రాజ్యసభకు గుజరాత్ నుంచి నడ్డా, మహారాష్ట్ర నుంచి అశోక్ చవాన్‌

రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే కీలక అభ్యర్థుల పేర్లను బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గుజరాత్ నుంచి రాజ్యసభకు పోటీ చేయనుండగా, ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన అశోక్ చవాన్‌ను మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ఎంపిక చేసింది.  జేపీ నడ్డాతో పాటు గుజరాత్ నుంచి రాజ్యసభకు గోవింద్ భాయ్ ధోలకియా, మయాంక్ భాయ్ నాయక్, జస్వంత్ సిన్హ్ సలామ్‌సిన్హ్ పార్మర్‌ పేర్లను అధిష్ఠానం ఖరారు చేసింది.
మహారాష్ట్రలో అశోక్ చవాన్‌తో పాటు మేథా కులకర్ణి, అజిత్ గోప్చడేలను బీజేపీ నామినేట్ చేసింది.  బీజేపీ తరఫున ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో దిగిన ఏడుగురు అభ్యర్థులు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో బుధవారంనాడు నామినేషన్ వేశారు. వీరిలో మాజీ కేంద్ర మంత్రి ఆర్‌పీఎన్ సింగ్, మాజీ ఎంపీ చౌదరి తేజ్‌వీర్ సింగ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆమ్రపాల్ మౌర్య, రాష్ట్ర మాజీ మంత్రి సంగీత బల్వంత్, పార్టీ ప్రతినిధి సుదాన్షు త్రివేది, మాజీ ఎమ్మెల్యే సాధనా సింగ్, ఆగ్రా మాజీ మేయర్ నవీన్ జైన్ ఉన్నారు. 
 
నామినేషన్ సందర్భంగా సీఎంతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరి, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రిజేష్ పాఠక్, బీజేపీ యూపీ లోక్‌సభ ఇన్‌చార్జి బైజయంత్ పాండే హాజరయ్యారు. ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు జరుగనుండగా, ఫిబ్రవరి 15వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనుంది.
 
కాగా, ఒడిశా నుండి తిరిగి పోటీచేస్తున్న కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు రాజ్యసభ ఎన్నికల్లో మద్దతిచ్చేందుకు స్ధానిక అధికార పార్టీ బిజూ జనతాదళ్ (బీజేడీ)  ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని వైష్ణవ్ కు మద్దతివ్వాలని నిర్ణయించినట్లు బీజేడీ ప్రకటించింది. దీంతో బీజేపీ-బీజేడీ ఉమ్మడి అభ్యర్ధిగా అశ్వినీ వైష్ణవ్ సునాయాసంగా రాజ్యసభకు ఎంపిక కానున్నారు.
రాజ్యసభకు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్
ఇలా ఉండగా, తెలంగాణ నుంచి మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, యువ నేత అనిల్ కుమార్ యాదవ్ లను రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. అనిల్ ప్రస్తుతం సికింద్రాబాద్ డిసిసి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. కర్ణాటక నుంచి అజయ్ మాకెన్, చంద్రశేఖర్, హుస్సేన్ లను, మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్ ను పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ మేరకు అభ్యర్థులు గురువారం తమ నామినేషన్లు దాఖలు చేస్తారు.