17వ లోక్‌సభలో చివరి రోజైన శనివారం అయోధ్య రామమందిరంపై తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ మాట్లాడుతూ రాంలల్లా ఆలయాన్ని నిర్మించడం చారిత్రక విజయంగా అభివర్ణించారు. భావి తరాలకు ఆశ, ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు.
చారిత్రాత్మకమైన రామమందిర నిర్మాణం, ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంపై దాదాపు నాలుగు గంటల పాటు సభలో చర్చించారు. చివరగా తీర్మానాన్ని చదువుతూ స్పీకర్ ఓం బిర్లా శతాబ్దాల నిరీక్షణ తర్వాత, అయోధ్యలో రామ మందిరం నిర్మించినట్లు పేర్కొన్నారు. ఆలయం ఏక్ భారత్.. శ్రేష్ఠ్ భారత్ స్ఫూర్తికి ప్రతీక అని చెప్పారు.
రామజన్మభూమి వివాదంలో కోర్టు తీర్పును ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు తీర్పు సైతం ప్రస్తావించారు. తీర్మానం ద్వారా అయోధ్యలో జరిగిన చారిత్రక కృషిని సభ్యులు అభినందిస్తున్నారని తెలిపారు. సభ తీర్మానంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ అయోధ్యలో నిర్మిస్తున్న ఆలయం రాళ్లతో కట్టినది కాదని, విశ్వాసాలతో కూడుకున్నదని స్పష్టం చేశారు.
జనవరి 22న శంకుస్థాపనకు ముందు ప్రధాని మోదీ చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ ఆయన అనేక మతపరమైన ప్రదేశాలను సందర్శించి జాతీయ ఐక్యత సందేశాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. ఇందులో న్యాయవ్యవస్థ, సమాజం కీలక పాత్ర పోషించాయని చెప్పారు.
చర్చలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటూ విష్ణు సంప్రదాయం ప్రకారమే ప్రధాని మోదీ అయోధ్య రామ ప్రతిష్టలో పాల్గొన్నట్లు వెల్లడించారు. ప్రాణప్రతిష్ట వేడుక కోసం ప్రధాని మోదీ 11 రోజుల ఉపవాసం పాటించినట్లు చెప్పారు. ఆ సమయంలో ఆయన కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకున్నట్లు వెల్లడించారు.
విభిన్న భాషల్లో ఆయన రామభజన చేశారని, ఆ సమయంలో దేశవ్యాప్తంగా భక్తి ఉద్యమాన్ని నడిపించారని, కానీ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని రాజకీయం చేయలేదని అమిత్ షా స్పష్టం చేశారు. రామ జన్మభూమి ఉద్యమ సమయంలో జైశ్రీరామ్ అని నినాదాలు చేశామని, ఇప్పుడు ఆలయాన్ని పూర్తిగా నిర్మించామని, అందుకే ఇప్పుడు జై సియా రామ్ అనాలని సూచించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోనే ఈ భక్తి యాత్ర సాగిందన్నారు.
ఆగస్టు 5వ తేదీన అయోధ్యపై తీర్పు వచ్చిన తర్వాత దేశంలో అల్లర్లు జరుగుతాయని చాలా మంది టెన్షన్‌కు గురయ్యారని, ఆలయం నిర్మాణ సమయంలోనూ ఇలాగే ఆలోచించారని, కానీ మోదీ సర్కార్ చాలా శాంతియుతంగా ఆ కార్యక్రమాలను నిర్వహించినట్లు చెప్పారు.
సుప్రీంకోర్టు ఆగస్టు 5వ తేదీన ఇచ్చిన తీర్పును మనం గౌరవించాలని చెబుతూ అయోధ్యలో మందిర నిర్మాణం కోసం హిందూ సమాజం చాన్నాళ్లు పోరాడిందని గుర్తు చేశారు. కేవలం రామమందిరాన్నే కాదు.. రామ సేతను కూడా ప్రధాని మోదీ నిర్మించారని తెలిపారు. సుమారు 330 ఏళ్ల న్యాయపోరాటం తర్వాత రామ్‌లల్లా చివరకు తన నివాస స్థానానికి చేరినట్లు షా పేర్కొన్నారు.
ప్రతి మతం, ప్రతి భాషలో రామాయణం ఉందని చెబుతూ షేక్ సదుల్లా మాష్‌కు చెందిన రామయన్ యే మాషి కూడా ఉందని తెలిపారు. రాముడు లేదా రామచరిత్ర లేకుండా ఈ దేశాన్ని ఊహించలేమని చెబుతూ జనవరి 22వ తేదీ భవిష్యత్తు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని స్పష్టం చేశారు.
అయోధ్య రామమందిరం నిర్మాణంతో మనం కొత్త ఆధ్యాత్మిక యుగంలోకి ప్రవేశించామని బీఆర్ఎస్ ఎంపీ బీమ్‌రావ్ బసంత్‌రావు పాటిల్ తెలిపారు. దేశం ఆధ్యాత్మిక పథంలో నడుస్తోందని, అయోధ్య రామమందిరం ప్రముఖ ధార్మిక, ఆధ్యాత్మిక కేంద్రంగా ఎదగనున్నట్లు ఆయన చెప్పారు. భారత ఇతిహాసంలో 22 జనవరివ తేదీ మరో అధ్యాయాన్ని జోడించిందని కొనియాడారు.
More Stories
బంగ్లా హిందువుల రక్షణకై భారత్ నిర్దిష్ట చర్యలు అవసరం
బంగ్లాదేశ్ లో మైనారిటీలపై హింస, అణచివేతలపై నిరసన
ఈ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు