సుల్తాన్‌పూర్ కోర్టులో హాజ‌రైన రాహుల్ గాంధీ

సుల్తాన్‌పూర్ కోర్టులో హాజ‌రైన రాహుల్ గాంధీ
లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర ప్రదేశ్  లోని సుల్తాన్‌పూర్ కోర్టులో శుక్రవారం హాజ‌ర‌య్యారు. కేంద్ర మంత్రి అమిత్ షాపై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేసిన కేసులో ఆయ‌న కోర్టుకు వ‌చ్చారు. స్పెష‌ల్ మెజిస్ట్రేట్ శుభ‌మ్ వ‌ర్మ‌ రాహుల్ గాంధీకి స‌మ‌న్లు జారీ చేశారు. ఆ కేసులో వాంగ్మూలం రికార్డు చేయాల‌ని ఆదేశించారు. 
 
ఈ కేసులో ఇప్ప‌టికే 12 సార్లు విచార‌ణ‌కు రాహుల్ గాంధీ డుమ్మా కొట్టారు. దీంతో మెజిస్ట్రేట్ రాహుల్‌కు హెచ్చరిక జారీచేశారు.  అమిత్ షాపై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేసిన ఘ‌ట‌న‌లో రాహుల్ గాంధీపై ప‌రువున‌ష్టం కేసు న‌మోదు చేశారు. 2018లో బెంగుళూరులో జ‌రిగిన ప్రెస్‌కాన్ఫ‌రెన్స్‌లో రాహుల్ ఆ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు 2018 ఆగస్టు 4న స్థానిక బీజేపీ నేత విజ‌య్ మిశ్రా ఆరోపించారు.
 
 ఓ హత్య కేసులో అమిత్ షా నిందితుడు అని రాహుల్ వ్యాఖ్యానించిన‌ట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ త‌న వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను ఖండించిన‌ట్లు అడ్వ‌కేట్ సంతోష్ కుమార్ పాండే తెలిపారు. రాజ‌కీయ కారణాల‌తో త‌నను ఇరికించిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. త‌న ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగే రీతిలో వ్య‌వ‌హ‌రించిన‌ట్లు రాహుల్ ఆరోపించార‌ని తెలిపారు. 
 
కోర్టు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు రాహుల్ స‌మాధానం ఇచ్చారు. స్టేట్మెంట్‌ను రికార్డు చేశామ‌ని, ఆగ‌స్టు 12వ తేదీన సాక్ష్యాల‌ను కోర్టులో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు న్యాయ‌వాది సంతోష్ తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు ఆగస్ట్‌ 12కి వాయిదా వేసింది. తదుపరి విచారణకు రాహుల్‌ గాంధీ కోర్టుకు హాజరుకానవసరం లేదని తెలిపింది.