ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన అనుబంధ సంఘాల అకౌంట్లను ఆదాయ పన్ను శాఖ సీజ్ చేసింది. పార్టీ అనుబంధ సంఘాలకు చెందిన మొత్తం 9 అకౌంట్లను ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం సీజ్ చేసింది.
ఆదాయ పన్ను శాఖ పంపిన నోటీసులకు సదరు అనుబంధ సంఘాలు సరైన స్పందన ఇవ్వకపోగా జరిమానా కూడా చెల్లించలేదని.. దీంతో అకౌంట్లు సీజ్ చేసినట్లు ఆదాయపన్ను శాఖ వెల్లడించింది. 2018-19 లో ఆదాయ పన్ను శాఖ విధించిన జరిమానా, నోటీసులకు ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు స్పందించ లేదని ఆదాయపన్ను శాఖ తెలిపింది.
అకౌంట్లు సీజ్ చేస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ విభాగాలకు సమాచారం పంపింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను స్పందింపజేయడమేంటని కోశాధికారి అజయ్ మాకెన్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల్లోని క్రౌడ్ ఫండింగ్ డబ్బును సైతం సీజ్ చేశారని తెలిపారు.
“దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఖాతాలను ఆదాయపన్ను అధికారులు సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు కేవలం రెండు వారాల ముందు నాసిరకం కారణాలతో స్తంభింపజేశారు” అంటూ మాకెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల బాండ్లను సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ బాండ్లు రాజ్యాంగ విరుద్దమని కోర్టు తెలిపింది. సుప్రీం తీర్పుతో రాజకీయ పార్టీలకు ఫండింగ్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అకౌంట్లను సీజ్ చేసినట్లు తెలుస్తోంది.
తాము ఇచ్చే చెక్కులను బ్యాంక్‌లు తీసుకోవడంలేదని తమకు సమాచారం అందినట్లు మాకెన్ తెలిపారు. యూత్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ నుంచి రూ. 210 కోట్లు రికవరీ చేసేందుకు ఆదాయపన్ను శాఖ అడుగుతున్నట్లు చెప్పారు. ఎన్నికలకు రెండు వారాల ముందే విపక్షాల అకౌంట్లను సీజ్ చేశారని, ఇది ప్రజాస్వామ్యాన్ని సీజ్ చేసినట్లే అని ఆయన ఆరోపించారు.
ప్రస్తుతం తమ వద్ద డబ్బు లేదని, విద్యుత్తు బిల్లు, ఉద్యోగుల జీతాలు ఇచ్చేందుకు కూడా నిధులు లేవని చెప్పారు. దీని ప్రభావం అన్నింటిపైనా పడుతుందని పేర్కొంటూ రాహుల్ గాంధీ న్యాయ యాత్రతో పాటు రాజకీయ కార్యక్రమాలపై ప్రభావం పడుతుందని తెలిపారు.
అయితే, ఆదాయపన్ను శాఖ కాంగ్రెస్ పార్టీకి పాక్షికంగా ఉపశమనం కలిగించింది. పార్టీ ఇప్పటికే విజ్ఞప్తి చేయడంతో ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ లో ఈ అంశంపై శుక్రవారం విచారణ జరిగింది. విచారణ సందర్భంగా పార్టీ తరఫున కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది వివేక్ తంఖా హాజరయ్యారు. ట్రిబ్యునల్ నిర్దేశించిన విధంగా తాత్కాలికంగా కాంగ్రెస్ తన ఖాతాలను నిర్వహించగలదని టంఖా చెప్పారు. ఫిబ్రవరి 21న మధ్యంతర ఉపశమనం కోసం చేసిన విజ్ఞప్తిని పరిశీలించడం జరుగుతుందని చెప్పారు.
More Stories
అన్న క్యాంటీన్లు ప్రయోజనమే… నిర్వహణకు ఓ కార్పొరేషన్ ఉండాలి!
జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసం?
ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రమాణంలో ప్రత్యేక ఆకర్షణగా ఉష