17వ లోక్‌సభలో 97శాతం పని జరిగింది

అందరి ఉమ్మడి కృషితో 17వ లోక్‌సభలో 97శాతం పని జరిగిందని, ఇది స్వతహాగా సంతోషించదగ్గ విషయమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఏడు సెషన్లు 100 శాతం కంటే ఎక్కువ ఉత్పాదకతను కలిగి ఉన్నాయని, రాత్రంతా మేల్కొని కూర్చుని ప్రతి ఎంపీ అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేశారని కొనియాడారు. రామమందిరం నిర్మాణం స్వాగతిస్తూ లోక్ సభ ఆమోదించిన  తీర్మానం పట్ల హర్షం ప్రకటిస్తూ భవిష్యత్ తరాలకు ఇది రాజ్యాంగపరమైన సాధికారికత కల్పిస్తుందని ప్రధాని చెప్పారు.
పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల చివరిరోజున ప్రధాని లోక్‌సభలో మాట్లాడుతూ ఇంతటి విజయం సాధించిన ఎంపీలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తొలి సెషన్‌లో ఉభయ సభల్లో 30బిల్లులు ఆమోదం పొందాయని చెబుతూ ఇది రికార్డు అని పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సంబురాలు చేసుకునే అవకాశం రావడం మనందరి అదృష్టమని చెప్పారు.

మానవజాతి ఈ శతాబ్దంలోనే అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొన్నదని ప్రధాని తెలిపారు. గత ఐదేళ్లు దేశంలో సంస్కరణలు, పనితీరు, పరివర్తనతో సాగాయని చెబుతూ  సంస్కరణలు తీసుకురావడం, పనులు చేయడం, కళ్ల ముందు మార్పు రావడం చాలా అరుదు అని సంతోషం వ్యక్తం చేశారు. 17వ లోక్‌సభకు అవసరమైన ఆశీర్వాదాలను దేశం కొనసాగిస్తుందని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు. 

గతంలో లోక్‌సభ స్పీకర్‌గా వ్యవహరించిన సుమిత్రా మహాజన్‌ పలు సందర్భాల్లో సరదాగా మాట్లాడే వారని, ప్రస్తుత స్పీకర్‌ ఓం బిర్లా ముఖం ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తుందన్నారని ప్రధాని ప్రశంసించారు. అనేక సందర్భాల్లో స్పీకర్ సభను స్ఫూర్తివంతంగా నడిపించారని చెబుతూ ఓపికగా, విజ్ఞతతో సభను నడిపించారని, అందుకు రుణపడి ఉంటానని చెప్పారు.

ఐదేళ్లలో మానవ జాతి ఈ శతాబ్దంలోనే అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొందన్న ఆయన ఎవరు బతుకుతారు? ఎవరు బతకగలరు? ఎవరైనా ఎవరినైనా కాపాడగలరో? లేదో? అనే పరిస్థితి ఎదురైందంటూ కరోనా పరిస్థితులను గుర్తు చేశారు. అలాంటి పరిస్థితుల్లో సభకు రావడం కూడా రిస్క్‌తో పని అన్న ప్రధాని ఆ సమయంలోనూ సభా కార్యక్రమాలను నిర్వహించారంటూ ప్రశంసించారు. 

కరోనా సమయంలో ఎంపీ ఫండ్స్‌ను విడిచిపెట్టే ప్రతిపాదన వచ్చిన సమయంలో ఏకగ్రీవంగా మద్దతు తెలిపారంటూ ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రజలకు  సానుకూల సందేశం ఇవ్వాలని, సమాజానికి విశ్వాసం కల్పించేందుకు ఎంపీలు తమ జీతాలను 30 శాతం తగ్గించాలని నిర్ణయించారని ప్రశంసించారు. 

కొత్త పార్లమెంట్ భవనం కావాలని అందరూ చర్చించుకున్నారని, కానీ మీ నాయకత్వమే ఈ పనిని ముందుకు తీసుకెళ్లిందన్న ఆయన  దాని ఫలితమే నేడు దేశానికి కొత్త పార్లమెంట్ భవనం వచ్చిందని చెప్పారు. పార్లమెంటు కొత్త భవనంలో సెంగోల్‌ను వారసత్వ సంపదగా నిలిపేందుకు, స్వాతంత్య్ర తొలి క్షణాన్ని సజీవంగా ఉంచేందుకు కృషి చేశారని కొనియాడారు. 

ఇది భారతదేశం రాబోయే తరాలను స్వాతంత్ర్యం తొలినాటి క్షణాలతో ఎల్లప్పుడూ అనుబంధంగా ఉంచుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు.