ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు నోటీసులు

ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వానికికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు మార్చాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ వాదనలు పరిగణనలోకి తీసుకున్న అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి, ఇతర ప్రతివాదులకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

ఓటుకు నోటు కేసు హైదరాబాద్ నుంచి కేసు విచారణ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు మార్చాలని ట్రాన్స్ఫర్ పిటిషన్‌ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్‌, ఎమ్మెల్సీ సత్యవతి రాథోథ్‌, మహమ్మద్‌ అలీలు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ జరిపింది. 
 
కేసు విచారణను భోపాల్‌కు బదిలీ చేయాలన్న వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, ఇతర ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. రేవంత్‌రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నందున.. దర్యాప్తు పారదర్శకంగా జరగదనే అనుమానాల్ని పిటిషన్‌లో వ్యక్తం చేశారు. ట్రయిల్ మొదలైతే విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉందని పిటిషనర్ జగదీష్ రెడ్డి తరపు న్యాయవాది మోహిత్ రావు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. 
 
ఒకవేళ ట్రయల్‌పై అలాంటి ప్రభావం ఉందనుకుంటే తాము ఎలా చూస్తూ ఉంటామని జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో ట్రయల్‌ని నిలుపుదల చేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా పిటీషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.  సీఎం రేవంత్‌ రెడ్డిపై 88 క్రిమినల్‌ కేసులు నమోదైనట్లు పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
దీంతో, నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం నాలుగు వారాల్లో స్పందించాలని అందులో పేర్కొంది. ఈ నోటీసులకు ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది. పిటిషనర్ వాదనలు పరిగణనలోకి తీసుకున్న అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి, వ్యక్తిగతంగా సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ప్రతివాదులకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు నాలుగు వారాల్లో స్పందించాలని అందులో పేర్కొంది.

2015లో టీడీపీలో ఉన్న రేవంత్‌రెడ్డి.. అప్పటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కొనుగోలు చేసేందుకు ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు లంచం ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డారు. ఈ అంశంపై ఏసీబీ కేసు నమోదుచేసింది. కేసు హైదరాబాద్‌లో ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట పెండింగ్‌లో ఉన్నది. ప్రస్తుతం ప్రధాన నిందితుడు సీఎం అయినందున విచారణను ప్రభావితం చేసే ప్రమాదం ఉన్నదని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించేందుకు ఆసారం లేదని పిటిషనర్ల తరఫున న్యాయవాదులు సిద్ధార్థ దవే, శేషాద్రి నాయుడు వాదించారు.
గతంలో ఇదే తరహా కేసుల్లో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. ప్రధాన నిందితుడే ఇప్పుడు రాష్ట్ర హోంమంత్రిగా కూడా ఉన్నందున కేసు దర్యాప్తు జరిపే పోలీసులు ఆయన కిందే పనిచేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కేసు విచారణ ప్రారంభమైతే పాలకుల పక్షపాత ధోరణి ప్రభావం కేసు విచారణపై ప్రతికూలంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకు స్పందించిన ధర్మాసనం, ట్రయల్‌పై అలాంటి ప్రభావం ఉంటే తాము చూస్తూ కూర్చోబోమని వ్యాఖ్యానించింది.