పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీల గడువు పొడిగింపు

వన్ 97 కమ్యూనికేషన్స్ లేదా పేటీఎంలో భాగమైన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లో లావాదేవీలను నిలిపివేసే గడువును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 15 రోజులు పొడిగించింది. ఖాతాదారులు తమ ఖాతాలు, వాలెట్లు, ఫాస్టాగ్ లు, ప్రీపెయిడ్ కార్డులలో డబ్బు జమ చేయడానికి మార్చి 15 వరకు సమయం ఉంది.

పేటీఎం  పేమెంట్స్ బ్యాంక్ వినియోగదారులు, వ్యాపారుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి మరింత సమయం అవసరమని, ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. పేటీఎం లోని కస్టమర్ ఖాతాలు, వాలెట్లు, ఫాస్టాగ్ లు, ఇతర సాధనాలలో డిపాజిట్లు లేదా టాప్-అప్ లను ఫిబ్రవరి 29 తర్వాత స్వీకరించడాన్ని నిలిపివేయాలని ఆర్బీఐ జనవరి 31 న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ను ఆదేశించిన విషయం తెలిసిందే.

వడ్డీ, క్యాష్ బ్యాక్ లు, భాగస్వామ్య బ్యాంకుల నుంచి స్వీప్ ఇన్ లేదా రీఫండ్ లు మినహా మార్చి 15 తర్వాత కస్టమర్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, వాలెట్లు, ఫాస్టాగ్ లు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డులు మొదలైనవాటిలో ఎలాంటి డిపాజిట్లు లేదా క్రెడిట్ లావాదేవీలు లేదా టాప్ అప్ లు అనుమతించబడవని ఆర్బిఐ శుక్రవారం తెలిపింది. 

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నిర్వహించే వన్97 కమ్యూనికేషన్స్, పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ నోడల్ ఖాతాలను మూసివేసే గడువును మాత్రం ఆర్బీఐ పొడిగించలేదు. వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ 2023 మార్చి 31 నాటికి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లో 49% వాటాను కలిగి ఉంది. పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ దీని అనుబంధ సంస్థ.