప్, టీఎంసీ పార్టీలు షాక్ ఇచ్చాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో కూడా సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీల మధ్య చర్చలు ఫలించేటట్లు కనిపించడం లేదు.

ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ అసోంలోని 3 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌లో 80 సీట్లలో కాంగ్రెస్‌కు 11 సీట్లు మాత్రమే ఇవ్వాలని అఖిలేష్ యాదవ్ భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో కూడా మమతా బెనర్జీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ వరుస ప్రకటనలను చూస్తుంటే ఇండియా బ్లాక్ మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది.

మరోవంక, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అంతం కావ‌డం ఖాయ‌మ‌ని ఆ పార్టీ మాజీ అగ్రనేత, డెమోక్ర‌టిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ అధ్య‌క్షుడు గులాం న‌బీ ఆజాద్ జోస్యం చెప్పారు. ఇప్ప‌టికే చాలా మంది సీనియ‌ర్లు పార్టీని వీడడం ఆ పార్టీ దుర‌దృష్ట‌క‌రం అంటూ మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి అశోక్ చ‌వాన్ కాంగ్రెస్ పార్టీని వీడడం పార్టీకి పెద్ద‌దెబ్బ అని ఆజాద్ తెలిపారు. భ‌విష్య‌త్‌లో మ‌రికొంత మంది కాంగ్రెస్‌ను వీడుతున్న‌ట్లు త‌న‌కు స‌మాచారం ఉంద‌ని తెలిపారు.  మొత్తానికి రాబోయే రోజుల్లో ఈ పార్టీ అంతం కాబోతుంద‌ని, అది దురదృష్ట‌క‌ర‌మ‌ని గులాం న‌బీ ఆజాద్ పేర్కొన్నారు.