మరోసారి రైతులతో నేడే మంత్రుల చర్చలు… 16న గ్రామీణ బంద్

రైతు నాయకులు, కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్‌ల మధ్య గురువారం మరోసారి చర్చలు జరుగుతున్నట్లు  అధికార వర్గాలు తెలిపాయి. పంజాబ్ ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర మంత్రులతో రైతు నాయకుల సమావేశానికి సదుపాయం కల్పిస్తున్నట్లు చెబుతున్నారు. రైతులు ప్రభుత్వం నుండి వ్రాతపూర్వక హామీని కోరుకుంటున్నారని, దానిపై చర్చలు జరుగుతున్నాయని ఆ వర్గాలు తెలిపాయి.
 
అంతకుముందు, కేంద్ర మంత్రులు చండీగఢ్‌లో రైతు నాయకులతో రెండు దఫాలుగా సమావేశమయ్యారు. అయితే చర్చలు అసంపూర్తిగా ముగిసాయి. పలు అంశాలపై ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. దానితో మంగళవారం నుండి రైతులు తమ నిరసనలను ప్రారంభించారు. మరోవంక, ఈ నెల 16న గ్రామీణ భారత్‌ బంద్‌ రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.
ఈ బంద్‌కు పలు కేంద్ర కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. 16న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్‌ కొనసాగుతుందని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జాతీయ రహదారులను స్తంభింపజేస్తామని తెలిపారు.
 
బీకేయూ ప్రధాన కార్యదర్శి హరీందర్‌ సింగ్‌ లోఖోవాల్‌ గ్రామీణ భారత్‌ బంద్‌కు సంబంధించిన వ్యూహాన్ని వెల్లడించారు. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి హామీ ఇచ్చే చట్టంతో సహా తమ డిమాండ్లను ఆమోదించాలని కేంద్రాన్ని ఒత్తిడి చేసేందుకు సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా నిరసనకు పిలుపునిచ్చాయి.
ఆ రోజున వ్యవసాయ పనులు, ఉపాధి హామీ పనులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ కార్మికులెవరూ పని చేయరని తెలిపారు. అంబులెన్స్‌లు, వివాహాలు, చావులు, మెడికల్ షాపులు, వార్తాపత్రికల సరఫరా, బోర్డు పరీక్షలకు వెళ్లే విద్యార్థులు, విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల అత్యవసర సేవలకు మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపారు. కూరగాయలు, ఇతర పంటల క్రయవిక్రయాలు, కొనుగోళ్లు నిలిచిపోతాయని పేర్కొన్నారు.
 
ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భారీగా బలగాలను మోహరించారు. పెద్ద ఎత్తున బారికేడ్లు, ఇనుప కంచెలను ఏర్పాటుచేశారు. సింఘు, టిక్రి సరిహద్దులను మూసివేశారు. ఈ క్రమంలో ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. గురువారం నుంచి బోర్డు పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో సీబీఎస్‌ఈ విద్యార్థులకు అడ్వైజరీ జారీచేసింది. ట్రాఫిక్‌ ఇబ్బందుల నేపథ్యంలో విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, మెట్రో సర్వీసులను వినియోగించుకోవాలని సూచించింది.
 
కాగా, కేంద్రంతో ఘర్షణకు దిగేందుకు తాము రాలేదని రైతు సంఘం నాయకుడు సర్వణ్ సింగ్ పంథేర్ స్పష్టం చేశారు. ఢిల్లీ చలో కార్యక్రమం పేరిట రైతులపై తప్పుడు అభిప్రయాలు కలుగజేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద మనసు చేసుకోని మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆహ్వానంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
 
ఇలా ఉండగా, రైతులు అన్నదాతలని, వారిని నేరస్తులుగా పరిగణించలేమని భారతరత్న అవార్డు గ్రహీత ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె మధుర స్వామినాథన్ స్పష్టం చేశారు.  ‘పంజాబ్ రైతులు ఢిల్లీకి పాదయాత్ర చేస్తున్నారు. వార్తాపత్రికల కథనాల ప్రకారం, హర్యానాలో వారి కోసం జైళ్లు సిద్ధం చేశారు. రైతులను నిరోధించేందుకు బారికేడ్లతోపాటు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. వారు రైతులు, నేరస్తులు కాదు’ అని ఆమె తెలిపారు.