ఎన్‌డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారు

దేశ వ్యాప్తంగా ఎన్‌డీఏను విస్తరించాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని చెబుతూ  ఎన్‌డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని బిజెపి అగ్రనేత, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వెల్లడించారు.  తమ మిత్రులను తాము ఎప్పుడూ బయటకు పంపలేదంటూ రాజకీయ సమీకరణాల దృష్ట్యా వాళ్లు బయటకు వెళ్లారని ఆయన గుర్తు చేశారు.

ఎకనామిక్స్ టైమ్స్ సదస్సులో ఆయ‌న మాట్లాడుతూ  ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి మూడోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బిజెపి 370 సీట్లు గెలుచుకుంటుందని చెబుతూ ఎన్డీయే 400కిపైగా పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించాలనే టార్గెట్ పెట్టుకున్నామని వెల్లడించారు.

దేశం సంక్షేమం తిరిగి ఎన్‌డీఏలో చేరాలని పాత మిత్రులు భావిస్తే వారికి తలుపులు తెరిచే ఉంటాయని అమిత్ షా చెప్పారు. ఎన్‌డీఏను బలోపేతం చేసుకుంటామని పేర్కొంటూ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది కుటుంబంలో కీలకమని చెప్పారు. కానీ ఫ్యామిలీ ప్లానింగ్ రాజకీయాల్లో మంచిది కాదని ఆయన తెలిపారు. 

రాజకీయాల్లో ఎంత పెద్ద కుటుంబం ఉంటే అంత మంచిదని అంటూ పంజాబ్ లో పాత మిత్రులు అకాళీదళ్ తో కూడ పొత్తు పెట్టుకోబోతున్నామని తెలిపారు. బీహార్ లో నితీష్ కుమార్ తిరిగి ఎన్‌డీఏలోకి వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్‌డీఏ విస్తరణ గురించి ఈ సమావేశంలో అడిగిన ప్రశ్నకు అమిత్ షా నవ్వుతూ టీవీ డిబేట్ వేదికగానే రాజకీయ పార్టీల కూటమిని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు. ఈ విషయమై తమకు కొంత సమయం ఇవ్వాలని, పొత్తులపై త్వరలోనే స్పష్టత వస్తుందని ఆయన చెప్పారు.

2019 డిసెంబర్‌లో పార్లమెంట్‌లో ఆమోదించబడిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) లోక్‌సభ ఎన్నికలకు ముందే అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అమిత్ షా తెలిపారు. సీఏఏ ఎవరి పౌరసత్వాన్ని హరించదని చెప్పిన ఆయన ఈ వ్యవహారంలో ముస్లిం సోదరుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. 

ఈ చట్టంపై ముస్లిం సమాజానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని చెబుతూ ఇది అమల్లోకి వస్తే పౌరసత్వం హరిస్తుందని వాళ్లను రెచ్చగొడుతున్నారని, అయితే అందులో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు.

పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌ వంటి దేశాల్లో హింసను ఎదుర్కొని మన భారతదేశానికి వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వడం కోసే సీఏఏ ఉద్దేశించబడిందని చెప్పారు. అంతే తప్ప ఇది ఎవరి భారత పౌరసత్వాన్ని తీసివేయడానికి కాదని, ముస్లిం సోదరులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా కల్పించారు. 

కాంగ్రెస్ నాయకులు దేశాన్ని విభజించినప్పుడు మన పొరుగు దేశాల్లో కొందరు క్రైస్తవ మైనారిటీలు మిగిలిపోయారని, వాళ్లు ఆ దేశాల్లో దౌర్జన్యాలను ఎదుర్కొన్నప్పుడు భారత్‌లోకి వాళ్లను ఆహ్వానిస్తామని, పౌరసత్వం కూడా ఇస్తామని కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు వాళ్లు వెనకడుగు వేస్తున్నారని, దీనిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అమిత్ షా విమర్శించారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతున్న భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర గురించి స్పందిస్తూ 1947లో దేశ విభజనకు కారణమైన ఆ పార్టీ నేతకు ఈ తరహా యాత్రతో ముందుకు వెళ్లే అర్హత లేదని విమర్శించారు. 

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం గురించి మాట్లాడుతూ ‘2014లో భారత ఆర్థిక వ్యవస్థ ఒడుదొడుకుల్లో ఉంది. అంతటా కుంభకోణాలే. విదేశీ పెట్టుబడులు రావడం లేదు. అప్పుడే శ్వేతపత్రం తెచ్చి ఉంటే ప్రపంచానికి తప్పుడు సందేశం వెళ్లేది. ఈ పదేళ్లలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాం. అవినీతి లేదు. విదేశీ పెట్టుబడులు భారీగా వచ్చాయి. అందుకే ఈ పత్రాన్ని తీసుకురావడానికి ఇదే సరైన తరుణం’ అని తెలిపారు. 

రాముడు జన్మించిన ప్రాంతంలో రామమందిరాన్ని నిర్మిస్తారని దేశ ప్రజలు 500 ఏళ్లపాటు నమ్మారని, బుజ్జగింపు రాజకీయాల కారణంగా ఆ కల ఆలస్యమైందని ఆరోపించారు.