రాజ‌కీయ దురంధురుడు పివికి `భారత రత్న’

బార‌త‌దేశాన్ని ప్ర‌గ‌తిప‌థం వైపు అడుగువేసేందుకు బ‌ల‌మైన పునాధులు వేసి మౌన‌ముని, రాజ‌కీయ దురంధురుడు, ప్ర‌గ‌తి శీల‌కుడు పాముల‌ప‌ర్తి వెంక‌ట న‌ర‌సింహ‌రావుకు భార‌త ర‌త్న పుర‌స్కారం ల‌భించింది. బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజనీతిజ్ఞుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధాన మంత్రిగా ఇలా ఏ పదవిని చేపట్టినా తనదైన ముద్రవేశారు. 

తన తర్వాత వచ్చేవారికి ఓ మార్గదర్శిగా నిలిచారు. తెలుగుజాతి ఖ్యాతిని దశదిశలా చాటిన పాములపర్తి వెంకటన నరసింహారావు (పీవీ నరసింహారావు)కు కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నను ప్రకటించడంతో తెలుగువారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పీవీ నరసింహారావు భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా సేవలందించారు. 1957లో శాసనసభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. తెలంగాణలోని  వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28న ఓ బ్రాహ్మణ కుటుంబంలో పీవీ జన్మించారు. తండ్రి సీతారామ రావు, తల్లి రుక్మాబాయి కాగా.. మూడేళ్ల వయసులో పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు ఆయన దత్తత తీసుకున్నారు. 

మూడేళ్ల వయసులో హన్మకొండ జిల్లాలోని భీమదేవరపల్లె మండలంలోని వంగర అనే గ్రామానికి వెళ్లారు. ప్రాథమిక విద్య అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేశారు. 1930వ దశకం చివరలో హైదరాబాద్ స్టేట్‌లో వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్నారు.

పుణేలోని ఫెర్గూసన్ కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పుచ్చుకుని.. కొన్నాళ్లు కాకతీయ పత్రికలో జయ-విజయ పేరుతో వ్యాసాలు రాశారు. స్వాతంత్ర్యం అనంతరం రాజకీయాల్లోకి వచ్చి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంథని నియోజకవర్గం నుంచి 1957లో కాంగ్రెస్ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1962, 67, 72లో వరుసగా విజయం సాధించారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన పీవీకి మంత్రి పదవి దక్కింది. తొమ్మిదేళ్లపాటు న్యాయ, సమాచార, వైద్య, పరపతి శాఖల మంత్రిగా పనిచేశారు.

1969 నాటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం అప్పుడే చల్లారింది. ముఖ్యమంత్రిని మార్చడమనేది కాంగ్రెసు పార్టీ ముందున్న తక్షణ సమస్య. తెలంగాణా ప్రజల, ఉద్యమనేతల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణా ప్రాంత నేతను సీఎంగా ఎంపిక చెయ్యడమనేది అనివార్యమైంది. ముఖ్యమంత్రి పదవి ఆశించేవారి జాబితా ఎక్కువగా ఉండంతో వివాదరహితుడు, పార్టీలోని ఏ గ్రూపుకూ చెందని రాజకీయ నేపథ్యం ఉన్న పీపీని అధిష్ఠానం ఎంపిక చేసింది. 

1971 సెప్టెంబరు 30న ఆయన ముఖ్యమంత్రిగా బాధత్యలు చేపట్టి రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగిన ఆయన తర్వాత రాష్ట్ర రాజకీయాల నుండి నిష్క్రమించాడు.  1977లో హనుమకొండ లోక్‌సభస్థానం నుంచి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1980లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు.

ఆ తర్వాత 1984, 89 సంవత్సరాల్లో మహారాష్ట్రలోని రాంటెక్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్రంలో హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖలలో పనిచేశారు. పీవీని ప్రధాని పదవి అనుకోకుండా వరించింది. 1991 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకుండా దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నారు.

ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకుడు లేకుండా పోయాడు. ఆ సమయంలో పీవీ మాత్రమే ఆ పదవికి సరైన దిక్కయ్యారు. 1991లో అనూహ్యంగా అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి వరించింది.  1996 వరకు ప్రధానమంత్రి పనిచేశారు. పీఎం పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు.

దివాలా తీసే స్ధాయికి చేరుకున్న ఆర్ధిక వ్యవస్థలకు పీవీ పునరుజ్జీవనం కల్పించేందుకు కొత్త సంస్కరణలకు బీజం వేసారు. అందుకే పీవీని ఆర్ధిక సంస్కరణల పితామహుడు అంటారు. పంజాబ్ తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసిన ఘనత పీవీ ప్రభుత్వానిదే. 1998లో వాజపేయి ప్రభుత్వం జరిపిన అణు పరీక్షల కార్యక్రమం మొదలు పెట్టింది పీవీ ప్రభుత్వమే.

రాజకీయాల్లో క్షణం తీరిక లేకపోయినా పీవీ తన రచనా వ్యాసంగాన్ని విడిచిపెట్టలేదు. విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన ‘వేయిపడగలు’కు హిందీ అనువాదం రాశారు. దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.  ‘పన్ లక్షత్ కోన్ ఘతో’ అనే మరాఠీ పుస్తకాన్ని ‘అబల జీవితం’ అనే పేరుతో తెలుగు అనువాదం చేసారు. అనేక వ్యాసాలు రాశారు.

పీవీ నర్సింహారావు సత్యమ్మరావును వివాహం చేసుకున్నారు. 1970, జూలై 1 న ఆమె కన్నుమూసారు. పీవీకి ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. తన ఆత్మకథ రెండో భాగం రాసే ఉద్దేశం ఉండేదట పీవీకి. అది నెరవేరకుండానే 2004, డిసెంబర్ 23న పీవీ కన్నుమూసారు. ఆయన స్మృత్యర్థం హైదరాబాదులో భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లై ఓవర్ కు ‘పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే’ అని పేరుపెట్టారు.