అబుదాబిలో హిందూ దేవాలయాన్ని ప్రారంభించిన మోదీ

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) రాజధాని నగరం అబుదాబికి సమీపంలో హిందూ దేవాలయాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఈ ఆలయం మత సామరస్యానికి చిహ్నంగా వర్ధిల్లుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.  బోచాసన్‌వాసీ శ్రీ అక్షర్‌ పురుషోత్తమ్‌ స్వామినారాయణ్‌ సంస్థ (బీఏపీఎస్‌) ఈ దేవాలయాన్ని నిర్మించింది.
ఇది అబుదాబిలో తొలి రాతి హిందూ దేవాలయం కావడం విశేషం.  భారత్‌, అరబ్‌ దేశాలు సంయుక్తంగా ఈ ఆలయాన్ని నిర్మించాయి.  హిందూ మతంలోని వైష్ణవుడైన స్వామి నారాయణ సంప్రదాయానికి చెందిన బోచసన్యాసి అక్షర్‌ పురుషోత్తం స్వామి నారాయణ సంస్థ (బీఏపీఎస్‌) ఈ ఆలయాన్ని నిర్మించింది. దాదాపు రూ..700 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆలయం మధ్యప్రాచ్యం, యూఏఈలోని హిందూ జనాభాకు అతి ముఖ్యమైనది.
27 ఎకరాల విస్తీర్ణంలో 108 అడుగుల ఎత్తైన ఈ ఆలయం మధ్యప్రాచ్యంలో అతిపెద్ద హిందూ దేవాలయం కానుంది. 2015లో యూఏఈ రాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, అబు మ్రీఖా దేవాలయం కోసం 13.5 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. 2019లో మరో 13.5 ఎకరాల భూమిని విరాళం ఇవ్వగా.. ఆలయ నిర్మాణం ఘనంగా ప్రారంభమైంది. 2018లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయానికి పునాదిరాయి వేశారు.
 
మత సామరస్యానికి ప్రతీకగా ఈ ఆలయానికి వాస్తు శిల్పిగా క్యాథలిక్‌ క్రిస్టియన్‌, ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా సిక్కు మతస్థుడు ఉన్నారు. ఫౌండేషన్‌ డిజైనర్‌ బుద్దిస్ట్‌ కాగా, నిర్మాణ సంస్థ పార్సీలకు చెందినది. డైరెక్టర్‌ జైన మతానికి చెందిన వ్యక్తి అని బీఏపీఎస్‌ ప్రతినిధి వెల్లడించారు. ఈ ఆలయంలో ఏడు శిఖరాలున్నాయి. నాగరా సంప్రదాయ శైలిలో దీన్ని నిర్మించారు. 
 
ఆలయ ముందు భాగంలో విశ్వవ్యాప్త విలువలు, విభిన్న సంస్కృతుల సామరస్య కథలు, హిందూ ఆధ్యాత్మిక వేత్తలు, వారి అవతారాల వర్ణనలు ఉన్నాయి. ఈ ఆలయం ఎత్తు 108 అడుగులు, పొడవు 262 అడుగులు, వెడల్పు 180 అడుగులు. బయటి ముఖభాగంలో రాజస్థాన్‌ నుంచి తెచ్చిన గులాబీ ఇసుక రాయిని ఉపయోగించగా.. లోపలి భాగంలో ఇటాలియన్‌ పాలరాతిని ఉపయోగించారు. 
 
ఈ ఆలయంలో రెండు కేంద్ర గోపురాలున్నాయి. డోమ్‌ ఆఫ్‌ హార్మోని, డోమ్‌ ఆఫ్‌ పీస్‌గా వీటిని పేర్కొంటున్నారు. భూమి, నీరు, అగ్ని, గాలి, మొక్కలను చెక్కటం ద్వారా మానవ సహజీవనాన్ని తెలియచేశారు. ఏ వాల్‌ ఆఫ్‌ హార్మోని.. అరబ్‌ ఎమిరేట్స్‌లోని అతిపెద్ద 3డీ ప్రింటెడ్‌ గోడలలో ఒకటి. ఆలయ నిర్మాణానికి సంబంధించిన కీలక మైలురాళ్లను వీడియో రూపంలో ఈ గోడపై ప్రదర్శిస్తారు. 
 
సామరస్యం అనే పదం 30 విభిన్న ప్రాచీన, ఆధునిక భాషల్లో రాశారు. ఆలయంలో నిర్మించిన ఏడు శిఖరాలు యూఏఈలోని ఏడు ఎమిరేట్స్‌కు ప్రతిరూపాలుగా చెప్తారు. మిడిల్‌ ఈస్ట్‌ అవార్డ్స్‌లో ఈ ఆలయం 2019 సంవత్సరానికి ఉత్తమ మెకానికల్‌ ప్రాజెక్ట్‌గా, 2020 సంవత్సరానికి ఉత్తమ ఇంటీరియర్‌ డిజైన్‌ కాన్సెప్ట్‌గా ఎంపికైంది. ఈ ఆలయం ఫిబ్రవరి 18 నుంచి ప్రజల సందర్శనార్థం తెరుస్తారు.