* ప్రపంచ యుద్ధాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం
ఉక్రెయిన్‌ను చర్చలకు వచ్చేలా చర్యలు చేపట్టాలని అమెరికాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కోరారు. ఫాక్స్ న్యూస్ జర్నలిస్టు టక్కర్ కార్లసన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో పుతిన్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ ఇవాన్ గ్రెషక్కోవిచ్‌ను అప్పగింతకు సంబంధించిన అంశంలోనూ చర్చకు తాము సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ తెలిపారు.
అమెరికా పౌరుడైన గెర్ష్‌కోవిచ్‌ను గూఢచర్యం ఆరోపణలపై 2023 మార్చి 29న ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్‌ఎస్‌బి) యెకాటెరిన్‌బర్గ్‌లోని యురల్స్ నగరంలో 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించింది. అయితే గెర్ష్‌కోవిచ్ రష్యాలోని జైల్లో ఉంచడంలో అర్థం లేదు. అతన్ని అమెరికాకు అప్పగించేందుకు మేం సిద్ధంగా ఉన్నాము. దీనికనుగుణంగా చర్చలు జరుగుతున్నాయని పుతిన్ తెలిపారు.
అయితే అతన్ని వదిలేయాలంటే, జర్మనీలో ఉన్న తమ ఏజెంట్‌ను విడిపించాలని పుతిన్ అమెరికాను కోరారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమై రెండున్నరేళ్లు అవుతోంది. ఉక్రెయిన్‌లో ఉన్న రష్యన్ జాతీయుల్ని కాపాడుకునేందుకు యుద్ధం చేయాల్సి వస్తోందని తెలిపారు. నాటోలో ఉక్రెయిన్ చేరకుండా ఉండేందుకు కూడా ఆ యుద్ధం అవసరమని పుతిన్ పేర్కొన్నారు.
తమతో చర్చలు నిర్వహించేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సుముఖంగా లేరని, ఆయన్ను చర్చలకు వచ్చేలా అమెరికా చర్యలు చేపట్టాలని పుతిన్ కోరారు. ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాను నిలిపివేసి, ఆ దేశాన్ని చర్చల వైపు మళ్లించాలని కోరారు. తాము ఎప్పుడూ చర్చలను వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌కు అండగా ఉంటూ రష్యా దెబ్బతీయాలనుకుంటున్న పశ్చిమ దేశాల ప్లాన్ ఎప్పటికీ వర్కౌట్ కాదని ఈ సందర్భంగా హెచ్చరించారు.
“2022లో రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధం ప్రారంభమైన కొద్దికాలానికే ఇస్తాంబుల్‌లో జరిగిన శాంతి ఒప్పందానికి రష్యా- ఉక్రెయిన్‌లు దాదాపు అంగీకారం తెలిపాయి. కానీ పశ్చిమ దేశాల ఆదేశానుసారం ఉక్రెయిన్ ఆ శాంతి ఒప్పందాన్ని తిరస్కరించింది” అని పుతిన్ ఆరోపించారు.
“ప్రత్యేకించి శాంతిని వ్యతిరేకించిన వారిలో అప్పటి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ఒకరు. ఇప్పటికైనా పశ్చిమ దేశాలు కానీ, ఉక్రెయిన్ కానీ శాంతిని గురించి ఆలోచించాలి. ఉక్రెయిన్ యుద్ధం కోసం, ప్రత్యేకించి ఉక్రెయిన్‌కి ఆయుధాల పంపిణీ కోసం అమెరికా ఎందుకంత ఖర్చు చేస్తోంది? అలా ఖర్చు చేయాల్సిన అవసరం ఏముంది? అసలు అమెరికాకు ఇది అవసరమా? అమెరికా, జార్జియా, పోలాండ్ దేశాల నుంచి వచ్చిన కిరాయి సైనికులు ఉక్రెయిన్ కోసం పోరాడుతున్నారు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
1991లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత రష్యా ‘నాగరిక ప్రజలు’ అని పిలవబడే కుటుంబంలో భాగం కావాలని కోరుకుంది. అయితే నాటో తూర్పువైపు విస్తరించడంతో దాని ఆశలు ఆవిరైపోయాయి. ప్రస్తుతం వేగవంతమైన ఆర్థిక వృద్ధి కారణంగా పశ్చిమ దేశాలు రష్యా కంటే చైనాకే ఎక్కువ భయపడుతున్నాయని పుతిన్ తెలిపారు.
అలాగే పుతిన్ ఈ ఇంటర్వ్యూలో ఎఐ గురించి ప్రస్తావిస్తూ ‘రోమన్ సామ్రాజ్య పతనం సమయంలో కంటే ప్రపంచం వేగంగా మారుతున్నది. ప్రస్తుతం జన్యుశాస్త్రవేత్తలు సూపర్‌మ్యాన్‌ని సృష్టించగలరు. దీనికి ఉదాహరణగా ఎలోన్ మస్క్ మానవ మెదడులో చిపన్ ఉంచారు’ అంటూ ఆయన చమత్కరించారు.
ప్రపంచ యుద్ధాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) ప్రభావం పడనుందని చెబుతూ సాంకేతికంగా అభివృద్ధి చెందినా, పురోగతి సాధించినా మానవత్వం గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రష్యా అధ్యక్షుడు స్పష్టం చేశారు. ప్రచ్ఛన్న యుద్ధం వేళ అణు యుధ నియంత్రణకు మార్గదర్శకాలుగా కృత్రిమ మేథస్సును ఉపయోగించాలని పుతిన్ సూచించారు.
ఎఐ అనియంత్రిత అభివృద్ధిని ఆపలేమని ఒక అవగాహనకు వచ్చినప్పుడు, మొత్తం మానవాళికే ముప్పు వాటిల్లుతుందనుకున్నప్పుడు దీన్ని ఎలా నియంత్రించాలనే దానిపై అంత:రాష్ట్ర స్థాయిలో చర్చలు జరుగుతాయని తనకు అనిపిస్తోందని పుతిన్ పేర్కొన్నారు.
More Stories
ఆరు నెలల్లో ఏపీకి కేంద్రం రూ 3 లక్షల కోట్ల సాయం
జగన్ ప్యాలస్ లపై ఆరా తీసిన అమిత్ షా
ఎన్కౌంటర్లో మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి దామోదర్ మృతి