వాల్మీకి రామాయణంలో లేని శ్లోకాలను ఉన్నట్లు నమ్మించే యత్నం

విద్యశ్రీ
 
ఒక అబద్దాన్ని పదే పదే ప్రస్తావించడం ద్వారా నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తారు కొంతమంది ప్రబుద్ధులు. రచయిత దేవరాజ్ మహారాజ్ ఇదే కోవకు చెందుతారని నూటికి నూరు శాతం చెప్పవచ్చు. వాల్మీకి రామాయణంలో లేని శ్లోకాలను ఉన్నట్లు కొన్ని ఉదాహరణలు ఉటంకిస్తూ అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నం చేశారు. 
 
దేవరాజు మహారాజు తన వ్యాసంలో రాసినవన్నీ అవాస్తవాలు, అభూత కల్పనలు, అసత్యాలు. వాల్మీకి రామాయణంలో బుద్ధుడిని దూషించారని చెబుతూ  ప్రజలను ఎలాగైనా నమ్మించాలనే దురుద్దేశ్యంతో ఒకట్రెండు శ్లోకాలను జోడించారు. 

గమనించాల్సిన విషయం ఏమిటంటే వ్యాసకర్త చెప్పిన శ్లోకాలు రామాయణంలో లేకపోవడం వ్యాసకర్త దురుద్దేశపూరిత మనస్తత్వానికి నిదర్శనం. శ్లోకాలే కాని వాటితో పాటు సంస్కృతంలో అర్థమే లేని వాటిని శ్లోకాలుగా పేర్కొంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. తప్పుల తడకగా ఉన్న శబ్దాల అల్లిక శ్లోకాలుగా గుర్తించని వాటిని సంస్కృత పదాలుగా  మార్చి అయోమయానికి గురి చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదు.

అయోధ్యకాండలో 119 సర్గలు ఉంటే 13511 సంఖ్య ఎక్కడి నుంచి వచ్చింది? వ్యాసకర్త తన వ్యాసంలో  “తస్మాధ్వి యః శక్యతమ్: పూజానా సనాస్తి కె నాభీ ముఖో బుద్ధస్యతూ” ఉటంకిస్తూ దీనికి 13511 సంఖ్య ఇచ్చారు. దీనిని 135వ సర్గలోని 11వ శ్లోకం అని అనుకోవాలా? అయోధ్యకాండలో 119 సర్గాలు మాత్రమే ఉండగా ఇదెలా సాధ్యం?

 సరే ఒకవేళ 1 వ కాండము,35 వ సర్గo ,11వ శ్లోకం అని భావించాల్సి వస్తే అక్కడ ఉన్న శ్లోకం వేరు. 1 వ కాండము, 35 వ సర్గo 11వ శ్లోకంను పరిశీలిస్తే…
 “విశ్వామిత్రం మహాత్మానం పరివార్య సమంతతః,
సంప్రహృష్టమనారామో విశ్వామిత్రమథాబ్రవీత్.”(1-35-11)గా ఉంది. 
 
దీనిని బట్టి  పిచ్చి పిచ్చి రాతలను వాల్మీకి రామాయణంలో చొప్పించేందుకే వ్యాసకర్త ప్రయత్నించి అబద్ధాలతో కూడిన కల్పిత కథలని వండి వడ్డించారు.  వ్యాసకర్త చెప్పిన మరో శ్లోకం కూడ అంతే. శ్లోకాలుగా గుర్తించని వాటిని శ్లోకాలుగా పేర్కొంటూ తిమ్మిని బమ్మిని చేసేందుకు కట్టు కథలతో  నానా అబద్ధాలతో శత విధాలుగా ప్రయత్నించారు.
 
హిందూ సమాజ ఐక్యతను దెబ్బ తీసే ప్రయత్నంలో అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో హిందువులు కులాలకతీతంగా ఒక్క తాటిపైకి వచ్చి పండుగ చేసుకున్నారు. ఏ సంస్థతో సంబంధం లేకుండా ఎవరికి వారు ఇళ్లపై కాషాయ ద్వజాలు రెపరెపలాడించారు. 
 
ఇళ్లలో ప్రసాదం వండుకుని గుళ్ళలో పంచి పెట్టారు. అంతా ఒక్కటై సామూహిక భజనలు చేశారు. అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట రోజైన జనవరి 22 దేశమంతా పండుగ జరుపుకుంది. హిందువులలో వచ్చిన చైతన్యం, ఐక్యమత్యం చూసి విదేశీ మతాలు, ఆ మత పెద్దలు విసిరే బిస్కెట్ లకు ఆశ పడే వారి కళ్ళుకుట్టాయి. 
 
ఇంకేముంది అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట జరిగిన మరుసటి రోజు నుంచి హిందువులలో చీలికలు తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. కులాల పేరిట విభజించే కుట్రలకు తెర లేపారు. హిందూ మతంలో అంతర్భాగమైన బౌద్ధాన్ని వేరుచేయడానికి,  ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పూనుకున్నారు. 
 
ఈ కుట్రల వెనుక ఎవరున్నారనే విషయం హిందువులకు తెలుసు. ఈ విషయంపై హిందువులకు స్పష్టత ఉంది. లేనివి ఉన్నట్లు అబద్ధాలతో పబ్బం గడుపుకునే కుట్రలకు కాలం చెల్లింది. యావత్ హిందూ సమాజం జాగృతమైంది. మీ అబద్ధాలను పట్టించుకునే స్థితిలో హిందువులు లేరు. దీనికంటే అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగిన సంతోషంలో ఈ పండుగ ఆనందంలో పరవశిస్తున్నారు.